
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా దేశంలో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగతుండటంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. జనవరి 14 నాటికి ఈ రకం వైరస్ కేసుల సంఖ్య 109కి చేరిందని వెల్లడించింది. జనవరి 11 నాటికి ఈ రకం కేసుల సంఖ్య 96గా ఉండగా, తాజాగా 109కి చేరడం కలవరపెడుతోంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో కొత్త రకం కరోనా వైరస్, చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతేడాది చివర్లో బ్రిటన్‌లో రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా వైరస్‌పై అప్రమత్తమైన భారత ప్రభుత్వం.. యూకే నుంచి భారత్‌కు విమాన సర్వీసులను డిసెంబర్ 22 వరకు రద్దు చేసింది. అయినప్పటికీ దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
జనవరి 8 నుంచి యూకే విమాన సర్వీసులను పునరుద్దరించిన భారత ప్రభుత్వం..అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి,14 రోజులు క్వారంటైన్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, యూకే స్ట్రెయిన్ ప్రభావం బ్రిటన్ సహా అమెరికా,స్పెయిన్, ఫ్రాన్స్, స్వీడన్, స్విడ్జర్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలపై పడింది. దీంతో ఆయా దేశాల్లో సైతం కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment