బెంగాల్ రేప్ ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో గిరిజన యువతిపై 13 మంది అత్యాచారానికి తెగబడిన దారుణ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ కేసును సుమోటాగా విచారణకు స్వీకరిస్తూ రాష్ట ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యువతిపై అఘాయిత్యం జరిగిన లాభ్పూర్ గ్రామానికి వెళ్లి అన్ని విషయాలను వివరిస్తూ వారంలోగా తమకు నివేదిక సమర్పించాలని బీర్భూమ్ జిల్లా జడ్జిని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంవై ఇక్బాల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. వేరే మతస్తుడిని ప్రేమించిందన్న పాపానికి గ్రామ పంచాయతీ పెద్దలు గిరిజన యువతికి రూ.50 వేల జరిమానా విధించడం, అంత మొత్తాన్ని కట్టలేనని ఆమె చెప్పడంతో సర్పంచ్ ఆదేశాలతో గ్రామానికి చెందిన 13 మంది మంగళవారం రాత్రి యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే.