Transfer List
-
68 మంది డీఎస్పీలకు స్థాన చలనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. 68 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న వారు నేరుగా చీఫ్ ఆఫీసర్‌కు రిపోర్టు చేయాలని సూచించారు. -
చనిపోయిన వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేశారు..!
లక్నో : చనిపోయిన వ్యక్తికి ట్రాన్సఫర్ ఆర్డర్ ఇచ్చి రికార్డ్ సృష్టించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. వివరాలు.. సత్య నారాయణ సింగ్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం మరణించాడు. అయితే చనిపోయే నాటికి అతను డీఎస్పీగా పని చేసున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యూపీ పోలీసు ఉన్నతాధికారులు ట్రాన్సఫర్ లిస్ట్ తయారు చేశారు. అయితే ఇందులో మరణించిన సత్య నారాయణ సింగ్ పేరును కూడా చేర్చి.. జాబితాను ప్రకటించారు. పొరపాటును గుర్తించిన యూపీ డీజీపీ ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈ రోజు ప్రచురించిన ట్రాన్సఫర్ లిస్ట్‌లో మరణించిన డీఎస్పీ సత్యనారాయణ పేరు ఉండటం చాలా బాధకరం. దాన్ని క్యాన్సల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాను. కానీ ఇలాంటి తప్పులను సహించకూడదు. డిపార్ట్మెంట్ హెడ్‌గా ఈ విషయం గురించి క్షమాపణలు చెప్తున్నాను. ఇందుకు బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాక ఇక మీదట ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానం’టూ డీజీపీ ట్వీట్ చేశారు. -
బదిలీల్లో ఒప్పందాలు!
టీచర్ల ట్రాన్స్ఫర్లలో హెచ్ఆర్ఏ స్థానాల కోసం సరికొత్త ఎత్తుగడ జాబితాలో మొదటివరుసలోని వారితో మిలాఖత్ - టీచర్ల ట్రాన్స్ఫర్లలో హెచ్ఆర్ఏ స్థానాల కోసం సరికొత్త ఎత్తుగడ - జాబితాలో మొదటివరుసలోని వారితో మిలాఖత్ సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో కొత్తకోణం వెలుగు చూస్తోంది. పట్టణ ప్రాంతాల్లోనే దీర్ఘకాలం కొనసాగేందుకు కొందరు సరికొత్త ఎత్తుగడ వేశారు. వాస్తవానికి 30 శాతం హెచ్ఆర్ఏ లభించే పట్టణ ప్రాంతాల్లో ఒక ఉపాధ్యాయుడు గరిష్టంగా ఎనిమిదేళ్ల పాటు మాత్రమే కొనసాగాలి. ఈ నిబంధనను తొక్కిపెట్టి.. ఏళ్ల తరబడి అర్బన్ ప్రాంతాల్లోనే పలువురు టీచర్లు కొనసాగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లకు ‘పట్టణ యోగం’ కలగానే మిగిలిపోతోంది. ఇలా కుదుర్చుకుందాం.. ప్రస్తుతం రెండేళ్లు ఒకే చోట పనిచేసిన టీచరు బదిలీకి అర్హుడని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పట్టణ ప్రాంతాల్లో కొనసాగుతున్న కొందరు టీచర్లు వారివారి సబ్జెక్టుల్లో సీనియర్ల తో మంతనాలు సాగిస్తున్నారు. వారిని గ్రామీణ ప్రాంతంలో ఉండేలా అభ్యర్థిస్తూ కొంత మొత్తాన్ని ఆఫర్ చేసేందుకు సైతం సిద్ధపడుతున్నారు. అలా సీనియర్లలో కొంతవరకు కలుపుకొనిపోతే తక్కిన స్థానంలో ఉన్న పట్టణ ప్రాంత టీచర్లు వారు కోరుకున్న అర్బన్ ప్రాంతాల్లోనే కొనసాగేలా వ్యూహాన్ని రచించారు. ఈ మేరకు సోమవారం వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పలువురు టీచర్లు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించుకుని ‘సెటిల్’ చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ తంతులో ఉపాధ్యాయ సంఘం నేతలు ఒకరిద్దరు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యాశాఖకు ఫిర్యాదులు.. టీచర్ల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ సైతం నిఘా పెట్టింది. ఇప్పటికే ఇలాంటి వ్యవహారాలపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు టీచర్లు రహస్యంగా విద్యాశాఖకు వాయిస్ రికార్డింగుల రూపంలో ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది. ఇవి సమర్పించిన వారెవరనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఈ క్రమంలో వాటిని పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక పట్టణల్లో పనిచేసే టీచర్ల బదిలీల అంశంపై ఉపాధ్యాయ సంఘాలు సైతం దృష్టిపెట్టాయి. అవకతవకలు జరిగితే వాటిపై ఉద్యమిస్తామని, పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్ తదితర సంఘాలు ప్రకటించాయి. -
‘ఉయ్’ఆర్వోలు
ఒంగోలు టౌన్ : పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ.. జిల్లా యంత్రాంగంపై పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తమకు అనుకూలమైన వారిని అందలాలు ఎక్కించడం, ప్రతిపక్షపార్టీ సానుభూతి పరులుగా ముద్ర పడిన వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం పనిగా పెట్టుకుంది. రెవెన్యూ శాఖలో కీలక గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో)పై అధికార పార్టీ నేతల కన్నుపడింది. రెండు రోజుల పాటు జరిగిన బదిలీల్లో వీఆర్వోలను ఉయ్(మా) ఆర్వోలుగా మార్చేసుకోవడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులతో పాటు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు చెప్పిన వారికే కోరుకున్నచోట్ల పోస్టింగ్‌లు ఇప్పించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో 750 మంది గ్రామ రెవెన్యూ అధికారులు ఉన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా 20 శాతానికి మించి బదిలీలు జరగకూడదు. అదికూడా ఒకే ప్రాంతంలో మూడేళ్లు సర్వీసు నిండిన వారిని మాత్రమే బదిలీ చేయాల్సి ఉంటుంది. పెపైచ్చు గతంలో గ్రామ రెవెన్యూ అధికారులను ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేశారు. తాజాగా రెండు విడతలుగా గ్రామ రెవెన్యూ అధికారులను బదిలీ చేశారు. ఒకసారి 74 మందిని, మరోసారి 74 మందిని బదిలీ చేశారు. ష్... గప్చిప్! ప్రస్తుత బదిలీలు అత్యంత గోప్యంగా జరిగాయి. గతంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాల ప్రతినిధులను పిలిపించి వారి సమక్షంలో బదిలీ ప్రక్రియ పూర్తి చేసేవారు. చివరకు ఆ జాబితాలను గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాలకు కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. కొంతమంది సంఘాల నాయకులు చివరకు పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేసి బదిలీల జాబితా అధికారికంగా వచ్చిందా, అందులో ఎవరి పేర్లు ఉన్నాయని విచారించడం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా యంత్రాంగం కూడా అధికాార పార్టీ శాసనసభ్యులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు చెప్పిన వారికే ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతర్ జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారుల్లో ఎక్కువ మంది బూత్ లెవల్ అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఎన్నికల సంఘం విధుల్లో పాలుపంచుకుంటున్న వారిని బదిలీ చేయరాదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు జిల్లాల స్థాయిలో అమలు కావడం లేదనేందుకు ప్రస్తుతం జరిగిన గ్రామ రెవెన్యూ అధికారుల బదిలీలే ఉదాహరణగా చెప్పవచ్చు.