అప్పుల బాధతో ఇద్దరు ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: మండలంలోని అక్కన్నపల్లిలో గురువారం అప్పుల బాధతో మనస్థాపం చెంది తమ్మినేని రంగయ్య (60) అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు... రంగయ్య చెడు అలవాట్లకు బానిసై అప్పులు చేశాడు. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు భరించలేక మనస్థాపం చెంది గ్రామ సమీపంలోని శివార్లలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రామక్రిష్ణారెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామన్నారు. మృతునికి భార్య కాంతమ్మ, కుమారుడు నరేష్‌నాయుడు ఉన్నారు.
చేనేత కార్మికుడు..
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన చేనేత కార్మికుడు రంగనాయకులు (45) అప్పులబాధతో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు రాజేంద్రనగర్‌కు చెందిన మద్దినేని రంగనాయకులు మగ్గం నేస్తూ జీవించేవాడు. అప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ పోషణకు దాదాపు రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్న రంగనాయకులు చేనేత మగ్గాన్ని వదిలేసి బొలెరో వాహనాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అప్పుల వారి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో మనోవేదనకు గురయ్యేవాడని బంధువులు తెలిపారు. దీంతో కాపురాన్ని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు మార్చాడు.
అక్కడి నుంచి రాజేంద్రనగర్‌లోని తండ్రి ఇంటి వద్దకు వచ్చి అప్పుడప్పుడు నిద్రపోయి వచ్చేవాడన్నారు. బుధవారం రాత్రి తండ్రి ఇంటివద్దకు వచ్చిన రంగనాయకులు ఇంటిముందున్న రేకులషెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు ఉదయాన్నే రేకులషెడ్డును తెరవగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. పట్టణ పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య అరుణమ్మ, కుమార్తె సాయిప్రభ, కుమారుడు హరికృష్ణలు ఉన్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.