Trimulgherry
-
రియల్టర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ?
సాక్షి, అల్వాల్, రసూల్‌పుర: హైదరాబద్‌లోని తిరుమలగిరి ఠాణా పరిధిలోని పెద్ద కబేళా ఖాళీ స్థలంలో శవమై కనిపించిన రియల్టర్ తోట విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే వరుసకు సోదరుడయ్యే తోట నరేందర్‌రెడ్డి నాటు తుపాకీతో కాల్చి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలు టెంపుల్ అల్వాల్‌లోని శ్రీనివాసనగర్‌కు చెందిన తోట విజయ భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని లావాదేవీలను ఇద్దరూ కలిసి, మరికొన్నింటిని ఎవరికి వారుగా చేసుకునే వారు. అయితే ఉమ్మడి కార్యకలాపాలకు సంబంధించి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. దీంతో కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్ధలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో పడిన నరేందర్ వాటి నుంచి బయటపడటానికి, తనకు రావాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వాలంటూ భాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. కొన్ని రోజుల క్రితం ఓ నాటు తుపాకీని ఖరీదు చేసిన నరేందర్ దాన్ని తన ఇంటి వెనుక ఉన్న చెరువు సమీపంలో పాతి పెట్టాడు. ఆది వారం దీన్ని బయటకు తీసి తన వద్ద ఉంచుకున్నాడు. చదవండి: అమ్మ లొంగలేదని అమ్మాయిని బలిగొన్న కామాంధుడు పథకం ప్రకారం.. సోమవారం ఉదయం తాను కొనుగోలు చేస్తున్న ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం నగదుతో ఇంటి నుంచి కారులో బయలుదేరిన విజయ్‌భాస్కర్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తరవాత శ్రీశైలం వెళ్లి దైవ దర్శనం చేసుకువస్తానంటూ ఇంట్లో చెప్పాడు. కొద్ది దూరంలో నివసించే నరేందర్‌ను తన కారులో ఎక్కించుకున్నాడు. నరేందర్‌రెడ్డి పథకం ప్రకారం విజయ్‌భాస్కర్‌రెడ్డిని పెద్ద కబేళా పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ తనకు రావాల్సిన కమీషన్ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. అదును చూసి వెనుక నుంచి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో విజయ్‌భాస్కర్‌రెడ్డి తలలోకి కాల్చాడు. పుర్రెను చీల్చుకుంటూ దూసుకుపోయిన తూటా లోపలే ఉండిపోయింది. దీంతో ఆయన ముక్కు, చెవులు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. భాస్కర్‌రెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్న నరేందర్ అక్కడ నుంచి నగదును తీసుకుని పారిపోయాడు. కారులో రక్తం మడుగులో ఉన్న విజయ్‌భాస్కర్‌ను సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుర్తించిన స్థానికులు తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆయన అప్పటికే మరణించినట్లు గుర్తించారు. తుపాకీ ఎక్కడ? రంగంలోకి దిగిన పోలీసులు నరేందర్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడు నాటు తుపాకీని రహస్యంగా దాచినట్లు తేలడంతో దాని కోసం గాలిస్తున్నారు. మరోపక్క ఇతడికి ఎవరైనా సహకరించారా? అనే అంశాన్నీ ఆరా తీస్తున్నారు. బుధవారం నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. విజయ్‌భాస్కర్‌రెడ్డి మృతితో శ్రీనివాసనగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఈయనకు భ్యార్య, కుమారుడు, కుమర్తె ఉన్నారు. కుమారుడు ఇటీవల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడని సన్నిహితులు పేర్కొన్నారు. -
పోలీసుల 'లిమిట్' లొల్లి.. నలుగురు మృతి
హైదరాబాద్: పోలీసుల నిర్లక్ష్యం నలుగురు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. చావుబతుకుల్లో ఉన్న వారిని కాపాడాల్సిందిపోయి పరిధుల పంచాయతీ పెట్టడంతో ముగ్గురు చిన్నారులతో సహా నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రాజధాని నగరంలోని తిరుమలగిరిలో ఆర్టీఏ ఆఫీసు ఎదురుగా గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమాచారం తెలిసినా పట్టించుకోని పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 40 నిమిషాల దాకా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఎవరికి వారు తమ పరిధిలోకి రాదంటూ కార్ఖానా, తిరుమలగిరి పోలీసులు తాత్సారం చేశారని వాపోయారు. 'గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. ఫోన్ చేస్తే పోలీసులు స్పందించలేదు. పబ్లిక్ కూడా సహాయం చేయలేదు. అటువైపు వచ్చిన మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్ లోని వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని తరలించార'ని మృతుడి తరపు బంధువొకరు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తన సోదరుడు ఫోన్ చేసి కాపాడాలని అభ్యర్థించాడని మృతుడు అజార్ సోదరి తెలిపింది. ఫోన్ చేసి చచ్చిపోయాడని కన్నీటిపర్యంతమయింది. సంబంధిత వార్త: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం -
కి'లేడీ' దొంగలు!
ఆడదానికి ఆడదే శత్రువు అన్న నానుడి నిజం చేస్తున్నారు 'గొలుసు' దొంగలు. లేడీ చైన్ స్నాచర్ల అవతారమెత్తి తోటి మహిళల మెళ్లో నుంచి బంగారపు గొలుసులు తెంపుకుపోతున్నారు. స్నాచింగ్‌లో మగాళ్లకు తామేమీ తీసిపోమని చోరశిఖామణులుగా మారిన మహిళలు నిరూపిస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర రాజధానిలోనే చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ సాటి వాళ్లను హడలెత్తున్నారు కి'లేడీ'లు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సాధారణంగా స్త్రీలకు సువర్ణాభరణాలతో చెప్పలేంత ప్రీతి. కనక వస్తువులు ఒంటి నిండా అలంకరించుకోవాలని ఉవ్విళ్లూరని వనితలు తెలుగుగడ్డపై అరుదు. శుభకార్యాలు, వేడుకల్లో మహిళలు చూపే బంగారపు ధగధగల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గాజులు, జుకాలు, వడ్డాణాలు, పాపిడి బిందెలు, అరవంకీలు, కాసులపేర్లతో కళకళలాడి పోతుంటారు. ఎంత బంగారం అలంకరించుకున్నా అతివలకు తనివి తీరదు. ఈ మోజే వారి కొంప ముంచుతోంది. మహిళల మెడల్లోంచి బంగారపు గొలుసులు తెంపుకుపోవడాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఒంటరిగా బయటకు వచ్చిన వనితల మెడల్లోంచి బలవంతంగా చైన్లు లాక్కుపోవడం సర్వసాధారణమైపోయింది. ఇప్పుడీ చోరీల్లో మహిళలు పాలుపంచుకోవడం విస్తుగొల్పుతుంది. తాజాగా తిరుమలగిరి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్‌లో ఆడ దొంగలు స్వయంగా పాల్గొనడంతో పోలీసులకు పాలుపోవడం లేదు. జీడిమెట్లకి చెందిన ఉషారాణి ఆదివారం రాత్రి(ఆగస్టు 4) ఆమె తిరుమలగిరి టీచర్స్ కాలనీలో ఉన్న తన తల్లి ఇంటికి హోండా యాక్టివాపై బయల్దేరారు. కాలనీ వద్ద ఎదురుగా ఓ బైక్ వచ్చింది. యువకుడు బైక్ నడుపుతుండగా దాని వెనుక కూర్చున్న యువతి ఎదురుగా మరో వాహనంపై వస్తున్న ఉషారాణి మెడలోని 3 తులాల బంగారం గొలుసును రెప్పపాటులో లాఘవంగా తెంచి పరారైంది. పట్టుకోవటానికి ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. స్నాచింగ్‌కు పాల్పడిన యువతి పంజాబీ డ్రెస్సు.. దానిపై జాకెట్ వేసుకుందని, బైక్‌ను యువకుడు నడిపిస్తున్నాడని బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటిదే మరో ఘటన తిరుమలగిరి పోలీసుస్టేషన్ పరిధిలోని కార్ఖానా ప్రాంతంలో కొద్దివారాల క్రితం చోటుచేసుకుంది. అయితే ఈ రెండు చోరీలకు పాల్పడింది ఒకరేనా, కాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే మగ చైన్ స్నాచర్ల ఆట కట్టించేందుకు లేడీ కానిస్టేబుళ్లను సాధారణ మహిళల మాదిరిగా ముస్తాబు చేసి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న ప్రాంతాలకు వీరిని పంపి కొంతమంది మగ గొలుసు దొంగలను పట్టుకున్నారు. మరీ లేడీ చైన్ స్నాచర్లకు ముకుతాడు వేసేందుకు పోలీసులు ఎలాంటి ఎర వేస్తారో?