రాత్రివేళల్లో కోళ్ల తరలింపు..!
బర్డ్‌ఫ్లూ మరింత విస్తరించే ప్రమాదం
కోళ్లను చంపేస్తారన్న భయంతో వ్యాపారుల అక్రమ మార్గాలు
ఇది మరింత ప్రమాదకరంఅంటున్న అధికారులు
ఇప్పటివరకూ రూ.10 కోట్ల మేర వ్యాపారులకు నష్టం
సాక్షి, హైదరాబాద్: బర్డ్‌ఫ్లూ మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. వేల కోళ్లను పశుసంవర్థక శాఖ అధికారులు చంపేస్తుండటంతో వ్యాపారులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ వచ్చినా రాకున్నా ఆయా ప్రాంతాల్లో కోళ్లను చంపేస్తుండటంతో తమకు కోట్లలో నష్టం వస్తుందని గ్రహించిన కొందరు వ్యాపారులు రాత్రికి రాత్రి వేలాది కోళ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక కోళ్లను చికెన్ కేంద్రాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమని, దీని వల్ల బర్డ్‌ఫ్లూ మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఉదాహరణకు బర్డ్‌ఫ్లూ గుర్తించిన ఒక ఫామ్‌లో దాని యజమాని మొదట 35 వేల కోళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. తీరా వాటిని లెక్కించేసరికి అందులో 52 వేల కోళ్లు ఉన్నాయని తేలింది. తప్పుడు లెక్కలు చూపిస్తూ కొందరు వ్యాపారులు రాత్రి వేళల్లో కోళ్లను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి అమ్మేస్తున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అక్రమంగా ఎన్నింటిని ఎక్కడెక్కడికి పంపారో ఆరా తీస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు బర్డ్‌ఫ్లూ భయాందోళనల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని రోజులపాటు చికెన్ షాపులు తెరవకూడదని.. గుడ్ల అమ్మకాలు కూడా జరపకూడదని వినియోగదారుల సంఘాలు కోరుతున్నాయి.
72 వేల కోళ్ల చంపివేత
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూరు గ్రామంలోని కొన్ని కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధికారక హెచ్5ఎన్1 వైరస్ నిర్ధారణ కావడంతో ఇది మరింత వ్యాప్తి చెందకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మొత్తం 1.45 లక్షల కోళ్లను చంపాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 71,918 కోళ్లను చంపి పాతిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. 8,946 కోడి గుడ్లను ధ్వంసం చేశారు. ఇప్పటివరకూ కోళ్ల చంపివేత వల్ల వ్యాపారులకు సుమారు రూ.10 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కోళ్లను చంపి పాతిపెట్టే కార్యక్రమంలో మొత్తం 62 బృందాలు.. 250 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో పశువైద్యులు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. కోళ్లను పూడ్చిపెట్టే పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ముందస్తుగా టామీఫ్లూ మాత్రలను అందిస్తున్నారు. తొర్రూరు పరిసరాల్లోని కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరిలోనూ బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. తొర్రూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఇంటింటినీ పరీక్షించారు.
రెండు శాఖల మధ్యా లోపించిన సమన్వయం..
బర్డ్‌ఫ్లూపై కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తున్నట్లు.. వచ్చినట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ అధికారులకు తెలియదట. వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్థక శాఖల మధ్య సమన్వయం లోపించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కేంద్ర బృందం రాకపై పశుసంవర్థక శాఖ డెరైక్టర్ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ ప్రశ్నించగా.. ‘కేంద్ర బృందం వస్తుందా? ఎవరు చెప్పారు? నాకు సమాచారం లేదే?’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా, పశుసంవర్ధక శాఖ అధికారులు తమతో కలసిరావడంలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్‌కు కేంద్ర బృందం రాక..
బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నుంచి జాతీయ అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐసీడీ) జాయింట్ డెరైక్టర్లు డాక్టర్ ఎస్.కె.జైన్, డాక్టర్ కర్మాకర్, 16 రకాల అంటువ్యాధులను దేశవ్యాప్తంగా పర్యవేక్షించే ప్రత్యేక నిపుణుడు డాక్టర్ ప్రణయ్‌వర్మ, కేంద్ర ఛాతీ వైద్య నిపుణుడు డాక్టర్ పవన్‌కుమార్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. వీరు గురువారం నుంచి తొర్రూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించి కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తారు. శాంపిళ్లు సేకరించి.. పరీక్షలు నిర్వహిస్తారు. వారం రోజులపాటు ఇక్కడే ఉండి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు.