నల్లగొండ లైంగికదాడి ఘటనలో ముగ్గురి సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని ఓ హాస్టల్లో జరిగిన లైంగిక దాడి, హైదరాబాద్లోని గౌతమ్ మోడల్ స్కూల్లో జరిగిన ఘటనలపై పాఠశాల విద్యాశాఖ విచారణ చేపట్టింది. రెండు జిల్లాలకు చెందిన డీఈవోలు మంగళవారం సంబంధిత పాఠశాలల్లో విచారణ జరిపారు. నల్లగొండ ఘటనలో మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుడు, టీచర్ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గౌతమ్ మోడల్ స్కూల్లో ఘటనపై విచారణకు ఆదేశించారు.
‘బాధితులను ఆదుకుంటాం’
బాలికలపై అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిం చాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. స్టేట్హోంలో ఆశ్రయం పొందుతున్న నల్లగొండ జిల్లా అత్యాచార బాధిత బాలికలను మంగళవారం ఆయన పరామర్శించారు. బాధిత బాలికలను ఆదుకోవాలని, జరిగిన ఉదంతానికి సంబంధించి ప్రభుత్వం కోర్టుకు సాక్ష్యాధారాలను అందించాలన్నారు. నల్లగొండలోని రెసిడెన్షియల్ పాఠశాలలో వారిని చదివించడంతో పాటు ఒక్కొక్కొరికీ రూ.25వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు.