TS TET 2022
-
TS TET 2022: టెట్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2022) ఫలితాల విడుదలపై రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఫలితాల్లో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1 న విడుదల చేస్తామని వెల్లడించింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును ఆమె సమీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జులై 1న టెట్ ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. చదవండి👇 టెట్ @ 90 శాతం ఇంటర్ ఫలితాలు విడుదల.. ఒకే క్లిక్‌లో రిజల్ట్స్ ఇలా చూడండి -
తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన టెట్ పరీక్ష..
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 336 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 83,465 మంది పరీక్షకు హాజరు కానున్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 212 పరీక్ష కేంద్రాలున్నాయి. రాజ ధానిలో మొత్తం 50,600 మంది పరీక్ష రాస్తున్నారు. ములుగులో అతి తక్కువగా 15 పరీక్ష కేంద్రాలున్నాయి. ఈ జిల్లాలో దాదాపు 2,200 మంది పరీక్ష రాస్తున్నారు. ప్రతి కేంద్రానికి 11 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రతి కేంద్రానికి 11 మంది ఇన్విజిలేటర్లు, మరో ముగ్గురు పర్యవేక్షణ అధికారుల చొప్పున వినియోగిస్తున్నారు. వారికి పరీక్ష నిర్వహణ విధానంపై శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. ప్రశ్నపత్రం ఓపెన్ చేయడం మొదలు కొని, ప్యాక్ చేసే వరకూ వీడియో రికార్డింగ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పేపర్– 1 అభ్యర్థులకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, పేపర్– 2 అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, తాగునీరు, నిరంతర విద్యుత్ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష సమయానికి కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. పరేషాన్లో అభ్యర్థులు.. టెట్ హాల్ టికెట్లు తప్పుల తడకగా మారడంతో అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. ఇప్పటికే కొందరు హాల్ టికెట్ సరిచేసుకోగా మరికొందరు అవగాహన లేక చేసుకోలేక పోయారు. వాస్తవంగా ప్రైవేటు ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో అనేక తప్పులు దొర్లాయి. హాల్ టికెట్లలో అభ్యర్థి పేరు, తండ్రి, తల్లి పేరు, పుట్టిన తేదీ, కులం, లింగం, డిసెబిలిటీ (పీహెచ్సీ) వంటి వివరాలతో పాటు ఫొటో లు సరిగా కనిపించకపోవడం, ఫొటో కింద సంతకాలు లేకపోవడం ఇబ్బందిగా తయారైంది. పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేకపోయినా, అస్సలు లేకపోయినా అభ్యర్థులు తాజా ఫొటోను అతికించి, గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేష¯న్ చేయించుకొని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో చాలా మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. మరికొందరు అవగాహన లేక తిప్పలు పడుతున్నారు. ► గుర్తుంచోవాల్సిన అంశాలు ►పేపర్1(ఎస్జీటీ) ఉదయం 9.30 గంటల నుంచి 12 వరకు, పేపర్2(ఎస్ఏ) మధ్యాహ్నం2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ►అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా హాలులోకి అనుమతించారు. ►ఓఎమ్ఆర్ షీట్లను చించడం, మతడపెట్టడం చేయరాదు. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి తెలిసినవి ఆన్సర్ చేసి ఆ తర్వాత ఖచ్చితంగా తెలియని, ఊహించి చెప్పగలిగేవి ఆన్సర్ చేయండి. ►ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో హెల్ప్‌లైన్ టెట్ అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. టెట్ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్లు, రూట్‌మ్యాప్, రవాణా సౌకర్యాలు, ఇతర సందేహాలు, సలహాల కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు. ►హైదరాబాద్ : 98488 39244 ►రంగారెడ్డి జిల్లా : 96661 62092, 93968 56548, 77999 99242, 99666 53653 ►మేడ్చల్ జిల్లా : 91604 19991 -
ఆ అభ్యర్థులకు నిరాశ! టెట్‌లో ప్రత్యేక పేపర్ లేనట్టే...
సాక్షి, హైదరాబాద్: భాషాపండితులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రత్యేకంగా నిర్వహించే ఆలోచనేమీలేదని అధికారవర్గాలు స్పష్టమైన సంకేతాలిచ్చాయి. దీంతో రాష్ట్రంలోని దాదాపు 30 వేల మంది భాషాపండితులు నిరాశకు గురయ్యారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఈ అవకాశం కల్పించారని వారు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి సానుకూల స్పందనరాలేదు. విజ్ఞప్తులు, విన్నపాలు కొనసాగుతున్న క్రమంలోనే టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 12తో ముగిసింది. మొత్తం 6,29,352 దరఖాస్తులు అందాయని, ఇందులో పేపర్–1 రాసేవారి సంఖ్య 3,51,468, పేపర్–2 రాసేవారి సంఖ్య 2,77,884 ఉందని అధికారులు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభించే వీలుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ జరుగుతుంది. తమకు తెలియని సిలబస్‌తో టెట్ రాయడం కష్టమనే భావనలో భాషా పండితులున్నారు. హిందీ, తెలుగు భాషాపండిట్ కోర్సు పూర్తి చేసిన ఈ అభ్యర్థులు టెట్ పేపర్–2 రాసేందుకు అర్హులు. (చదవండి: బొడ్రాయి ప్రతిష్టాపన @ 5 కోట్లు!) అయితే, వీరు ప్రధానంగా సంబంధిత భాషపైనే శిక్షణపొంది ఉంటారు. 60 శాతం భాషాపరమైన సిలబస్ నుంచి పరీక్ష నిర్వహిస్తే టెట్‌లో పోటీ పడగలమని వీరు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం గణితం, సైన్స్‌సహా మిగతా సిలబస్‌తో వీళ్లు టెట్ రాయాల్సి వస్తోంది. ఇది తమకు ఇబ్బందిగానే ఉంటుందని వారి వాదన. రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల మంది తెలుగు పండిట్లు, 10 వేల మంది హిందీ పండితులున్నారు. ఆన్లైన్ అవస్థలు.. టెట్ దరఖాస్తుల సమయంలో అనేక సమస్యలు ఎదురైనట్టు అభ్యర్థులు చెబుతున్నారు. దరఖాస్తుపై కొంతమంది ఫొటోలు ఆప్‌లోడ్ అయినా, సంతకాలు నిర్దేశిత ప్రాంతంలో పొందుపర్చలేకపోయామని, సాంకేతిక ఇబ్బందులే దీనికి కారణమని చెబుతున్నారు. సమీపంలోని పరీక్ష కేంద్రాలు ఆన్లైన్లో చూపించలేదని ఎల్బీనగర్కు చెందిన చైతన్య, రఘురాం అనే అభ్యర్థులు తెలిపారు. అయితే, దరఖాస్తులు తాము చెప్పిన రీతిలో లేని పక్షంలో తిరస్కరిస్తామని అధికారులు అంటున్నారు. దీంతో పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ తరహాలో పేపర్–3 ఉండాలి భాషాపండితులకు 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేపర్–3 నిర్వహించింది. అదే తరహాలో ఇక్కడా భాషపైనే ఎక్కువ సిలబస్‌తో ప్రశ్నలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలా అయితేనే 30 వేల భాషాపండితులకు ప్రభుత్వం న్యాయం చేయగలుగుతుంది. కానీ, దీన్ని పట్టించుకోకపోవడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి. – సి.జగదీశ్ (రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, రాష్ట్ర అధ్యక్షుడు) (చదవండి: టెట్ పరీక్ష కేంద్రాలు బ్లాక్)