సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్త వేరియంట్ కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య తాజాగా 58కి చేరింది. నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా 20 యూకే కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగడం కలకలం రేపుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 58 మందిలో కొత్త రకం కరోనా లక్షణాలు బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం నాటికి 38 మందిలో న్యూ స్ట్రెయిన్ ధృవీకరణ కాగా, మంగళవారం కొత్తగా మరో 20 మందిలో న్యూ స్ట్రెయిన్ బయటపడిందని వెల్లడించింది. (యూకే స్ట్రెయిన్: సల్మాన్ సోదరులపై కేసు)
దేశంలో ఒకవైపు కోవిడ్-19కేసులు తగ్గుముఖంపడుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కానీ కొత్తకరోనా కేసుల విస్తరణ మాత్రం ఆందోళన పుట్టిస్తోంది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ గేబ్రియేసస్ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రాణాంతక కరోనా వైరస్ ఉనికిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ కనుగొనే క్రమంలో ప్రపంచలోని అన్ని దేశాలకంటే భారత్ ముందుంది అంటూ అభినందించారు. కాగా సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌లకు దేశంలో అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment