Thapi mestri
-
బేల్దార్.. దాదా! తాపీ పని చేసే వ్యక్తి తాపీగా హత్యలు చేసే స్థాయికి..
తాపీ పని చేసే వ్యక్తి తాపీగా హత్యలు చేసే స్థాయికి ఎదగడం సినిమాల్లో చూశాం! బీర్భూమ్ ప్రధాన నిందితుడు అనరుల్ హుస్సేన్ కథ కూడా అలాంటిదే! చిన్న గుడిసెలో ఉండే బేల్దార్ అనరుల్ మూడంతస్తుల భవనంలో ఉండే దాదాగా మారిన తీరు అనూహ్యం. తానుండే ప్రాంతంలో చాలామందికి అనరుల్ ఒక దైవదూత. కానీ ఈ దైవదూత వెనుక చీకటి కోణాలు అనేకం. సజీవ దహనం కేసులో సీబీఐ అరెస్టు చేసేవరకు అనరుల్‌ను తాకడానికి స్థానిక పోలీసులు కూడా భయపడేవారు. ఆ ప్రాంతానికి అతను మకుటం లేని మహారాజు. చిన్నతనంలో తండ్రితో కలిసి అనరుల్ తాపీ పనులకు వచ్చేవాడని, తర్వాత మేస్త్రీగా ఎదిగాడని స్థానికులు గుర్తు చేసుకుంటారు. అప్పటినుంచే ఏదో సాధించాలన్న కసి అతనిలో ఉండేదని అనరుల్ చిన్నప్పటి స్నేహితుడు స్వపన్ మండల్ చెప్పారు. లక్ష్యసాధన కోసం తొలుత అన్రుల్ కాంగ్రెస్‌లో చేరాడు. అనంతరం మమత నేతృత్వంలోని టీఎంసీలోకి వచ్చి రామ్‌పుర్హాత్ బ్లాక్1 ప్రెసిడెంట్ అయ్యాడు. సజీవ దహనం కేసు దర్యాప్తునకు పోలీసులు బోగ్తుయ్ ఊర్లోకి రాకుండా అనరుల్ అడ్డుకున్నాడంటే అతని పరపతి అర్థం చేసుకోవచ్చు. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోయినట్లు చివరకు సీబీఐ చేతికి చిక్కాడు. అవినీతి సోపానాలు అనరుల్ హుస్సేన్ ఎదుగుదల వెనుక అవినీతి, అక్రమాలున్నాయని, స్థానికంగా నర్సరీ నడిపే కార్తీక్ మండల్ చెప్పారు. పలు సంవత్సరాలుగా అనరుల్ అక్రమ సంపాదన కొనసాగిందన్నారు. ‘‘ఆయన ఇల్లు చూడండి. ఒక మేస్త్రీ ఇల్లులాగా ఉందా అది? గడిచిన రెండు దశాబ్దాల్లో అతను ఇంత శక్తిని, ఆస్తిని కూడబెట్టాడు. నిజాయితీపరుడెవరూ స్వల్పకాలంలో ఇంత కూడబెట్టలేడు’’ అని కార్తీక్ వ్యాఖ్యానించారు. తన స్థలాన్ని కబ్జా చేసి మరీ అనరుల్ ఇల్లు కట్టాడని ఆరోపించారు. స్థానిక ఎంఎల్ఏ, అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీకి హుస్సేన్ చాలా ఆప్తుడని పుకార్లున్నాయి. మంచి పనివంతుడని అనరుల్‌కు పార్టీలో పేరుందని స్థానిక నాయకులు చెప్పారు. 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనరుల్‌కు అడ్డం లేకుండా పోయింది. ఇసుక అక్రమ తవ్వకాలు, స్థానిక సిండికేట్ నిర్వహణ తదితరాల్లో అనరుల్ హస్తం ఉంది. 2019లో అతన్ని బ్లాక్ ప్రెసిడెంట్‌గా తొలగించాలని స్థానిక నేత భావించినా, ఎంఎల్ఏ అండతో గండం తప్పించుకున్నాడు. ఈర్ష్యతో ఆరోపణలు తన తండ్రి ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అనరుల్ కుమార్తె ముంతాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కోరిన పనల్లా ఆయన చేశాడని, అందుకు ప్రతిగా ఆయనపై బురదజల్లుతున్నారని ఆమె ఆవేదన చెందా రు. అయితే అనరుల్ లాంటివాళ్లు టీఎంసీలో చాలా మంది ఉన్నారని, ప్రస్తుతం ఇతనొక్కడే బయటపడ్డాడని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆశిష్ కింద చాలామంది అనరుల్ హుస్సేన్ లాంటి వాళ్లున్నారన్నారు. టీఎంసీ పాలనలో ఇలాంటి బాహుబలులు చాలామంది పుట్టుకువచ్చారని దుయ్యబట్టారు. వీరంతా స్థానిక సామంతరాజులని విమర్శించారు. ప్రస్తుతం అనరుల్‌ను పోలీసు కస్టడీలో ఉంచారు. ఇకపై ఆయన్ను సీబీఐ విచారించనుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
నమ్మించి.. నట్టేటముంచి
శ్రీకాకుళం రూరల్ : వారంతా రోజువారీ కూలీలే. కష్టాన్ని నమ్ముకున్న నిరుపేదలే. దాచుకున్న సొమ్ముంతా ఊళ్లో ఉన్న నమ్మకస్తుడి చేతుల్లో పెట్టారు. మూడుంతలు చేసి ఇస్తామంటూ మాయమాటలు చెప్పి అందరినీ నమ్మించాడు. రూ.కోట్ల కొద్దీ కలెక్షన్లు రావడంతో కొద్దిరోజులకే మకాం మార్చేయడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. అధికారపార్టీ నేత సాయంతో విశాఖలో తలదాచుకున్న మాయగాడిని పట్టుకుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు ఆదివారం తీసుకొచ్చారు. మండలంలోని కిష్టప్పపేట గ్రామానికి చెందిన కొర్ను రాజు తాపీమేస్త్రీగా చేసేవాడు. ఆయన వద్ద పనికి వచ్చే వారికి ‘పది రూపాయలు పెట్టుబడి పెట్టండి. దానికి మూడింతలు ఇస్తా’ అంటూ నమ్మబలికాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చీటిపాటలతో గ్రామస్తులందరినీ నమ్మించాడు. మూడు నెలల వరకూ సజావుగానే ఈ చీటీపాట నిర్వహించాడు. ఒకటి మూడు రెట్లు ఇస్తానని అందరికీ చెప్పడంతో స్థానికులేగాక చుట్టుపక్కల గ్రామాలైన కిష్టప్పపేట, మామిడివలస, సింగుపురం, బైరి గ్రామస్తులు కూడా తమ వద్ద ఉన్న డబ్బులను రాజు చేతిల్లో ఫిక్స్డ్ డిపాజిట్లా పెట్టేశారు. ఇలా 100 నుంచి 150 మంది వద్ద నుంచి సుమారు రూ.కోటి వసూలు చేసి.. ఏడాది క్రితం పరారయ్యాడు. బ్యాంకులకు టోకరా చదువు లేకపోయినా తనకున్న తెలివితేటలతో బ్యాంకులకే టోకరా వేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. 50 సెంట్లు భూమిని బ్యాంకుకు పద్దుపెట్టి రూ.లక్షల్లో లోను తీసుకున్నాడు. దీనిని కట్టేందుకు బ్యాంకు అధికారులకు చుక్కలు చూపించినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు ఆయన ఇంటిని వేలం వేయడంతో ఆ భూమిని మూడో వ్యక్తికి అమ్మి బ్యాంకు లోను కట్టినట్లు సమాచారం. దీంతో పాటు గ్రామంలోని మిగిలిన ఆస్తిపాస్తులు అమ్మి ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్నాడు. మాటువేసి పట్టుకున్న గ్రామస్తులు తన దగ్గర బంధువుతో విజయవాడలోని ఓ కనస్ట్రక్షన్ బిల్డింగ్ పనిలో రాజు తాపిమేస్త్రీగా చేరాడు. తరచూ భార్యతో ఫోన్లో మాట్లాడేవాడు. కిష్టప్పపేట గ్రామస్తులంతా వెళ్లి రాజు ఆచూకీ అడిగినా.. భార్య తెలీదంటూ సమాధానం చెప్పేదని బాధితులు తెలిపారు. ఒక దశలో వ్యక్తిగత పని మీద భార్య స్వస్థలమైన ఎచ్చెర్ల వచ్చేందుకు రాజు విజయవాడ నుంచి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న కిష్టప్పపేట గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ముందస్తుగా మాటువేసి రెండు రోజులు క్రితం పట్టుకుని రూరల్ పోలీసులకు అప్పగించారు. మాటమాటకో మార్పు ఈ విషయం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. దీంతో బాధితులందరూ పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గంటగంటకో మాట చెబుతున్నట్లు సమాచారం. ఒకసారి స్టాక్ మార్కెట్లో పెట్టానని.. ఇంకోసారి విశాఖలోని ఓ వ్యక్తి వద్ద రూ.25లక్షలు వడ్డీకి ఇచ్చానని పొంతలేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. కొడుకు చదువు కోసం డబ్బులు దాచాను నా కొడుకు చదువు నిమిత్తం రూ.90వేలు దాచిపెట్టా. గ్రామంలో అందరి ముందు నమ్మకంతో ఉండేవాడు. ఎక్కడికీ వెళ్లిపోడన్న ఆశతో ఆయన దగ్గరే దాచాను. ఇలా ముంచేస్తాడనుకోలేదు. – గుండ సూర్యనారాయణ, కిష్టప్పపేట కష్టమంతా చేతిలో పెట్టాను కష్టపడిన సొమ్మంతా తాపీమేస్త్రి చేతిలో పెట్డా. ఆయన చెప్పిన మాటలే నమ్మాను. సుమారు రూ.లక్ష 50వేలు చిన్న కూతురి పెళ్లి కోసం దాచి పెట్టాను. ఇలా మోసం చేస్తాడనుకోలేదు. – కొరికాన మల్లమ్మ, కిష్టప్పపేట అన్నింటిలోను మోసపోతున్నాం మొన్న అగ్రిగోల్డ్‌లో లక్షలు కట్టి మోసపోయాం. ఇప్పుడు నమ్మకమైన వ్యక్తి చేతిలో పెట్టి మరింత అన్యాయానికి గురయ్యాం. పైసాపైసా కూడబెట్టి ఊళ్లో వ్యక్తి చేతిలో పెడితే ఇంత మోసం చేస్తాడనుకోలేదు. కూలీనాలీ చేసుకొని దాచుకున్న రూ.1.50లక్షలు కాజేశాడు. – అరసవల్లి ఏకాసి, గ్రామస్తురాలు -
నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్య
వింజమూరు(నెల్లూరు): పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువకుడు నడిరోడ్డుపై మృతిచెందాడు. రోడ్డు మీద పడి కొట్టకుంటున్నా స్థానికులు ఎవరూ స్పందించకపోవడంతో.. అక్కడే మృతిచెందాడు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు బంగ్లాసెంటర్లో బుధవారం జరిగింది. వివరాలు.. కొండాపురం మండలం గొట్టికొండాల గ్రామానికి చెందిన మౌలాలి(28) తాపి మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు బంగ్లా సెంటర్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.