two suicides
-
ఇద్దరిని బలిగొన్న వివాహేతర సంబంధం
యాలాల: తనను దూరం చేస్తోందని భావించిన ఓ వ్యక్తి ఓ వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆపై అతడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో వివాహిత, ప్రియుడు మృతిచెందారు. ఘటన వికారాబాద్ జిల్లా యాలాలలోని అగ్గనూరులో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మక్త హన్మప్ప, చంద్రమ్మ మూడో కుమార్తె మక్త అంజిలమ్మ (35)కు పదేళ్ల కిందట వెంకటయ్యతో వివాహమైంది. అయితే అంజిలమ్మ భర్తను వదిలేసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో చెన్‌గేస్‌పూర్‌కు చెందిన నర్సింహులు (36)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఇటీవల అంజిలమ్మ అతడిని దూరం చేస్తూ తన వద్దకు రావొద్దని చెప్పడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను అంతమొందించాలనుకున్న అతడు గురువారం అర్ధరాత్రి పెట్రోల్ బాటిల్‌తో అంజిలమ్మ ఇంటికి వచ్చాడు. నిద్రిస్తున్న అంజిలమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. కుమార్తెను కాపాడేందుకు యత్నించిన తల్లిదం డ్రులకు∙గాయాలయ్యాయి. వారిని తాండూరు లోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నలుగురిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంజిలమ్మ, నర్సింహులు మృతి చెందారు. నర్సింహులుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంజిలమ్మకు సంతానం లేరు. -
అప్పుల బాధతో ఇద్దరు ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: మండలంలోని అక్కన్నపల్లిలో గురువారం అప్పుల బాధతో మనస్థాపం చెంది తమ్మినేని రంగయ్య (60) అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు... రంగయ్య చెడు అలవాట్లకు బానిసై అప్పులు చేశాడు. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు భరించలేక మనస్థాపం చెంది గ్రామ సమీపంలోని శివార్లలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ రామక్రిష్ణారెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామన్నారు. మృతునికి భార్య కాంతమ్మ, కుమారుడు నరేష్‌నాయుడు ఉన్నారు. చేనేత కార్మికుడు.. ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన చేనేత కార్మికుడు రంగనాయకులు (45) అప్పులబాధతో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు రాజేంద్రనగర్‌కు చెందిన మద్దినేని రంగనాయకులు మగ్గం నేస్తూ జీవించేవాడు. అప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ పోషణకు దాదాపు రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్న రంగనాయకులు చేనేత మగ్గాన్ని వదిలేసి బొలెరో వాహనాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అప్పుల వారి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో మనోవేదనకు గురయ్యేవాడని బంధువులు తెలిపారు. దీంతో కాపురాన్ని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు మార్చాడు. అక్కడి నుంచి రాజేంద్రనగర్‌లోని తండ్రి ఇంటి వద్దకు వచ్చి అప్పుడప్పుడు నిద్రపోయి వచ్చేవాడన్నారు. బుధవారం రాత్రి తండ్రి ఇంటివద్దకు వచ్చిన రంగనాయకులు ఇంటిముందున్న రేకులషెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు ఉదయాన్నే రేకులషెడ్డును తెరవగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. పట్టణ పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య అరుణమ్మ, కుమార్తె సాయిప్రభ, కుమారుడు హరికృష్ణలు ఉన్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పక్క దారిపట్టిందా?
- ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య వెనక లీకులు - గతంలో రామకృష్ణారెడ్డి, చిట్టిబాబు వ్యవహారాల్లోనూ ఇదే సీన్ సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో పది నెలల కాలంలోనే ముగ్గురు ఎస్ఐలు ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే వారు బలవన్మరణాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నా.. వాటిని పక్కనపెట్టి ఏవేవో ఇతర కారణాలు తెరపైకి వచ్చాయి. గతేడాది ఆగస్టు 17న జరిగిన ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య వ్యవహారంలో ఉన్నతాధికారుల వేధింపులే కారణమని వెల్లడైనా పట్టించుకోలేదు. పైగా రామకృష్ణారెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని.. ఉన్నతాధికారుల హెచ్చరికలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడంటూ విచారణ పేరిట కేసును పక్కదారి పట్టించారు. ఈ ఏడాది మార్చి 3న జరిగిన దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు ఆత్మహత్య వ్యవహారంలోనూ అదే తరహాలో వ్యవహరించారు. చిట్టిబాబు తన కుమారుడు, కోడలుతో గొడవపడ్డారని.. ఆ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రచారం చేశారు. అయితే అప్పటి డీఐజీ విచారణలో చిట్టిబాబు ఆత్మహత్యకు కోడలు పెట్టిన కేసు కారణం కాదని... సిద్దిపేట పోలీసు ఉన్నతాధికారుల వేధింపులు, అసభ్యకర ప్రవర్తనే కారణమని తేలింది. అయినా సంబంధిత అధికారులపై చర్యలు లేవు. తాజాగా ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి విషయంలోనూ ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు, తోటి ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే దీనిని పక్కదారి పట్టించేందుకు శిరీషపై అత్యాచారయత్నం లింకు పెడుతూ లీకులు ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు ఘటనల్లోనూ పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హడావుడేనా.. చర్యలుంటాయా? వాస్తవానికి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనకు సంబంధించి డీఐజీ అకున్ సబర్వాల్ విచారణ జరిపి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారు. డీఎస్పీ, సీఐల వేధింపులు కూడా ఆయన ఆత్మహత్యకు కారణమయ్యాయని అందులో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఆ ఇద్దరు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టారు. కానీ ఆ కేసు ఏమైంది? దర్యాప్తు జరుగుతుందా? అన్న విషయాలను ఇప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఎస్ఐల ఆత్మహత్యలపై హడావుడి తప్ప చర్యలేమీ ఉండవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రెండు ఆత్మహత్యలు.. వంద సందేహాలు
ఒక ఎస్సై.. ఒక బ్యూటీషియన్ కుకునూర్‌పల్లి ఎస్సై ఆత్మహత్య వెనుక మేకప్ ఆర్టిస్ట్ ఆత్మహత్య? - మేకప్ ఆర్టిస్ట్ శిరీషకు, ఆమె పనిచేసే స్టూడియో యజమాని రాజీవ్‌కు మధ్య విభేదాలు - ఇద్దరికీ స్నేహితుడైన శ్రవణ్ ద్వారా సెటిల్మెంట్ కోసం కుకునూర్‌పల్లికి.. - తన క్వార్టర్స్‌లోనే ఆ ముగ్గురితో మాట్లాడిన ఎస్సై ప్రభాకర్‌రెడ్డి - హైదరాబాద్ వచ్చాక శిరీష ఆత్మహత్య.. విషయం తెలిసి తుపాకీతో కాల్చుకున్న ఎస్సై - కానీ శిరీషపై ఎస్సై దురాగతానికి పాల్పడ్డాడంటూ ప్రచారం - ఉన్నతాధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి పోలీసు క్వార్టర్స్.. బుధవారం ఉదయం ఎస్సై ప్రభాకర్‌రెడ్డి సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నారు..ఈ ఘటనకు దాదాపు రోజున్నర కింద మంగళవారం తెల్లవారుజాము సమయం.. హైదరాబాద్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియోలో పనిచేసే మేకప్ ఆర్టిస్ట్ శిరీష ఆత్మహత్య చేసుకుంది.. వేర్వేరు రోజులు, వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రెండు ఘటనల మధ్యా ఎన్నో లింకులు.. మరెన్నో సందేహాలు.. వ్యక్తిగత కారణాలతో శిరీష ఆత్మహత్య చేసుకుందని ఒకవైపు.. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా ప్రభాకర్‌రెడ్డి రివాల్వర్‌తో కాల్చుకున్నారని మరోవైపు.. ఈ రెండూ కాదు శిరీషపై.. ప్రభాకర్ దురాగతానికి పాల్పడటంతో ఆత్మహత్య చేసుకుందని, ఆందోళన చెందిన ఎస్సై కూడా ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం ఇంకోవైపు.. మరి ఈ రెండు ఉదంతాల మధ్య ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. సాక్షి, హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లికి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి బుధవారం రివాల్వర్‌తో కాల్చుకున్నారు. అంతకు ఒకటిన్నర రోజు ముందు హైదరాబాద్‌లో శిరీష అనే మేకప్ ఆర్టిస్ట్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనలకు లింకు ఉందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అసలు ఈ ఘటనల వెనుక ఏముందనేది చర్చనీయాంశంగా మారింది. సోమవారం రాత్రి శిరీష, ఆమె పనిచేస్తున్న స్టూడియో యజమాని రాజీవ్, అతడి స్నేహితుడు శ్రవణ్ కలసి కుకునూర్‌పల్లికి వెళ్లారు. శ్రవణ్ కోరిన మేరకు రాజీవ్, శిరీషల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ప్రయత్నించారు. అది బెడిసికొట్టడంతో శిరీష ఆత్మహత్య చేసుకుంది. ఈ అంశాలన్నీ బుధవారం మీడియాలో హల్చల్ చేయడంతో ప్రభాకర్‌రెడ్డి బలవన్మరణానికి పా ల్పడినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త పరిచయాలతో హైదరాబాద్‌కు చెందిన వల్లభనేని రాజీవ్.. ఫిల్మ్‌నగర్‌లో షేక్‌పేట ప్రధాన రహదారిపై ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఆర్జే ఫొటోగ్రఫీ పేరుతో స్టూడియో నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణనగర్‌కు చెందిన అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష (28) ఈ సంస్థలో మేకప్ ఆర్టిస్ట్‌గా, హెచ్ఆర్ నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త సతీష్‌చంద్ర బేగంపేటలోని ఓ పాఠశాలలో చెఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. కొన్నేళ్లుగా రాజీవ్, శిరీషల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. ఏడాది కింద రాజీవ్‌కు ఒక సాఫ్ట్వేర్ సంస్థ హెచ్ఆర్ విభాగంలో పనిచేసే తేజస్వినితో పరిచయమైంది. ఆమెకు దగ్గరైన రాజీవ్.. తనను దూరంగా పెడుతుండడంపై శిరీష పలుమార్లు నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని శిరీష హెచ్చరించడంతో.. రాజీవ్ రెండు నెలలుగా మళ్లీ శిరీషకు దగ్గరయ్యాడు. తేజస్విని–శిరీష మధ్య వివాదం రాజీవ్ తనకు దూరమై.. శిరీషకు తిరిగి దగ్గరవడాన్ని తేజస్విని జీర్ణించుకోలేకపోయింది. రాజీవ్‌ను తనకు దూరం చేస్తున్నావంటూ దాదాపు నెల రోజులుగా శిరీషకు అభ్యంతరకంగా వాట్సాప్ సందేశాలు పంపిస్తోంది. తమ మధ్య నుంచి తప్పుకోవాలంటూ హెచ్చరించింది. ఈ వివాదం తీవ్రస్థాయికి చేరుతుండటంతో శిరీషతో విషయం సెటిల్ చేసుకోవాలని రాజీవ్ భావించాడు. దీనికోసం తన స్నేహితుడైన బోదాసు శ్రవణ్ సహకారం కోరాడు. ఇలాంటి అంశాలు పోలీసుల సమక్షంలో సెటిల్ చేసుకోవాలని సలహా ఇచ్చిన శ్రవణ్.. తనకు పరిచయస్తుడైన కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి వద్ద సెటిల్ చేసుకుందామని చెప్పాడు. సోమవారం కుకునూర్‌పల్లి వెళ్లిన ముగ్గురు సోమవారం ఉదయమే శిరీష స్టూడియోకు వచ్చింది. శ్రవణ్, రాజీవ్‌లు మధ్యాహ్నం అక్కడికి వచ్చారు. వారంతా కలసి రాత్రి 9.30 గంటల సమయంలో రాజీవ్‌కు చెందిన ఎండీవర్ కారులో కుకునూర్‌పల్లికి వెళ్లారు. నేరుగా ప్రభాకర్‌రెడ్డి పోలీస్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. వెళ్లే ముందు రాత్రి 8.40 గంటల సమయంలో తన భర్తకు ఫోన్ చేసిన శిరీష.. ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పింది. అర్ధరాత్రి వరకు ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో పంచాయితీ జరిగాక... సుమారు ఒంటిగంట సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. 1.40 గంటలకు శిరీష తాను శామీర్‌పేట ప్రాంతంలో ఉన్నట్లుగా తన భర్త సతీశ్‌చంద్రకు వాట్సాప్ ద్వారా లోకేషన్ పంపింది. ఆ వెంటనే సతీశ్ ఫోన్ చేసినా స్పందించలేదు. తెల్లవారుజామున 4.30 గంటలకు మరోసారి ఫోన్ చేసినా స్పందన రాలేదు. స్టూడియోకే వచ్చిన ఆ ముగ్గురూ.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ ముగ్గురూ స్టూడియో వద్దకు చేరుకున్నారు. మార్గమధ్యంలోనూ వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. శిరీష కారు ఆపాలంటూ రెండుసార్లు కిందికి దిగివెళ్లినట్లు సమాచారం. మిగతా ఇద్దరు ఆమెకు సర్దిచెప్పి స్టూడియో వరకు తీసుకొచ్చారు. అక్కడికి చేరుకోగానే శిరీష అపార్ట్మెంట్ రెండో అంతస్తులోని స్టూడియోలోకి వెళ్లిపోయింది. పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని భావించిన శ్రవణ్.. కింది నుంచే వెళ్లిపోయాడు. పదిహేను నిమిషాల తర్వాత రాజీవ్ స్టూడియోలోకి వెళ్లాడు. అయితే అప్పటికే శిరీష ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని కనిపించిందని.. తానే చున్నీ కత్తిరించి మంచంపై పడుకోబెట్టానని రాజీవ్ చెబుతున్నాడు. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంగళవారం ఉదయం 6.30కు శిరీష భర్త సతీశ్‌కు ఫోన్ చేసి అక్కడకు రప్పించారు. తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, రాజీవ్‌పై అనుమానం ఉందంటూ సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియాలో హల్చల్ చేసిన శిరీష వార్త మంగళవారం శిరీష మృతిపై బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కానీ బుధవారం ఉదయం నుంచి శిరీష ఆత్మహత్య వార్త మీడియాలో మరోవిధంగా హల్చల్ చేసింది. ఈ వ్యవహారంలో రాజీవ్, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో తన పేరు కూడా బయటకు వస్తుందని ఆందోళనకు గురైన ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు చెబుతున్నారు. తాము సోమవారం శిరీషను తీసుకుని కుకునూర్‌పల్లికి వెళ్లి వచ్చినట్లు రాజీవ్, శ్రవణ్ అంగీకరించారని అంటున్నారు. పోలీసులు స్టూడియోలోని సీసీ కెమెరా ఫుటేజీలను స్వా«ధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజీవ్, శ్రవణ్‌లను విచారిస్తున్నామని.. తేజస్వినిని సైతం అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. శిరీష పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఆత్మహత్యకు కారణం ఆత్మహత్యేనా? కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి శిరీష ఆత్మహత్యే కారణమని పోలీసులు చెబుతున్నారు. అయితే సిద్దిపేట జిల్లాలో గత పది నెలల్లో ఎస్ఐలు ఆత్మహత్య చేసుకోవడం ఇది మూడోసారి. గతేడాది ఆగస్టులో అప్పటి కుకునూర్‌పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా ప్రభాకర్‌రెడ్డి సైతం సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ఈ ఘటనల వెనుక ఉన్నతాధికారుల వేధింపులు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో క్రైమ్ మీటింగుల సమయంలో ఉన్నతాధికారులు ఎస్ఐలకు ‘టార్గెట్లు’పెట్టడం, ఆ మొ త్తం ఇవ్వకుంటే మెమోలతో వేధించడం పరిపాటిగా మారిందని సమాచారం. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య వెనుకా అలాంటి కారణాలు ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా మూడో ఉదంతం కావడంతో పోలీసు విభాగంపై మచ్చ రాకుండా ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు, శిరీష ఆత్మహత్యకు లింకు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతు చిక్కని ప్రశ్నలెన్నో.. ► కుకునూర్‌పల్లి వెళ్లిన రాజీవ్, శ్రవణ్, శిరీష నేరుగా ప్రభాకర్‌రెడ్డి క్వార్టర్స్‌కే వెళ్లారు. వివాదం సెటిల్ కోసమే అయితే పోలీస్ క్వార్టర్స్‌లో ఈ తతంగం ఎందుకు పెడతారు? ► విషయం సెటిల్ చేయిస్తానంటూ తీసుకెళ్లిన శ్రవణ్.. తిరిగొచ్చాక అపార్ట్మెంట్ కింద నుంచే ఎందుకు వెళ్లిపోయాడు? ► శిరీష స్టూడియోలోకి వెళ్లాక 15 నిమిషాల పాటు రాజీవ్ బయటే ఎందుకు ఉండిపోయాడు? ► రాజీవ్, శిరీషలను కుకునూర్‌పల్లికి తీసుకెళ్లిన శ్రవణ్... శిరీష ఆత్మహత్య విషయాన్ని ప్రభాకర్‌రెడ్డికి చెప్పకుండా ఉంటారా? ► బంజారాహిల్స్ పోలీసులు శ్రవణ్, రాజీవ్‌లను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అంటే మంగళవారమే శిరీష ఆత్మహత్య విషయం ప్రభాకర్‌రెడ్డికి తెలిసి ఉండొచ్చు. మరి ప్రభాకర్‌రెడ్డి బుధవారం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ► బుధవారం సాయంత్రం వరకు కూడా మీడియాలో ఎక్కడా రాజీవ్, శ్రవణ్, శిరీష కుకునూర్‌పల్లికి వెళ్లినట్లు రాలేదు? మరి ఆ కారణంతో ప్రభాకర్‌రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ► ఎస్ఐగా పనిచేస్తున్న ప్రభాకర్‌రెడ్డికి పోలీసుల దర్యాప్తు విధానం పక్కాగా తెలిసే ఉంటుంది. ఏదైనా కేసులో ఓ వ్యక్తి ప్రమేయమున్నట్లు అనుమానించినా.. సాక్షిగా భావించినా పోలీసులు వెంటనే పిలుస్తారు. మరి శిరీష కేసుకు సంబంధించి తాము ప్రభాకర్‌రెడ్డిని ఏ విధంగానూ సంప్రదించలేదని, అసలా విషయమే తమకు తెలియదని బంజారాహిల్స్ పోలీసులు చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు ఆ కేసే ఎలా కారణమవుతుంది? ► శిరీష మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ వైద్యులు ఆమె పెదవులతో పాటు ముఖంపై గాట్లు ఉన్నట్లు గుర్తించారని పోలీసులు చెప్తున్నారు? అవి ఎలా వచ్చాయి? -
జీవితంపై విరక్తితో ఇద్దరి ఆత్మహత్య
కంబదూరు (కళ్యాణదుర్గం) : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కంబదూరు మండలం నూతిమడుగులో చిన్న నరసింహులు భార్య లక్ష్మీనరసమ్మ(37) కడునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం మృతదేహన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గొంచిరెడ్డిపల్లిలో ఉరేసుకుని మరొకరు.. బ్రహ్మసముద్రం(కళ్యాణదుర్గం) : బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లిలో తిప్పేస్వామి(35) అతిగా మద్యం తాగి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన ఆయన మద్యం మత్తులో ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. మృతుని భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నట్లు చెప్పారు. మృతునికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
ఇద్దరు వివాహితల బలవన్మరణం
పరిగి (పెనుకొండ) : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వివాహితలు బలవన్మరణానికి పాల్పడ్డారు. పరిగి మండలం ఎస్.బీరేపల్లిలో కంసల అశ్వత్థచారి భార్య ప్రభావతి(30) అనే వివాహిత శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ అంజనయ్య శనివారం తెలిపారు. దంపతులిద్దరూ గతంలో గార్మెంట్‌కు వెళ్లేవారన్నారు. అయితే కొంతకాలంగా ప్రభావతి ఇంట్లోనే ఉంటుండగా, భర్త ఒక్కడే వెళ్లేవాడని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇంటి తలుపులు తీయకపోగా, రాత్రి ఇంటికొచ్చిన భర్త పిలిచినా పలక్కపోవడంతో అనుమానంతో లోపలకి తొంగి చూడగా.. ఇనుప తీర్లకు వేసిన ఉరికి వేలాడుతూ కనిపించిందన్నారు. క్షణాల్లో ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో చుట్టుపక్కల వారు పోగయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అరవకూరులో మరొకరు.. కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం అరవకూరులో చంద్రకళ(26) అనే వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. భార్యాభర్తల మధ్య శుక్రవారం గొడవ జరిగిందని వివరించారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె రాత్రైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ దొరకలేదు. రాత్రి పొద్దుపోయాక నీరున్న బావిలో మృతదేహమై తేలియాడుతుండగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
మరో ఇద్దరి బలవన్మరణం
- మొన్న ముగ్గురు, నిన్న ముగ్గురు.. నేడు ఇద్దరు.. - ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు జిల్లాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా, నిన్న మరో ముగ్గురు బలవన్మరణం చెందారు. తాజాగా ఇద్దరు బలవంతపు చావు చచ్చారు. అంతులేని ఆత్మహత్యలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రొద్దం(పెనుకొండ) : రొద్దం మండలంశేషాపురంలో కురుబ భాగ్యమ్మ(42) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. భాగ్యమ్మ, ఆమె భర్త శ్రీరాములు ఇద్దరూ కలసి గొర్రెలను తోలుకుని గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి శనివారం వెళ్లారన్నారు. మధ్యాహ్నం కడుపునొప్పి తీవ్రం కావడంతో ఇంటికి వెళ్లాల్సిందిగా భర్త సూచించారన్నారు. అయితే ఆమె ఇంటికెళ్లకుండా మార్గమధ్యంలోనే చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. రాత్రి ఇంటికొచ్చిన భర్తకు భార్య కనిపించకపోవడంతో అటవీ ప్రాంతంలో గాలించారు. అయినా ఆచూకీ కనబడలేదు. ఆదివారం మరోసారి గాలించగా.. చెట్టుకు వేలాడుతూ కనిపించిందని పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ తమ సిబ్బందితో కలసి నేర స్థలానికి వెళ్లారు. ఘటనపై ఆరా తీశారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా మృతురాలికి డిగ్రీ చదివే కూతురు, ఇంటర్ చదివే కుమారుడు ఉన్నారు. ధర్మవరంలో మరొకరు.. ధర్మవరం అర్బన్ : ధర్మవరం కేతిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి కాలనీలో నివసిస్తున్న మల్లికార్జున(45) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టన పోలీసులు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నూనె అంగట్లో గుమాస్తాగా పని చేసే మల్లికార్జున కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేవాడన్నారు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక మార్చురీకి తరలించారు. మృతునికి భార్య తులసమ్మ, కుమారుడు ఓంకార్ ఉన్నారు. మల్లికార్జున మృతదేహం వద్ద వారు రోదించిన తీరు అందరినీ కలచివేసింది.