మొట్టమొదటి సారిగా మహిళకు అవకాశం
తండ్రి మెట్ల సత్యనారాయణ, భర్త తోట నరసింహంలను ఆదర్శంగా తీసుకుని రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో పాటు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిని ఢీకొంటున్నారు తోట వాణి. ప్రజాసేవ చేయడానికి పుట్టింటి, మెట్టింటి కుటుంబాలు కట్టుబడి ఉన్నాయి. దీనిలో భాగంగా మెట్ల సత్యనారాయణ కోనసీమ రాజకీయాలకు రారాజుగా గుర్తింపు పొందారు. ఆయన కుమార్తె వాణికి మెట్ట ప్రాంతానికి చెందిన తోట నరసింహంతో వివాహం అయింది. దాంతో మెట్ట ఆమె మెట్టినిల్లు అయింది. తోట నరసింహం అన్నగారు తోట వెంకటాచలం పేద ప్రజల మనిషిగా, ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా ఉత్తమ సేవలు అందించడంలో ఆయన గుర్తింపు పొందారు.
అయితే ఆయన ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన వారసునిగా తోట నరసింహం 2004లో రాజకీయ ప్రవేశ«ం చేశారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి నరసింహంకు జగ్గంపేట టిక్కెట్టు కేటాయించారు. 2004, 2009లో వరుసగా విజయాలు సాధించి రెండో పర్యాయం మంత్రి పదవి దక్కించుకున్నారు. 2013లో అడ్డగోలు రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ని వీడి నరసింహం కాకినాడ ఎంపీగా టీడీపీ నుంచి విజయం సాధించారు. 2014లో కిర్లంపూడి మండలం వీరవరం గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై, రాజకీయ ప్రవేశం చేశారు ఆయన భార్య వాణి. ఇటీవల తోట నరసింహం అనారోగ్యానికి గురి కావడంతో ఆమెకు ఎమ్మెల్యే టిక్కెట్టు కేటాయించాలని చంద్రబాబును కోరినా ఆయన పట్టించుకోకపోవడంతో పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఉండదని భావించి పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు ఆ దంపతులు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోట వాణి తన మనసులో మాటను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి హేళన పట్టుదల పెంచింది
పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికై, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ‘ఒక మహిళ వస్తుంది.. కంట తడి పెడుతుంది..’ అంటూ హేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలు నాలో మరింత పట్టుదలను పెంచాయి. ఒక వైపు నా భర్త అనారో గ్యంతో ఉన్నా ఆయనను చూసుకొంటూ ప్రతీ రోజు 10 గంటల పాటు ప్రచారం చేస్తున్నాను. మంచి చేసే వారికి ఎప్పుడు ఆ భగవంతుని దయ ఉంటుందనే నమ్మకం నాకు ఉంది. ప్రజల కు సేవ చేయాలనే లక్ష్యంతోనే నా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది. ప్రజలు అవకాశం ఇస్తే నా సేవా తత్పరత నిరూపించుకుంటాను. ఇప్పటికే నా భర్త ఎమ్మెల్యేగా, మంత్రి, ఎంపీగా జిల్లాకు ఎంతో సేవ చేశారు. జగన్మోహన్రెడ్డి నాకు పెద్దాపురం టిక్కెట్టు ఇవ్వడంతో ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని ప్రముఖులను, వివిధ పార్టీ నాయకులను కలుసుకుంటున్నాను. వారి ఆశీస్సులు లభించడంతో పాటు ప్రతీ గ్రామంలో అనేక మంది పార్టీలోనికి చేరడంతో పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెరుగుతోంది.
మొట్టమొదటి మహిళగా అవకాశం ఇచ్చారు
పెద్దాపురం నియోజకవర్గం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా మహిళకు అవకాశం ఇచ్చి మహిళా పక్ష పాతిగా జగన్మోహన్రెడ్డి గుర్తింపు పొందారు. ప్రజానేతగా గతంలో ఎన్నడూ ఎవరూ చేయని విధంగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించి అనేక సమస్యలు తెలుసుకున్నారు. నాపై ఎంతో నమ్మకంతో పెద్దాపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని పార్టీ జెండాను ఎగురవేస్తాను.
ప్రత్యేక హోదాతోనే ప్రగతి
జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుంది. ప్రత్యేక హోదా కోసం ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా తాను కాకినాడలో ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఈ ప్రత్యేక హోదా జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం అవుతుంది.
నవరత్నాలు మేలు చేస్తాయి
జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి. వాటిని నేను ప్రచారం ద్వారా ప్రజల వద్దకు తీసుకు వెళ్తాను. మద్యపానం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జగన్మోహన్రెడ్డి అం చెలంచెలుగా మద్యపానాన్ని నిషేధిస్తానని ప్రకటించడంతో మహిళలకు ఒక అండ దొరికినట్టు అవుతుంది. మహిళగా ప్రతీ కుటుంబం సమస్యలను గ్రామ సర్పంచ్‌గా పని చేసిన సమయంలో తెలుసుకున్నాను. మహిళ ఒక తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా కుటుంబానికి అన్ని విధాలా తోడుగా ఉంటుంది. మహిళ సం తోషంగా ఉంటే ఆ కుటుం బం ఆనందంగా ఉంటుంది. దీని కోసం మహిళా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఆ సమస్యలను జగన్మోహన్రెడ్డి దృష్టిలో ఉంచి పరిష్కరిస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన ప్రచారంలో ప్రజల నుంచి అపూ ర్వ స్పందన లభిస్తుంది. మహిళకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని మహిళలు హామీ ఇస్తున్నారు. ఓటర్లు ప్రభుత్వ మార్పును కోరుకొంటున్నారు.
నియోజకవర్గాన్ని అని విధాలా అభివృద్ధి చేస్తా
ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు ప్రకటనలు చేస్తూన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు ఉన్న ఏకైక నియోజకవర్గం పెద్దాపురం. ఐదేళ్లు పూర్తి అయినా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేక పోయారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధించలేక పోయారు. గ్రేడ్–2 మున్సిపాలిటీ అయిన సామర్లకోటలో గ్రంథాలయం అద్దె భవనంలో ఉండటం ఆశ్చర్యం వేస్తుంది. అభివృద్ధి పేరుతో భారీ ఎత్తున అవినీతి జరిగింది. అభివృద్ధి పనులు నాసిరకంగా ఉన్నాయి. పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధిలో నా భర్త తోట నరసింహం ఎంపీగా కేంద్రం నుంచి తీసుకు వచ్చిన నిధులే ఎక్కువగా ఉన్నాయి. మరుగుదొడ్ల నుంచి, అందరికీ ఇళ్లు, ఉపాధి హామీ నిధులతో రోడ్లు నిర్మాణం చేశారు. ప్రచారంలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతాను. ప్రజా ప్రతినిధిగా అభివృద్ధి పనులు చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంటుంది.
-అడపా వెంకట్రావు, పెద్దాపురం నియోజకవర్గం.