Ujjini narayanarao
-
నారాయణరావును ఆదర్శంగా తీసుకోవాలి
చింతపల్లి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మునుగోడు మాజీ శాసనసభ్యుడు ఉజ్జిని నారాయణరావును ఆదర్శంగా తీసుకుని నేటి యువత ఉద్యమించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని ఘడియగౌరారంలో ఉజ్జిని నారాయణరావు స్మారక స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. మూడు పర్యాయాలు మునుగోడు నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించి పేద ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసి అందరి మనసుల్లో నిలిచారన్నారు. పేద ప్రజలకు భూములు పంచాలని ఎర్ర జెండా పక్షాన ఉద్యమాలు నిర్వహించారని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణరావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ ఇచ్చే పిలుపుల్లో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వాలు, పాలకులు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ మాజీ శాసనసభాపక్షనేత గుండా మల్లేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకటయ్య, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు, బొమ్మగోని ప్రభాకర్, కందిమళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఉజ్జిని యుగంధర్‌రావు, పల్లా నర్సింహారెడ్డి, నేలకంటి సత్యం, సృజన, చిలుకూరు జెడ్పీటీసీ శివాజీనాయక్, చంద్రశేఖర్, అంజయ్యనాయక్, ఆరెకంటి మైసయ్య, ముచ్చర్ల మల్లయ్య, శ్రీనివాస్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పల్లె నర్సింహ, లక్ష్మయ్య, కళాకారులు జగన్, శ్రీనివాస్, సంజీవ, పాండురంగారావు, రాజు తదితరులు పాల్గొన్నారు. పలువురు నేతల పరామర్శ ఉజ్జిని నారాయణరావు కుటుంబాన్ని ఆదివారం పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పరామర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పరామర్శించిన వారిలో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్, మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులున్నారు. -
కమ్యూనిస్టు యోధుడు ఉజ్జిని ఇకలేరు
హైదరాబాద్: తొలితరం కమ్యూనిస్టు యోధుడు, నల్లగొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు(90) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని సైదాబాద్‌లోని తన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు నివాసానికి తరలించారు. మాజీ మంత్రి జానారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు ఉజ్జిని భౌతికకాయాన్ని సందిర్శించి నివాళులు అర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారం గ్రామానికి తరలించారు. అక్కడ నల్లగొండ జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణరావు మూడుసార్లు మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన నాయకుడిగా పేరు గడించారు. నారాయణరావు మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. కమ్యూనిస్టు సీనియర్ నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా పేదల పక్షాన అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. సీపీఐ సంతాపం: ఉజ్జిని నారాయణరావు మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. సైదాబాద్‌లోని ఆయన నివాసంలో నారాయణరావు భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలుంచి చాడ, ఇతర నేతలు పల్లా వెంకటరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్ తదితరులు నివాళులర్పించారు. నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి ఇతర నేతలతో కలసి ఎంతో కృషి చేశారని తమ కుటుంబ సభ్యులను పార్టీ సభ్యులుగా, నాయకులుగా ఆయన తీర్చిదిద్దారని సురవరం సంతాప సందేశంలో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పొల్కంపల్లి వెంకటరామారావుతో కలసి ఆంధ్ర మహాసభలో చేరి ప్రజాసమస్యలపై స్పందించి కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగారని, భూ పోరాట ఉద్యమాల్లో పాల్గొన్నారని చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రజా ఉద్యమానికి అంకితం కమ్యూనిస్టు ఉద్యమం తీవ్ర నిర్బంధానికి గురైన కాలంలో కూడా నారాయణరావు ప్రజా ఉద్యమానికి అంకితమై పనిచేశారని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన మృతికి నివాళులర్పించారు. ఉన్నత కుటుంబంలో పుట్టినా పేద రైతాంగం పట్ల నిబద్ధతతో కృషి చేశారని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. -
మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణ కన్నుమూత