బదిలీల్లో ఒప్పందాలు!
టీచర్ల ట్రాన్స్‌ఫర్లలో హెచ్‌ఆర్‌ఏ స్థానాల కోసం సరికొత్త ఎత్తుగడ జాబితాలో మొదటివరుసలోని వారితో మిలాఖత్
- టీచర్ల ట్రాన్స్‌ఫర్లలో హెచ్‌ఆర్‌ఏ స్థానాల కోసం సరికొత్త ఎత్తుగడ
- జాబితాలో మొదటివరుసలోని వారితో మిలాఖత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో కొత్తకోణం వెలుగు చూస్తోంది. పట్టణ ప్రాంతాల్లోనే దీర్ఘకాలం కొనసాగేందుకు కొందరు సరికొత్త ఎత్తుగడ వేశారు. వాస్తవానికి 30 శాతం హెచ్‌ఆర్‌ఏ లభించే పట్టణ ప్రాంతాల్లో ఒక ఉపాధ్యాయుడు గరిష్టంగా ఎనిమిదేళ్ల పాటు మాత్రమే కొనసాగాలి. ఈ నిబంధనను తొక్కిపెట్టి.. ఏళ్ల తరబడి అర్బన్ ప్రాంతాల్లోనే పలువురు టీచర్లు కొనసాగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లకు ‘పట్టణ యోగం’ కలగానే మిగిలిపోతోంది.
ఇలా కుదుర్చుకుందాం..
ప్రస్తుతం రెండేళ్లు ఒకే చోట పనిచేసిన టీచరు బదిలీకి అర్హుడని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పట్టణ ప్రాంతాల్లో కొనసాగుతున్న కొందరు టీచర్లు వారివారి సబ్జెక్టుల్లో సీనియర్ల తో మంతనాలు సాగిస్తున్నారు. వారిని గ్రామీణ ప్రాంతంలో ఉండేలా అభ్యర్థిస్తూ కొంత మొత్తాన్ని ఆఫర్ చేసేందుకు సైతం సిద్ధపడుతున్నారు. అలా సీనియర్లలో కొంతవరకు కలుపుకొనిపోతే తక్కిన స్థానంలో ఉన్న పట్టణ ప్రాంత టీచర్లు వారు కోరుకున్న అర్బన్ ప్రాంతాల్లోనే కొనసాగేలా వ్యూహాన్ని రచించారు. ఈ మేరకు సోమవారం వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పలువురు టీచర్లు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించుకుని ‘సెటిల్’ చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ తంతులో ఉపాధ్యాయ సంఘం నేతలు ఒకరిద్దరు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విద్యాశాఖకు ఫిర్యాదులు..
టీచర్ల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ సైతం నిఘా పెట్టింది. ఇప్పటికే ఇలాంటి వ్యవహారాలపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు టీచర్లు రహస్యంగా విద్యాశాఖకు వాయిస్ రికార్డింగుల రూపంలో ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది. ఇవి సమర్పించిన వారెవరనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఈ క్రమంలో వాటిని పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక పట్టణల్లో పనిచేసే టీచర్ల బదిలీల అంశంపై ఉపాధ్యాయ సంఘాలు సైతం దృష్టిపెట్టాయి. అవకతవకలు జరిగితే వాటిపై ఉద్యమిస్తామని, పీఆర్‌టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్ తదితర సంఘాలు ప్రకటించాయి.