గుజరాతీ గాడిదలకు ప్రచారం మానండి
అమితాబ్‌కు అఖిలేశ్ సూచన
బరేలీ: ‘గుజరాతీ గాడిదలకు ప్రచారం చేయకండి’ అని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు సలహా ఇచ్చారు. ఎవరిని ఉద్దేశించి ఇలా అన్నారో ఆయన చెప్పకున్నా మోదీ, అమిత్ షాలను ఉద్దేశించి అన్నట్లు భావిస్తున్నారు. గుజరాత్‌లోని లిటిల్ రాన్ ఆఫ్ కచ్‌లో ఉన్న అడవి గాడిదల అభయారణ్యానికి రావాలంటూ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ చేసిన ఓ వాణిజ్య ప్రకటనను అఖిలేశ్ ప్రస్తావించారు.
‘గాడిదలున్న ఓ ప్రకటన టీవీలో వస్తోంది. గుజరాతీ గాడిదలకు మద్దతివ్వడం మనుకోవాలని శతాబ్దపు పెద్దనటుణ్ని కోరుతున్నా..’ అని సోమవారం ఉంచహార్‌లో ఎన్నికల సభలో అన్నారు. ప్రధాని మాటల మనిషి మాత్రమేనని అఖిలేశ్ మండిపడ్డారు. ‘ఆయన ఇప్పటికైనా మన్ కీ బాత్‌ను ఆపేసి ముఖ్య విషయాలపై దృష్టి పెట్టాలి’ అని అన్నారు. యూపీలో రంజాన్ , దీపావళి పండగలకు విద్యుత్ సరఫరాలో వివక్ష చూపారన్న మోదీ వ్యాఖ్యలపైనా అఖిలేశ్ ధ్వజమెత్తారు.