UK Covid Strain
-
వామ్మో.. 20 రోజుల్లో 20లక్షల మందికి కరోనా పాజిటివ్!
లండన్: కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ భయాందోళనలు పెంచుతున్నాయి. బ్రిటన్‌లో కొద్ది రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క అక్టోబర్ నెలలో ఇప్పటి వరకు 20 లక్షల మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క ఇంగ్లాండ్‌లోనే ప్రతి 30 మందిలో ఒకరికి కోవిడ్ ఉన్నట్లు ద గార్డియన్ వెల్లడించింది. గడిచిన వారంలోనే 17 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇంగ్లాండ్ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.’ అని కోవిడ్-19 సర్వే చేపట్టిన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సారా క్రాఫ్ట్ తెలిపారు. ముందు ముందు మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రులు, యూకే ఆరోగ్య విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం అక్టోబర్ 10తో ముగిసిన వారంలో 8,198 మంది ఆసుపత్రుల్లో చేరారు. అక్టోబర్ 17 వరకు 7,809 మంది చేరినట్లు తెలిసింది. కోవిడ్-19 ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఈ నెల చివరి నాటికి మరింత విజృంభించే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య శాఖ హెచ్చరించింది. బీఏ.5 పరివర్తనం చెంది ఒమిక్రాన్ బీక్యూ1.1 కొత్త వేరియంట్ ఉద్భవించింది. ప్రస్తుతం బీక్యూ1.1 వేరియంట్ రోగనిరోధక శక్తి కళ్లుగప్పి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 300లకుపైగా ఒమిక్రాన్ సబ్వేరియంట్లు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: Gujarat Polls: ఆ సీట్లలో బీజేపీ ఒక్కసారి కూడా గెలవలే.. కారణమేంటి? -
200 మందికి పాజిటివ్; 18 మందికి యూకే స్ట్రెయిన్
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 18 మందికి బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి చివరివారం వరకు కేవలం లండన్ నుంచి వచ్చే ప్రయాణికులకే హైదరాబాద్ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వారిని కూడా పరీక్షించి బయటకు పంపిస్తున్నారు. ఈ పరీక్షల్లో బ్రిటన్ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలోనూ బ్రిటన్ స్ట్రెయిన్ ఉన్నట్లు గుర్తించారు. జనవరి 10వ తేదీ నుంచి ఇప్పటివరకు బ్రిటన్ నుంచి వచ్చిన వారిని, ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 15 దేశాల నుంచి వచ్చినవారినీ కలిపితే మొత్తం 20 వేల మంది ప్రయాణికులు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. వీరంతా విదేశాల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకొని వచ్చినప్పటికీ... ఇక్కడ దిగాక కొందరిలో లక్షణాలు కనపడటంతో మళ్లీ టెస్టులు నిర్వహించారు. వీరిలో దాదాపు 200 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయా శాంపిళ్లను సీసీఎంబీకి పంపగా, అందులో 18 మందికి బ్రిటన్ స్ట్రెయిన్ ఉన్నట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. ఇలా వివిధ దేశాల నుంచి బ్రిటన్ స్ట్రెయిన్ రాష్ట్రంలోకి వస్తుండటంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. తప్పుడు చిరునామా, ఫోన్ నంబర్ ఇవ్వడం వల్ల ఇద్దరికి బ్రిటన్ స్ట్రెయిన్ వచ్చి నా... వారిని పట్టుకోవడం అధికారులకు సవాల్‌గా మారింది. చదవండి: 60 ఏళ్లు పైబడ్డ వాళ్లు టీకా తీస్కోండి -
కోవాగ్జిన్ : భారత్ బయోటెక్ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త రకం కరోఏనా వైరస్ కేసులో భారత్‌లో పెరుగుతున్న నేపథ్యంలో టీకా తయారీదారు భారత్ బయోటెక్ కీలక విషయాన్ని ప్రకటించింది. తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ బ్రిటన్‌లో కలకలం రేపిన కొత్త రకం ప్రాణాంతక కరోనా వైరస్‌పై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ ట్వీట్ చేసింది. చైనాలోని వూహాన్లోపుట్టిన కోవిడ్-19 కంటే 70 శాతం ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు భావిస్తున్న బ్రిటన్ కొత్త వేరియంట్ వైరస్‌ను తమ వ్యాక్సిన్ కోవాగ్జిన్ విజయవంతంగా నిలువరిస్తోందని వెల్లడించింది. దీనికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన లింక్‌ను షేర్ చేసింది. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని ఇటీవల బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో అనేక దేశాలో విదేశీయాన ఆంక్షలను కూడా విధించాయి. అయితే ఇప్పటికే బ్రిటన్ నుంచి విమానాల ద్వారా ఇండియాకు చేరిన వారిలో 150 మంది కొత్త కోవిడ్ స్ట్రెయిన్ బారిన పడ్డారు. Neutralization of UK-variant VUI-202012/01 with COVAXIN vaccinated human serum https://t.co/v8Me4TzGgh #BharatBiotech #COVAXIN #bioRxiv #COVID19 pic.twitter.com/7R3FlsWAX3 — BharatBiotech (@BharatBiotech) January 27, 2021 -
చాపకింద నీరులా యూకే కరోనా స్ట్రెయిన్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా దేశంలో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగతుండటంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. జనవరి 14 నాటికి ఈ రకం వైరస్ కేసుల సంఖ్య 109కి చేరిందని వెల్లడించింది. జనవరి 11 నాటికి ఈ రకం కేసుల సంఖ్య 96గా ఉండగా, తాజాగా 109కి చేరడం కలవరపెడుతోంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో కొత్త రకం కరోనా వైరస్, చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతేడాది చివర్లో బ్రిటన్‌లో రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా వైరస్‌పై అప్రమత్తమైన భారత ప్రభుత్వం.. యూకే నుంచి భారత్‌కు విమాన సర్వీసులను డిసెంబర్ 22 వరకు రద్దు చేసింది. అయినప్పటికీ దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. జనవరి 8 నుంచి యూకే విమాన సర్వీసులను పునరుద్దరించిన భారత ప్రభుత్వం..అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి,14 రోజులు క్వారంటైన్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, యూకే స్ట్రెయిన్ ప్రభావం బ్రిటన్ సహా అమెరికా,స్పెయిన్, ఫ్రాన్స్, స్వీడన్, స్విడ్జర్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలపై పడింది. దీంతో ఆయా దేశాల్లో సైతం కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. -
బర్డ్ ఫ్లూ: చికెన్ తిందామా.. వద్దా?!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాలేదు. మరో వైపు యూకే కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి ప్రారంభమయ్యింది. ఇప్పటికే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుండగా.. తాజాగా బర్డ్ ఫ్లూ నేనున్నానంటూ భయపెడుతుంది. ఇప్పటికే కేంద్రం 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బర్డ్ ఫ్లూ అనేది జూనోటిక్ వైరస్. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. దాంతో ప్రస్తుతం జనాలు చికెన్, గుడ్డు తినాలంటే భయపడుతున్నారు.. సందేహిస్తున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న ఈ కాలంలో చికెన్, గుడ్లు తినడం సేఫేనా అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇది చదవాల్సిందే.. ఇక బర్డ్ ఫ్లూ వ్యాప్తి ప్రారంభం కాగానే ఇలాంటి వార్తలు తెగ ప్రచారం అవుతాయని తెలిసే కేంద్ర పంశు సంవర్ధక మంత్రి గిరిరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేశారు. చికెన్, గుడ్లను తినాలంటే.. ముందుగా వాటిని బాగా ఉడికించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రత వద్ద.. ఎక్కువ సమయం ఉడకడం వల్ల వైరస్ ప్రమాదం తొలుగుతుందన్నారు. ఇక ఇది హీట్ సెన్సెటివ్ వైరస్ కావడం వల్ల గుడ్లను ఉడికించేటప్పడు.. పచ్చసొన, తెల్ల సొన గట్టి పడేవరకు.. మాంసం ఉడికించేటప్పుడు దాని మధ్యలో గులాబి రంగు కనపడనంత వరకు ఉడికించాలని.. అప్పుడే తినాలని తెలిపారు. (చదవండి: అది బర్డ్‌ఫ్లూ కాదు.. ) కలుషితమైన మాంసం ద్వారా బర్డ్ ఫ్లూ మానవులకు సంక్రమిస్తుందనే భయాన్ని ప్రభుత్వం తొలగించింది, "భారతదేశంలో, ఈ వ్యాధి ప్రధానంగా వలస పక్షుల ద్వారా వ్యాపిస్తుంది" అని పేర్కొంది, అయితే " బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల ద్వారా వైరస్ మనుషులకు సంక్రమించే ప్రమాదాన్ని తోసిపుచ్చలేము" అన్నారు. ప్రస్తుతం అధికారులు చనిపోయిన పక్షులను సేకరించి, లాలాజలం, రక్తం, బిందువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా.. లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నమూనాలను సేకరించే సమయంలో వారంతా తప్పక పీపీఈ కిట్లు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక మాంసం అమ్మకదారులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం అధికంగా ఉందని.. వారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. (చదవండి: 120 నాటుకోళ్లు మృతి..బర్డ్ ఫ్లూ అనుమానం) గత కొన్నేళ్లుగా బర్డ్ ఫ్లూ మానవులకు సంక్రమించిన దాఖలాలు లేవు. అయితే 1997 లో హాంకాంగ్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్5ఎన్1.. 80 మందికి సోకగా.. ఒకరు చనిపోయారు. ఇక వైరస్ మానవుల నుంచి మానవులకి బదిలీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. పక్షుల మధ్య కూడా బర్డ్ ఫ్లూ వ్యాప్తిని తనిఖీ చేయడానికి, ప్రభావిత రాష్ట్రాలు పౌల్ట్రీ మార్కెట్లను తాత్కాలికంగా మూసివేసాయి.. వైరస్ సోకిన పక్షులను చంపడం ప్రారంభించాయి. పక్షుల దిగుమతిని నిషేధించాయి. జంతుప్రదర్శనశాలలు, అభయారణ్యాల చుట్టూ "బయో-బబుల్స్"ని ఏర్పాటు చేశాయి. వ్యవసాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కలుసుకుని దేశంలో జంతువుల వ్యాక్సిన్ల లభ్యతను పరిశీలించింది. -
బడ్జెట్ సమావేశాలు: 74 ఏళ్లలో ఇదే ప్రథమం..
న్యూఢిల్లీ: మరి కొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్‌గా ఉండనుండటం మాత్రం ఖాయం. అవును మరి కోవిడ్ దేశ ఆర్థిక వ్యవస్థని దారుణంగా దెబ్బ తీసింది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థకి బడ్జెట్ కేటాయింపులతో బూస్ట్ ఇస్తారా.. లేక మరింత డీలా పడేలా చేస్తారానే విషయం మరి కొద్ది రోజుల్లో తేలనుంది. ఇక ఈ ఏడాది బడ్జెట్ రూపం, కేటాయింపులు సరికొత్తగా ఉండనుండటం మాత్రం వాస్తవం. ఈ సారి ప్రారంభం కానున్న బడ్జెట్ ప్రక్రియ దాదాపు 70 ఏళ్ల సంప్రదాయనికి ముగింపు పలకనుంది. అవును బడ్జెట్ సమావేశాలు ప్రారంభైన 74 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ ఏడాది బడ్జెట్ కాపీలను ప్రింట్ చేయడం లేదు. నవంబర్ 26, 1947 తరువాత మొదటిసారి ఈ ఏడాది బడ్జెట్ కాపీల ప్రింటింగ్‌ని నిలిపివేయనున్నారు. నార్త్ బ్లాక్‌లోని ఇళ్లని బడ్జెట్ ప్రింటింగ్ కోసం వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. ఇక డాక్యుమెంట్లు ముద్రించి, సీల్ చేసి.. బయటకు పంపే వరకు అధికారులంతా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఇక్కడే ఉంటారు. (చదవండి: ఈ దఫా ‘నెవ్వర్ బిఫోర్’ బడ్జెట్) అయితే ప్రస్తుతం కోవిడ్-19 భయాలు.. కొత్త స్ట్రెయిన్ కలకలంతో బడ్జెట్ కాపీలను ప్రింట్ చేయడం లేదని అధికారులు తెలిపారు. అంతేకాక ప్రతి ఏటా బడ్జెట్ కాపీ ప్రింటింగ్ సమయంలో నిర్వహించే హల్వా వేడుకకు కూడా ఈ ఏడాది బ్రేక్ ఇవ్వనున్నారని తెలిసింది. ఇక ఈ ఏడాది బడ్జెట్ కాపీలను డిజిటల్ రూపంలో అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి పార్లమెంట్‌లోని 750 మంది సభ్యులకు బడ్జెట్, ఎకానమిక్ సర్వే డిజిటల్ కాపీలను అందించనున్నారు. కరోనా మూలంగా 2020-2021 ఏడాదిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో పేపర్‌లెస్ బడ్జెట్ సమావేశాలు ఒకటి. రికార్డులను డిజిటలైజ్ చేయాలని పార్లమెంట్ ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇక కరోనా మూలంగా అది ఆచరణ సాధ్యం అయ్యింది. బడ్జెట్‌తో పాటు మిగతా ప్రతులను కూడా డిజిటలైజ్ చేస్తే బాగుంటుందని అధికారలు భావిస్తున్నారు. -
బెంచి మీద కూర్చుందని అరెస్ట్ చేశారు
లండన్ : బ్రిటన్‌లో కరోనా స్ట్రెయిన్ కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేస్తూ గత బుధవారం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వాటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు నింబంధనలను ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ సారి హెచ్చరించటం.. వినకపోతే ఫైన్ వేయటం.. అప్పటికీ వినకపోతే అరెస్ట్ చేయటం మొదలుపెట్టారు. ( యూఎస్: వివాదంగా మారిన త్రివర్ణ పతాకం ) శనివారం సముద్రం దగ్గర బెంచి మీద కూర్చున్న ఓ మహిళను నలుగురు పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఓ వ్యక్తికి 200 స్టెర్లింగ్ పౌండ్ల ఫైన్ వేశారు. ప్రీతీ పాటెల్ అనే మహిళను హెచ్చరించి ఇంటి దగ్గరకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అమెరికాలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం
వాషింగ్టన్ : 2021లో కూడా కరోనా మహమ్మారి పీడ వదిలేటట్టు లేదు. ఇప్పటికే బ్రిటన్ స్ట్రెయిన్ కొత్త వేరియంట్ భయాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. జన్యుమార్పులతో ఇది మరోసారి విజృంభిస్తోందన్న ఆందోళన కొనసాగుతుండగానే అమెరికాలో మరో వైరస్ ఉనికి మరింత ఆందోళన రేపుతోంది. బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా కంటే ఇది 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అమెరికా రకం కరోనా వేరియంట్ బ్రిటన్‌లో స్ట్రెయిన్ మాదిరిగానే వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ గుర్తించిన యూఎస్ రకం వ్యాప్తి తీరు కూడా ఉందని ఫుండ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. ఇది స్ట్రెయిన్ యూఎస్ రకం అయి ఉండొచ్చు. యూకే స్ట్రెయిన్‌తో పాటుగా ఇది కూడా వ్యాపించిందని అంచనావేశారు. దీని వ్యాప్తి 50 శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ హెచ్చరించింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలను ప్రజలు సక్రమంగా పాటించకపోవడంతో ఈ వైరస్ వేరియంట్ వ్యాప్తి చెంది, తీవ్రం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, అమెరికాలో 52 యూకే రకం వైరస్ కేసులను గుర్తించారు. అయితే దీని వల్ల మరణాల తీవ్రత అధికంగా ఉంటుందనే ఆధారాలు మాత్రం లభించలేదని నిపుణులు అంటున్నారు. కాగా కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా విలవిల్లాడిపోయింది. జనవరి చివరి నాటికి మొత్తం మరణాలు 4 లక్షలు దాటాయి. దాన్ని ప్రభావం ఇంకా చల్లాకరకముందే, కరోనా అంతానికి టీకాలు వచ్చాయనే ఆనందం కంటే.. కొత్త వైరస్ ఎక్కువ వణికిస్తోంది. తన రూపాన్ని మార్చుకున్న మహమ్మారి మరింత వేగంతో వ్యాపించడం ఆందోళనకు గురిచేస్తోంది.యూకే, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తోంది. యూకే స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ యూకే కంటే ప్రమాదకారని, దీనికి ప్రస్తుత టీకాలు పనిచేయవని నిపుణులు భావిస్తున్నారు. ఇండియాలో కూడా యూకే కరోనా రకం కేసులు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. -
బ్రిటన్‌కు విమాన సర్వీసుల పునఃప్రారంభం
శంషాబాద్: బ్రిటిష్ ఎయిర్వేస్ సర్వీసులు శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నట్లు శంషాబాద్ విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ రెండో రకం వైరస్‌తో భారత్–బ్రిటన్ మధ్య విమాన రాకపోకలపై జనవరి 7 వరకు కేంద్రం నిషేధం విధించింది. వీటిని శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ పేర్కొం ది. అయితే ప్రయాణానికి ముందు 72 గంటల్లోపు చేయించుకున్న ఆర్ టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును కలిగి ఉండాలనే నిబంధనలను కఠినతరం చేశారు. కాగా బ్రిటన్‌లో స్ట్రెయిన్ కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి మూడో వారం వరకు కఠిన నిబంధనలు అమలు చేస్తామని ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు.(చదవండి: స్ట్రెయిన్ విజృంభణ.. దేశవ్యాప్తంగా లాక్డౌన్) -
వ్యాక్సిన్ల ఎగుమతులపై నిషేధం లేదు
ముంబై, సాక్షి: దేశీయంగా హెల్త్‌కేర్ కంపెనీలు తయారు చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతులపై ఎలాంటి నిషేధాన్నీ విధించలేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా పేర్కొంది. ఎగుమతి నియంత్రణలకు సంబంధించిన నాలుగు మంత్రిత్వ శాఖలూ కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఎలాంటి నిషేధాన్ని ప్రకటించలేదని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. సోమవారం ఒక ఇంటర్వ్యూలో సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా వ్యాక్సిన్లను తొలుత దేశీయంగా సరఫరా చేసేందుకే కట్టుబడినట్లు చెప్పిన విషయం విదితమే. తొలి దశలో భాగంగా ఎగుమతులకు కేంద్రం అనుమతించలేదని పేర్కొన్నారు. తదుపరి తాజాగా ఒప్పందాల ప్రకారం వ్యాక్సిన్లను ఎగుమతి చేయనున్నట్లు పూనావాలా వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకున్నట్లు ఫార్మా వర్గాలు తెలియజేశాయి. పలు దేశాలు వ్యాక్సిన్ల సరఫరా కోసం దేశీ మార్కెట్‌పై ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నాయి. వ్యాక్సిన్ల తయారీలో భారత్ భారీ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే దీనికి కారణమని తెలియజేశాయి. దీంతో పలు పశ్చిమేతర దేశాలు మిలియన్లకొద్దీ వ్యాక్సిన్ల కోసం భారత్‌వైపు చూస్తున్నట్లు వివరించాయి. (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్) పలు దేశాలు కోవిడ్-19 కట్టడికి బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశీయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోంది. ఈ వ్యాక్సిన్ల కోసం బ్రెజిల్, మెక్సికో, సౌదీ అరేబియా తదితర పలు దేశాల నుంచి ఆర్డర్లు లభించే వీలున్నట్లు గత నెలలో పూనావాలా పేర్కొన్నారు. ఇదేవిధంగా దేశీయంగానే కోవిడ్-19కు వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న భారత్ బయోటెక్ సైతం పలు దేశాలు తమ వ్యాక్సిన్లపట్ల ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించింది. లాటిన్ అమెరికా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలియజేసింది. (ఫైజర్ వ్యాక్సిన్‌కు WHO గుర్తింపు) కోవాక్స్‌లో భాగం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన కోవాక్స్ కన్సార్షియం, గవీ వ్యాక్సిన్ అలయెన్స్‌లో దేశీ వ్యాక్సిన్ల కంపెనీలు భాగమైనట్లు ఫార్మా రంగ నిపుణులు పేర్కొన్నారు. దీంతో పేద, మధ్యాదాయ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో ద్వారా వ్యాక్సిన్లు సరఫరా చేయవలసి ఉంటుందని తెలియజేశారు. కోవాక్స్ ఒప్పందంలో భాగంగా యూఎస్‌కు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నుంచి వ్యాక్సిన్ల సరఫరాకు వీలుగా సీరమ్ ఇన్స్టిట్యూట్కు నిధులు లభించినట్లు ప్రస్తావించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లతోపాటు.. నొవావాక్స్ వ్యాక్సిన్లను ఫార్మా కంపెనీలు 1 బిలియన్ డోసేజీల వరకూ కోవాక్స్‌కు సరఫరా చేయవలసి ఉంటుందని వివరించారు. ప్రాథమిక ఒప్పందంలో భాగంగా కోవాక్స్‌కు 20 కోట్ల డోసులను సీరమ్ ఇన్స్టిట్యూట్ సరఫరా చేయవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా గవీకి చెందిన కమ్యూనికేషన్స్ హెడ్ ఒల్లీ కాన్ తెలియజేశారు. ఈ ఏడాది తొలి త్రైమాసికానికల్లా భారత్ నుంచి వ్యాక్సిన్ల సరఫరా ప్రారంభంకాగలదని భావిస్తున్నట్లు చెప్పారు. -
రిపబ్లిక్‌డే : చీఫ్ గెస్ట్‌కు కొత్త కరోనా దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్ విజృంభణ కారణంలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్ట్రెయిన్ కారణంగా బోరిస్ జాన్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. మహమ్మారి నివారణ చర్యలను పర్యవేక్షించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఆయన తన టూర్‌ను విరమించుకున్నారు. ఈ మేరకు జాన్సన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడారు. గత రాత్రి ప్రకటించిన జాతీయ లాక్డౌన్, కొత్త కరోనావైరస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో తాను దేశంలో ఉండడం చాలా ముఖ్యం అని ప్రధాని పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం ఈ నెలాఖరులో భారతదేశాన్ని సందర్శించలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. (దేశంలో విస్తరిస్తున్న కొత్త కరోనా) జనవరి 26, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కావాల్సి వుంది. అయితే కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ప్రకంపనలు కొనసాగుతుండటంతో యూకేలో మరోసారి లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని సోమవారం ప్రకటించారు. దేశంలోని చాలా ప్రాంతం ఇప్పటికే కఠిన ఆంక్షల్లో ఉందనీ, కొత్త వేరియంట్‌ను నియంత్రించడం అత్యంత క్లిష్టమని, అందుకే దేశవ్యాప్త లాక్డౌన్ విధించాల్సి వచ్చిందని, కొత్త మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందకు మరింతగా శ్రమించాల్సి ఉందని జాన్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
దేశంలో విస్తరిస్తున్న కొత్త కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్త వేరియంట్ కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య తాజాగా 58కి చేరింది. నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా 20 యూకే కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగడం కలకలం రేపుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 58 మందిలో కొత్త రకం కరోనా లక్షణాలు బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం నాటికి 38 మందిలో న్యూ స్ట్రెయిన్ ధృవీకరణ కాగా, మంగళవారం కొత్తగా మరో 20 మందిలో న్యూ స్ట్రెయిన్ బయటపడిందని వెల్లడించింది. (యూకే స్ట్రెయిన్: సల్మాన్ సోదరులపై కేసు) దేశంలో ఒకవైపు కోవిడ్-19కేసులు తగ్గుముఖంపడుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కానీ కొత్తకరోనా కేసుల విస్తరణ మాత్రం ఆందోళన పుట్టిస్తోంది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ గేబ్రియేసస్ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రాణాంతక కరోనా వైరస్ ఉనికిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ కనుగొనే క్రమంలో ప్రపంచలోని అన్ని దేశాలకంటే భారత్ ముందుంది అంటూ అభినందించారు. కాగా సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌లకు దేశంలో అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
యూకే స్ట్రెయిన్: సల్మాన్ సోదరులపై ఎఫ్ఐఆర్
ముంబై: కరోనా వైరస్‌ను అరికట్టెందుకు మన ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధిస్తున్నప్పటికి కొందరు మాత్రం వాటిని లెక్కచేయకుండా పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వ నియమాలను, ఆదేశాలను లెక్కచేయని వారిలో సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం. తాజాగా వారిలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సోహైల్ ఖాన్లు కూడా చేరారు. కోవిడ్ నిబంధనలను ఉల్లఘించారంటూ వారిపై ఓ వైద్యాధికారి ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ) పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహరాష్ట్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చిన వారు కోవిడ్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి అంటూ ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలో ఒకవేళ నెగిటివ్ వచ్చినప్పటికి కూడా వారాల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని మహా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల దుబాయ్ వెళ్లిన అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, సోహైల్ తనయుడు నిర్వాన్ ఖాన్లు గతేడాది డిసెంబర్ 25న దుబాయ్ నుంచి ముంబైకు తిరిగి వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం లేక్క చేయకుండ ఆర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, నిర్వాన్‌లు నిబంధలను ఉల్లఘించడంతో ముగ్గురిపై ముంబై వైద్యాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్‌కు వెళ్లాలి. కానీ నిబంధనలను అతిక్రమిస్తూ వారు నేరుగా ఇంటికి వెళ్లారని, కోవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్లో ఉండాలని చెప్పినా పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించారని సదరు వైద్య అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
స్ట్రెయిన్ విజృంభణ.. దేశవ్యాప్తంగా లాక్డౌన్
లండన్: బ్రిటన్‌లో కరోనా కొత్తరకం వైరస్(స్ట్రెయిన్) కరాళనృత్యం చేస్తోంది. ఒక్కరోజులోనే వేల సంఖ్యల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ప్రభుత్వం సోమవారం పూర్తిస్థాయి లాక్డౌన్ ప్రకటించింది. ఫిబ్రవరి మూడో వారం వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని, ఉధృతమైన కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. లాక్డౌన్ నిబంధనలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రాథమిక, సెకండరీ స్థాయి పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరాలు, నిత్యావసరాల కోసం మాత్రమే నిర్దేశిత సమయంలో బయటకు వెళ్లాలని, వీలైనన్ని రోజులు వర్క్ ఫ్రం హోమ్ వెసలుబాటు కల్పించాలని ఆదేశించారు. ఇక సోమవారం 27 వేల మంది కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరారని, తొలి దశతో పోలిస్తే సెకండ్‌వేవ్‌లో 40 శాతం మేర ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: 30కి పైగా దేశాల్లో కొత్త స్ట్రెయిన్) ఇక గత మంగళవారం అయితే 24 గంటల్లోనే ఏకంగా 80 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, పరిస్థితి చేయి దాటిపోకముందే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే దేశమంతా పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ఇప్పటికే దేశవ్యాప్తంగా కఠినతరమైన నిబంధనలు అమలు చేస్తున్నాం. కానీ కొత్త రకం వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అది మాత్రమే సరిపోదు. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేంతవరకు మరింత అప్రమత్తంగా ఉండాలి’’ అని బోరిస్ జాన్సన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా బ్రిటీష్ పౌరులను కాపాడుకునేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని, అయితే అందుకు మీ సహకారం కూడా కావాలని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థించారు. కాగా ప్రధాని ప్రసంగం ముగిసిన తర్వాత ఇంగ్లండ్ స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ మెడికల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్లు వైరస్ వ్యాప్తికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. దేశంలో మహమ్మారి విజృంభణ ఉధృతమైందని, ఐదో లెవల్‌కు చేరుకుందని పేర్కొన్నారు. 21 రోజుల్లో పరిస్థితి అదుపులోకి రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కాబట్టి ముందే జాగ్రత్త పడటం మేలు అని హెచ్చరించారు. -
38కి చేరిన కొత్తరకం వైరస్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌లో కలవరం పుట్టిస్తున్నకొత్త వైరస్ ఉనికి దేశంలోకూడా ఆందోళన రేపుతోంది. కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా మరో 9 మందికి కొత్త వేరియంట్ కోవిడ్-19 వైరస్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో బ్రిటన్ స్ట్రైయిన్ కరోనా కేసుల సంఖ్య 38కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. జనవరి 1కి 29గా ఉన్న కొత్త రకం కరోనా కేసుల సంఖ్య మూడు రోజుల్లో 38కి చేరింది. ఢి ల్లీలోని ఐజీఐబీలో 11, ఢిల్లీలోని ఎన్సీడీసీలో 8, బెంగళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్లో 10, పూణేలోని ఎన్ఐవీలో 5, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 3, కోల్‌కతాలోని ఎన్సీబీజీలో ఒకటి చొప్పున కొత్త రకం కరోనా వైరస్‌ను నిర్ధారించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా ఈ నెల 6 వరకు నిషేధించిన బ్రిటన్‌కు విమాన సేవలను, తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం మరింత ఆందోళన రేపుతోంది. -
కరోనా 2.0: వ్యాక్సిన్ రక్షించునా?!
బ్రిటన్ తదితర దేశాల నుంచి మరోసారి కరోనా పులి పంజా విప్పింది. ఈ సారి మరో సరికొత్త రూపంతో ప్రపంచం మీద ప్రతాపం చూపిస్తోంది. ఆప్పటికే పలు దేశాలు లాక్డౌన్ బాట పట్టాయి. మన దేశంలోనూ కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్తగా ఆంక్షలు విధిస్తున్నారు. మరోవైపు ప్రజల్లో కూడా ఏం జరుగుతోంది? ఏం జరుగబోతోంది? అనే ఆందోళన నెలకొంది. ఈ నేపధ్యంలో వేల సంఖ్యలో ప్రజలు సామూహికంగా జరుపుకునే నూతన సంవత్సర వేడుకలు, పండుగలూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే నగరానికి చెందిన మణిపాల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీధర్ అందిస్తున్న అభిప్రాయాల, సూచనల సమాహారమే ఈ కథనం.. –సాక్షి, సిటీబ్యూరో గత ఏడాది డిసెంబరు నెలలో చైనాలో కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పుడు మనం పట్టించుకోనేలేదు. అది మన వరకూ రాదనుకున్నాం. అదే ధీమాతో జనవరి, ఫిబ్రవరి వరకూ గడిపేశాం. చివరికి ఏమైంది.. మార్చిలో లాక్డౌన్ పెట్టాల్సి వచ్చింది. మరి అదే విధంగా ఈ సారి కూడా డిసెంబరు నెలలో మరో కొత్త స్ట్రెయిన్‌ని కనిపెట్టారు. మరి ఇప్పుడూ అదే పరిస్థితి వస్తుందా? జనవరి తర్వాత మనకు రావచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే అది ఖచ్చితమా కాదా అప్పుడే చెప్పలేం. కాకపోతే మన గతానుభవం మనల్ని హెచ్చరిస్తోంది. ఉధృతి.. విస్తృతి ఈసారి కరోనా కొత్త స్ట్రెయిన్‌ని బ్రిటన్‌లో కనుక్కొన్నారు. పాత స్ట్రెయిన్‌తో పోలిస్తే ఇది 70 నుంచి 80 రెట్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని డాటా కూడా విడుదల చేశారు. ఈ సమాచారాన్ని ఆషామాషీగా విడుదల చేయలేదు. పూర్తి స్థాయి ల్యాబ్ ప్రయోగాల తర్వాతనే రిలీజ్ చేశారు. సదరన్ ఇంగ్లాండ్‌లో కనుక్కున్న పెద్ద సంఖ్యలో నమోదైన కేసుల్లో 70–80శాతం ఈ స్ట్రెయిన్‌కు చెందినవే. దీనిని బట్టి ఇది మరింత వేగంగా స్ప్రెడ్ అవుతుందని తేల్చారు. ఇది పాత స్ట్రెయిన్‌తో పోలిస్తే తీవ్రమైన నిమోనియాకు కారణం కావడం, మరణాల రేటు.. ఇవన్నీ ఎక్కువగా ఉంటాయా లేదా అనేది తెలీదు. (చదవండి: ఆర్టీపీసీఆర్లో చిక్కని బ్రిటన్ స్ట్రెయిన్..!) వ్యాక్సిన్...రక్షించునా? దేశ విదేశీ ఫార్మా కంపెనీల ద్వారా అందుబాటులోకి వస్తున్న వ్యాక్సిన్ల ద్వారా ఈ రెండో స్ట్రెయిన్ బారి నుంచి రక్షణ లభిస్తుందా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కాకపోతే ఏ వ్యాక్సిన్ అయినా కరోనా వైరస్ పైన ఉన్న ప్రొటీన్‌ని టార్గెట్ చేస్తాయి. ఒక్కో కంపెనీ ఒక్కో వ్యాక్సిన్ రిలీజ్ చేశాయి కాబట్టి ఇవి వేర్వేరు ప్రొటీన్స్‌ని టార్గెట్ చేస్తాయి. కనుక ఈ వ్యాక్సిన్లు రెండో స్ట్రెయిన్కి కూడా పనిచేస్తాయని కొందరు సైంటిస్ట్‌లు అంటున్నారు. మల్టిపుల్ టార్గెట్స్‌ని వ్యాక్సిన్స్ టార్గెట్ చేస్తాయి కాబట్టి ఇవి పనిచేస్తాయని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఇది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. (చదవండి: 200 మంది పర్యాటకుల పరారీ ) వచ్చి తగ్గినా.. మళ్లీ రావచ్చు కరోనా నుంచి కోలుకున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరందరూ తమకు మళ్లీ రాదు అనుకోవడం సరైంది కాదు. అప్పట్లో సెకండ్ ఇన్ఫెక్షన్ రాదనుకున్నారు. అయితే అది తప్పిన నిరూపించి.. మరణించిన కేసులు కూడా నమోదయ్యాయి. డెంగ్యూ వైరస్ వంటి అనుభవాలు చెప్పిన ప్రకారం... వైరస్ ఒకసారి వచ్చి తగ్గాక రెండో సారి మరింత తీవ్రంగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి కొత్త స్ట్రెయిన్ వచ్చినా తమకు రాదని.. వచ్చి తగ్గినవారు ధీమాగా ఉండడం సరైంది కాదు. ఒక్కోసారి శరీరంలో వృద్ధి చెందిన యాంటీ బాడీస్ మనల్ని రక్షించడం మానేసి ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగేందుకు కారణమవుతాయని పలు సందర్భాల్లో రుజువైంది. (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్) కీడెంచి.. మేలెంచుదాం మనం ఎలాగైతే వైరస్ మీద పై చేయి సాధించడానికి ప్లాస్మా థెరపీలనీ, అవనీ..ఇవనీ పలు రకాల మార్గాలు వెదుకుతుంటామో.. అలాగే వైరస్ కూడా మన ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే క్రమంలో మరింత బలపడుతూ రూపాంతరం చెందుతుంటుంది. వీటన్నింటిని బేరీజు వేస్తే.. మనల్ని మనం రక్షించుకోవడమే మార్గం. వ్యాక్సిన్ వచ్చేసింది. కేసులు తగ్గిపోతున్నాయి.. ఇంకేమీ పర్లేదు అనేది భ్రమ. సాధారణంగా పూర్తి సామార్థ్యం గల ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి అయిదారేళ్లు పడుతుంది. కానీ కరోనాకి యుద్ధప్రాతిపదికన కనిపెట్టిన వ్యాక్సిన్లు ఇవి. ఇవి ఎంత బాగా పనిచేస్తాయనేది ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనా ఏమరుపాటు ఏమాత్రం మంచిది కాదు. అమెరికాలో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే యూరప్ లాంటివి లాక్డౌన్ వైపు వెళుతున్నాయి. మరోవైపు జనంలో మాస్క్‌లు ధరించే అలవాటు తగ్గిపోతోంది. సోషల్ డిస్టెన్స్ దాదాపు మర్చిపోయాం. ఇది చాలా ప్రమాదకరం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన ప్రతి సూచనా మరో ఆర్నెళ్ల పాటు పాటించాల్సిందే. -
తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్
న్యూఢిల్లీ, సాక్షి: కోవిడ్-19 కట్టడికి దేశీయంగా వ్యాక్సిన్లను రూపొందిస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ తొలుత వీటిని ప్రభుత్వానికే సరఫరా చేయనుంది. ఇందుకు వీలుగా తొలి దశలో ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించినట్లు కంపెనీ వెల్లడించింది. తొలి దశలో దేశీయంగా అవసరమైన వ్యాక్సిన్లను సరఫరా చేసేటంతవరకూ ఎగుమతులకు అవకాశముండదని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా పేర్కొన్నారు. ఈ షరతులపైనే వ్యాక్సిన్‌కు తాజాగా అనుమతి లభించినట్లు తెలియజేశారు. ఇదేవిధంగా వ్యాక్సిన్‌ను ప్రయివేట్ మార్కెట్లోనూ విక్రయించేందుకు వీలుండదని ఒక ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించారు. చౌక ధరలో ప్రభుత్వానికి ఒక్కో డోసునూ రూ. 200 ధర(2.74 డాలర్లు)లో చౌకగా సరఫరా చేయనున్నట్లు పూనావాలా వెల్లడించారు. తొలి దశలో 10 కోట్ల డోసేజీలను చౌక ధరలో అందించనున్నట్లు తెలియజేశారు. తదుపరి వ్యాక్సిన్ ధరలు పెరగనున్నట్లు చెప్పారు. దేశీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే తొలి ప్రాతిపదికగా వివిధ రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు తెలియజేశారు. 7-10 రోజుల్లో వ్యాక్సిన్స పంపిణీ చేపట్టనున్నట్లు చెప్పారు. తదుపరి కాలంలో ప్రయివేట్ మార్కెట్లలో వీటిని రూ. 1000 ధరలో విక్రయించే వీలున్నట్లు చెప్పారు. కోవాక్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కోవాక్స్‌కు వ్యాక్సిన్ల సరఫరా చేసేందుకు మార్చి, ఏప్రిల్ వరకూ వేచిచూడవలసి ఉంటుందని పూనావాలా పేర్కొన్నారు. గవీ(జీఏవీఐ), సీఈపీఐల భాగస్వామ్యంలో పేద, మధ్యాదాయ దేశాలకు కోవాక్స్ ద్వారా వ్యాక్సిన్లను సరఫరా చేయనున్న సంగతి తెలిసిందే. సంపన్న దేశాలు వ్యాక్సిన్ల సరఫరా కోసం పలు కంపెనీలతో తొలి దశలోనే ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఆస్ట్రాజెనెకాకు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్‌ను దేశీయంగా కోవీషీల్డ్ పేరుతో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా 10 కోట్ల డోసేజీలను ఆస్ట్రాజెనెకాకు సరఫరా చేయవలసి ఉంది. అంతేకాకుండా నోవోవాక్స్కు సైతం 10 కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు 30-4 కోట్ల డోసేజీల సరఫరాకు వీలుగా కోవాక్స్‌తో డీల్‌పై చర్చలు తుది దశకు చేరినట్లు పూనావాలా పేర్కొన్నారు. వెరసి ఇటు దేశీ ప్రభుత్వానికి, అటు కోవాక్స్‌కూ వ్యాక్సిన్ల సరఫరాలో బ్యాలన్స్‌ను పాటించవలసి ఉన్నట్లు చెప్పారు. -
స్ట్ర్రెయిన్ ఎఫెక్ట్- పసిడి, వెండి హైజంప్
న్యూయార్క్/ ముంబై: కరోనా కొత్త స్ట్ర్రెయిన్ కారణంగా బ్రిటన్‌లో ఓవైపు కఠిన లాక్‌డవున్ ఆంక్షలను అమలు చేస్తుంటే.. మరోపక్క టోక్యోసహా పలు ప్రాంతాలలో జపాన్ సైతం ఎమర్జెన్సీ విధించనున్న వార్తలు పసిడికి ఒక్కసారిగా డిమాండ్‌ను పెంచాయి. దీంతో న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1.6 శాతం పుంజుకుని 1926 డాలర్లకు ఎగసింది. ఇది 8 వారాల గరిష్టంకాగా.. ఈ బాటలో దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ రూ.565 బలపడింది. విదేశీ మార్కెట్లో వెండి మరింత అధికంగా 3 శాతం జంప్‌చేయగా.. దేశీయంగానూ రూ. 1,400 పెరిగింది. గత వారం అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు మెరుస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ రూపు మార్చుకుని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మళ్లీ సంక్షోభ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనలు పసిడికి డిమాండును పెంచుతున్నట్లు బులియన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా.. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడికి నేటి ట్రేడింగ్‌లో 1914-1928 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని పృథ్వీ ఫిన్‌మార్ట్ డైరెక్టర్ మనోజ్ జైన్ అంచనా వేశారు. ఇదేవిధంగా 1884-1870 డాలర్ల వద్ద సపోర్ట్స్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. చదవండి: (9వ రోజూ జోరు- సెన్సెక్స్@ 48,000) లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 565 బలపడి రూ. 50,809 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,300 వద్ద హుషారుగా ప్రారంభమైన పసిడి తదుపరి 50,892వద్ద గరిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 1,394 జంప్‌చేసి రూ. 69,517 వద్ద కదులుతోంది. రూ. 68,499 వద్ద సానుకూలంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 70,259 వరకూ దూసుకెళ్లింది. (2021లో పెట్టుబడికి 6 స్టాక్స్) హుషారుగా న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 31 డాలర్లు(1.35 శాతం) పెరిగి 1,926 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 1.3 శాతం బలపడి 1,923 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 3.1 శాతం జంప్‌చేసి 27.22 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
నేడు, రేపు రాత్రి కర్ఫ్యూ!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు టీకా రావడంతో దేశ ప్రజలంతా ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. మహమ్మారిని అరికట్టేందుకు మందు రావడంతో ఇక న్యూ ఇయర్ వేడుకలను వైభవంగా జరపుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న దేశ రాజధాని ప్రజలకు చేదు అనుభవం ఎదురైంది. డిసెంబర్ 31, రాత్రి, జనవరి 1 తేదీల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆప్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. బ్రిటన్ కొత్త స్ట్రైయిన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రాత్రి కర్ఫ్యూ సమయంలో ఎవరూ కూడా కొత్త సంవత్సరం వేడుకలను ఇళ్ల బయట జరుపుకోకూడదని, బహిరంగ స్థలాల్లో గుంపులుగా ఉండటం, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా కర్ఫ్యూ సమయంలో బయటకు వస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. (చదవండి: న్యూ ఇయర్.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ) అయితే భారత్‌లో బ్రిటన్ కొత్త స్ట్రైయిన్ కేసులు బయటపడటంతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించే పనిలో పడ్డాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా కఠిన ఆంక్షలు విధించాయి. బహిరంగ ప్రదేశాలు, ఫంక్షన్ హాల్స్ తదితర ప్రదేశాల్లో వేడుకలపై నిషేధం విధించాయి. అంతేగాక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే చర్యలు తప్పవని హెచ్చరించాయి. కాగా ఈ కొత్త స్ట్రెయిన్ వైరస్ తొలిసారిగా యూకేలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తూ మన దేశంతో పాటు పలు దేశాలకు కూడా విస్తరించింది. ఈ వైరస్ కంట్రోల్ దాటిపోయిందంటూ యూకే ఆందోళన వ్యక్తం చేయడంతో న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో అన్ని దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. (చదవండి: యూకే స్ట్రెయిన్: మరో ఐదుగురికి పాజిటివ్) -
యూకే స్ట్రెయిన్: మరో ఐదుగురికి పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తరకం కరోనా క్రమక్రమంగా విస్తరిస్తోంది. దేశంలో తాజాగా మరో ఐదుగురికి యూకే స్ట్రెయిన్ కరోనా వైరస్ సోకింది. పూణేలో నలుగురికి , ఢిల్లీలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్‌లో మొత్తంగా యూకే స్ట్రెయిన్ కరోనా కేసుల సంఖ్య 25కు చేరింది. బాధితులందరినీ ప్రత్యేక అబ్జర్వేషన్లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా మంగళవారం 6, బుధవారం 14 కరోనా కొత్తరకం కేసులు బయటపడిన విషయం తెలిసిందే. (చదవండి: భారత్‌లో యూకే స్ట్రెయిన్ కలకలం..) ఇదిలా ఉండగా.. భారత్‌లో కొత్తగా 21,821 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. 299 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 10,266,674కు చేరగా, కరోనా మరణాల సంఖ్య 148,738గా నమోదైంది. చదవండి: అలర్ట్: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్ వద్దు -
హైదరాబాద్: మరొకరికి బ్రిటన్ స్ట్రెయిన్!?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ మరో వ్యక్తికి సోకినట్లు తెలిసింది. వైద్య, ఆరోగ్య వర్గాల సమాచారం ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే ఒక మహిళ ఈ యూకే కరోనా వైరస్ బారిన పడింది. సీసీఎంబీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సీలో ఇది వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. అయితే అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి వివరాలు ప్రకటించడం లేదు. ఈ కొత్త కేసుతో రాష్ట్రంలో బ్రిటన్ వేరియంట్ కరోనా కేసులు రెండుకు చేరుకున్నాయి. (చదవండి: ఆర్టీపీసీఆర్లో చిక్కని బ్రిటన్ స్ట్రెయిన్..! ) కాగా సోమవారం వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఒక 49 ఏళ్ల వయసున్న వ్యక్తికి బ్రిటన్ వేరియంట్ స్ట్రెయిన్ వచ్చినట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అతను ప్రస్తుతం వరంగల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని తల్లికి కరోనా సాధారణ పాజిటివ్ రావడంతో ఆమె శాంపిళ్లను కూడా జీనోమ్ సీక్వెన్సీ కోసం సీసీఎంబీకి పంపించారు. అయితే ఆ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఒక్కరోజు వ్యవధిలోనే 2 కేసులు నమోదు కావడంతో వైద్య, ఆరోగ్యశాఖలో అలజడి మొదలైంది. కేసుల వివరాలను కేంద్రం ప్రకటించాలే కానీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధం లేదని చెబుతున్నారు. ‘గాంధీ’లో ఆధునిక ఆపరేషన్ థియేటర్ ఇతర ప్రభుత్వాస్పత్రులకు 3 ఎంఆర్ఐ,11 సీటీ స్కాన్ పరికరాలు మరో 3 కార్డియాక్ క్యాత్ ల్యాబ్‌లు.. అధికారులతో ఈటల భేటీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తేవాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. మంగళవారం వైద్యపరికరాల ఉత్పత్తి సంస్థల ప్రతినిధులతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు నాగేం దర్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో అధునాతన సౌకర్యాలతో (మాడ్యులర్) వేర్వేరు శస్త్రచికిత్స గదులను సిద్ధం చేయనున్నారు. ఇక ఆసుపత్రిలోని 8వ ఫ్లోర్లో ఐదు ఆధునిక ఆపరేషన్ థియేటర్లను నిర్మించాలని నిర్ణయించారు. అందుకు రూ.35 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.30 లక్షల నుంచి 40 లక్షల వరకూ ఖర్చయ్యే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందజేస్తున్నామని ఈటల తెలిపారు. అవయవ మార్పిడి కేంద్రంగా గాంధీని తీర్చిదిద్దడం వల్ల అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా 3 ఎంఆర్ఐ, 11 సీటీ స్కాన్ పరికరాలు, 3 కార్డియాక్ క్యాత్ ల్యాబ్‌లను తేవాలని నిర్ణయించారు. -
ఆర్టీపీసీఆర్లో చిక్కని బ్రిటన్ స్ట్రెయిన్..!
సాక్షి, హైదరాబాద్: సాధారణ కరోనా వైరస్ సోకినవారు 7 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని, బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్‌కు 14 రోజులు ఐసోలేషన్ తప్పనిసరని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. సాధారణ వైరస్ నుంచి కోలుకున్నవారికి ప్రస్తుతం 7 రోజులు దాటాక లక్షణాలు ఏమీ లేకుంటే ఎలాంటి టెస్టులు చేయకుండానే సాధారణ వ్యక్తులుగా పరిగణిస్తున్నారు. వారి ఐసోలేషన్ కాలం పూర్తయినట్లుగా గుర్తిస్తున్నారు. అయితే బ్రిటన్ స్ట్రెయిన్ విషయంలో 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచాక వారికి మరోసారి కరోనా పరీక్ష చేస్తారు. అందులో నెగటివ్ వచ్చాకే బాధితులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. పాజిటివ్ వస్తే మరికొన్ని రోజులు ఉంచుతారు. ఇక బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వచ్చిన వారిని తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. హోం ఐసోలేషన్‌కు అనుమతివ్వరు. అయితే ప్రస్తుత సాధారణ కరోనా వైరస్ మాదిరిగానే బ్రిటన్ వైరస్ సోకినవారికి చికిత్స చేస్తారు. బ్రిటన్ వైరస్‌కు ప్రత్యేక వైద్యం లేదని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే సాధారణ కరోనా వైరస్ వార్డుల్లో బ్రిటన్ వైరస్ బాధితులను ఉంచకూడదని నిర్ణయించారు. బ్రిటన్ వైరస్ సాధారణ వైరస్ రోగులకు వ్యాపించే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రాష్ట్రంలో 12 ఆసుపత్రులను బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా బాధితులకు కేటాయించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రతీ ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒకటి, మిగిలినవి హైదరాబాద్‌లో ఆయా ఆసుపత్రులను అందుబాటులో ఉంచుతారు. ఉదాహరణకు ప్రస్తుతం బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ బాధితుల్లో 14 మందిని హైదరాబాద్ టిమ్స్‌లో ఉంచారు. మిగిలిన వారిని వివిధ జిల్లాల్లో ఉంచారు. టిమ్స్‌లో బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా బాధితుల కోసం మూడు ఫ్లోర్లు సిద్ధం చేశారు. (చదవండి: కొత్త వైరస్కూ పాత జాగ్రత్తలే ) పోలీస్, రెవెన్యూల సహకారం... బ్రిటన్ నుంచి వచ్చే వారి వివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు పోలీసు, రెవెన్యూ సహా ఇతర శాఖల సహకారం తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళికలో పేర్కొంది. కరోనా వైరస్ వచ్చిన మొదట్లో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా బ్రిటన్ వైరస్ పట్ల అలాగే వ్యవహరించాలని నిర్ణయించింది. బ్రిటన్ స్ట్రెయిన్ వచ్చిన బాధితులు ఎవరెవరిని కలిశారో వారి మొదటి, రెండు, మూడు కాంట్రాక్టు వ్యక్తులను గుర్తిస్తారు. ఒకవేళ కేసులు పెరిగితే మొదట్లో మాదిరిగానే కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వైరస్‌కు వేగంగా విస్తరించే గుణం ఉన్నందున అంతే వేగంగా బాధితులను గుర్తించాల్సి ఉందని కార్యాచరణ ప్రణాళికలో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఆర్టీపీసీఆర్లో చిక్కని బ్రిటన్ స్ట్రెయిన్... బ్రిటన్ వైరస్ ప్రస్తుత సాధారణ పరీక్షల్లో కనుగొనే వీలే లేదని తేలిపోయింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు సాధారణ కరోనాను నిర్ధారించడానికే పరిమితమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్రిటన్ స్ట్రెయిన్ ఉందా.. లేదా.. తెలుసుకోవాలంటే ముందుగా వారిలో సాధారణ కరోనా వైరస్ ఉందా.. లేదా.. తెలుసుకునేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తారు. అందులో పాజిటివ్ వస్తే బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ ఉందో.. లేదో.. తెలుసుకునేందుకు సీసీఎంబీ వంటి ప్రతిష్టాత్మక పరిశోధనాత్మక సంస్థల్లో జీనోమ్ సీక్వెన్సీ (జన్యు విశ్లేషణ) చేయాల్సిందేనని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒకవేళ బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ విస్తరిస్తే దాన్ని గుర్తించేందుకు రాష్ట్రంలో నిమ్స్‌లో జీనోమ్ సీక్వెన్సీ టెస్టింగ్ మెషీన్‌ను నెలకొల్పాలని భావిస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్‌ను గుర్తించాలంటే జీనోమ్ సీక్వెన్సీతోపాటు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లలో మార్పులు చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్ విస్తరించకుండా జిల్లాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాల అధికారులను ఆదేశించింది. -
దేశంలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 కట్టడికై వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ మహమ్మారి రూపం మార్చుకుని మరోసారి బెంబేలెత్తిస్తోంది. దేశంలో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఇక కొత్తరకం వైరస్‌కు ఎన్440కె(N440K)గా నామకరణం చేశారు. దీనికి యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే లక్షణం ఉన్నట్లు తెలిపారు. కాగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో దీని ఉనికిని గుర్తించారు. అదే విధంగా నోయిడాలో కోవిడ్ రీ ఇన్ఫెక్షన్ కేసు(కొత్తరకం)ను గుర్తించినట్లు సమాచారం. కాగా భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,021 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 279 మంది మృతి చెందారు. (చదవండి: 24 గంటల్లో 279 మంది మృతి) దీంతో మొత్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య కోటి రెండు లక్షలకు చేరగా.. 1,47,901 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక యూకేలో ఇప్పటికే కొత్త రకం కరోనా వైరస్(B.1.1.7) గుర్తించిన విషయం తెలిసిందే. శరవేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా మునుపటి కంటే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక దక్షిణాఫ్రికాలో సైతం మరో రూపంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్‌లో సైతం ఎన్440కె రకాన్ని గుర్తించారు. కాగా యూకేలో కొత్తగా 2.2 లక్షల మంది కోవిడ్ రోగుల్లోని 6 శాతం మందిలో కొత్త వైరస్ లక్షణాలు బయటపడగా.. భారత్‌లోని కోటి మందికి పైగా కరోనా పేషెంట్లలో అతిస్వల్ప సంఖ్యలో (0.05 శాతం) ఈ వైరస్ జన్యువులో మార్పులు గుర్తించినట్లు సమాచారం.