ఫౌండేషన్ కోర్సుతో ఉత్తమ ఫలితాలు
విజయవాడ (భవానీపురం): మున్సిపల్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కెరీర్ ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెట్టిందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. కెరీర్ ఫౌండేషన్ కోర్సు అమలు విధానంపై మున్సిపల్ పాఠశాలల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 1997 వరకు రాష్ట్రం నుంచి ఐఐటికి ఏటా 100 మంది మాత్రమే ఎంపికయ్యేవారని, ప్రస్తుతం 100 ర్యాంకులలో 50 ర్యాంకులు మన రాష్ట్రం విద్యార్థులు సాధిస్తున్నారని తెలిపారు. 2018 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే ఎక్కువ ర్యాంకులు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం రానున్న రోజుల్లో మున్సిపల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తమ అభిప్రాయాలను తెలిపేందుకు వేదికపైకి వచ్చిన ప్రతి విద్యార్థితో మంత్రి నారాయణ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి వీరపాండియన్, పురపాలక పాలన సంచాలకుడు కన్నబాబు, మేయర్ కోనేరు శ్రీధర్, మెప్మా ఎండీ చినతాతయ్య, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కృష్ణ కపర్ధి, తదితరులు పాల్గొన్నారు.