కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేయాలి
తొగుట: దశాబ్ధ కాలంగా తెలంగాణ ప్రజలను అష్టకష్టాలు పెట్టిన కాంగ్రెస్, బీజేపీలకు ఉప ఎన్నికలో డిపాజిట్లు గల్లంతు చేయాలని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఉప ఎన్నిక దుబ్బాక నియోజక వర్గ ఇన్చార్జి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. తొగుట మండలం రాంపూర్ శివారులోని కోటిలింగాల దేవాలయ ఆవరణలోని కల్యాణ మండపంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశం జరిగింది.
సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌కు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ రావాలన్నారు. తెలంగాణలో సుమారు నాలుగేళ్లుగా వరుస కరువుతో రైతాంగం అల్లాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వలేకపోయిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సునీతా లక్ష్మారెడ్డి ఎందుకు నోరుమెదపలేదన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి 480 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేశారన్నారు. అందులో మెదక్ జిల్లాకు 54 కోట్లు మంజూరయ్యాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో పుష్కలంగా బొగ్గు నిక్షపాలున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నేతల అసమర్థత వల్లే సీమాంధ్రులు థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఆంధ్రలో ఏర్పాటు చేసుకున్నారన్నారు. వారి అసమర్థత వల్లే తెలంగాణ ప్రాంత రైతాంగానికి విద్యుత్ సమస్య తలెత్తిందన్నారు.
తెలంగాణ లో బీజేపీకి మంచిపేరుండేదని తెలంగాణ ద్రోహిగా మారిన జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చి ఆ పేరు కోల్పోయిందన్నారు. బీజేపీలో జగ్గారెడ్డిని చేర్చుకోవడంతో బారతీయ జనతా పార్టీ బాబు జగ్గారెడ్డిపార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే (షాద్‌నగర్) అంజయ్య యాదవ్, జెడ్పీటీసీ కొక్కొండ రూప, ఎంపీపీ గంటా రేణుక తదితరులు పాల్గొన్నారు.