సాక్షి, హైదరాబాద్: సాధారణ కరోనా వైరస్ సోకినవారు 7 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని, బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్‌కు 14 రోజులు ఐసోలేషన్ తప్పనిసరని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. సాధారణ వైరస్ నుంచి కోలుకున్నవారికి ప్రస్తుతం 7 రోజులు దాటాక లక్షణాలు ఏమీ లేకుంటే ఎలాంటి టెస్టులు చేయకుండానే సాధారణ వ్యక్తులుగా పరిగణిస్తున్నారు. వారి ఐసోలేషన్ కాలం పూర్తయినట్లుగా గుర్తిస్తున్నారు. అయితే బ్రిటన్ స్ట్రెయిన్ విషయంలో 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచాక వారికి మరోసారి కరోనా పరీక్ష చేస్తారు. అందులో నెగటివ్ వచ్చాకే బాధితులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. పాజిటివ్ వస్తే మరికొన్ని రోజులు ఉంచుతారు. ఇక బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వచ్చిన వారిని తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. హోం ఐసోలేషన్‌కు అనుమతివ్వరు.
అయితే ప్రస్తుత సాధారణ కరోనా వైరస్ మాదిరిగానే బ్రిటన్ వైరస్ సోకినవారికి చికిత్స చేస్తారు. బ్రిటన్ వైరస్‌కు ప్రత్యేక వైద్యం లేదని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే సాధారణ కరోనా వైరస్ వార్డుల్లో బ్రిటన్ వైరస్ బాధితులను ఉంచకూడదని నిర్ణయించారు. బ్రిటన్ వైరస్ సాధారణ వైరస్ రోగులకు వ్యాపించే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రాష్ట్రంలో 12 ఆసుపత్రులను బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా బాధితులకు కేటాయించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రతీ ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒకటి, మిగిలినవి హైదరాబాద్‌లో ఆయా ఆసుపత్రులను అందుబాటులో ఉంచుతారు. ఉదాహరణకు ప్రస్తుతం బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ బాధితుల్లో 14 మందిని హైదరాబాద్ టిమ్స్‌లో ఉంచారు. మిగిలిన వారిని వివిధ జిల్లాల్లో ఉంచారు. టిమ్స్‌లో బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా బాధితుల కోసం మూడు ఫ్లోర్లు సిద్ధం చేశారు. (చదవండి: కొత్త వైరస్‌కూ పాత జాగ్రత్తలే )
పోలీస్, రెవెన్యూల సహకారం...
బ్రిటన్ నుంచి వచ్చే వారి వివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు పోలీసు, రెవెన్యూ సహా ఇతర శాఖల సహకారం తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళికలో పేర్కొంది. కరోనా వైరస్ వచ్చిన మొదట్లో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా బ్రిటన్ వైరస్ పట్ల అలాగే వ్యవహరించాలని నిర్ణయించింది. బ్రిటన్ స్ట్రెయిన్ వచ్చిన బాధితులు ఎవరెవరిని కలిశారో వారి మొదటి, రెండు, మూడు కాంట్రాక్టు వ్యక్తులను గుర్తిస్తారు. ఒకవేళ కేసులు పెరిగితే మొదట్లో మాదిరిగానే కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వైరస్‌కు వేగంగా విస్తరించే గుణం ఉన్నందున అంతే వేగంగా బాధితులను గుర్తించాల్సి ఉందని కార్యాచరణ ప్రణాళికలో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఆర్టీపీసీఆర్‌లో చిక్కని బ్రిటన్ స్ట్రెయిన్...
బ్రిటన్ వైరస్ ప్రస్తుత సాధారణ పరీక్షల్లో కనుగొనే వీలే లేదని తేలిపోయింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు సాధారణ కరోనాను నిర్ధారించడానికే పరిమితమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్రిటన్ స్ట్రెయిన్ ఉందా.. లేదా.. తెలుసుకోవాలంటే ముందుగా వారిలో సాధారణ కరోనా వైరస్ ఉందా.. లేదా.. తెలుసుకునేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తారు. అందులో పాజిటివ్ వస్తే బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ ఉందో.. లేదో.. తెలుసుకునేందుకు సీసీఎంబీ వంటి ప్రతిష్టాత్మక పరిశోధనాత్మక సంస్థల్లో జీనోమ్ సీక్వెన్సీ (జన్యు విశ్లేషణ) చేయాల్సిందేనని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
ఒకవేళ బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ విస్తరిస్తే దాన్ని గుర్తించేందుకు రాష్ట్రంలో నిమ్స్‌లో జీనోమ్ సీక్వెన్సీ టెస్టింగ్ మెషీన్‌ను నెలకొల్పాలని భావిస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్‌ను గుర్తించాలంటే జీనోమ్ సీక్వెన్సీతోపాటు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లలో మార్పులు చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్ విస్తరించకుండా జిల్లాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాల అధికారులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment