uniqueness
-
సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!
75 ఏళ్ల చరిత్ర ఉన్న పొందూరు ఖాదీని మహాత్మాగాంధీని వెలుగులోకి తీసుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నగరానికి సుమారు 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న పొందూరు అనే గ్రామంలో ఈ మృదువైన ఖాదీని నేస్తారు. ఆ గ్రామం పేరు మీదుగానే ఈ ఖాదీకి పేరు వచ్చింది. ఇప్పటికీ ఆ గ్రామం పత్తి వడకడానికి గాంధీ చరఖా స్పిన్నర్లనే ఉపయోగించడం విశేషం. అందువల్లే ఈ నేత చీరలు ఎక్కడలేని ప్రత్యేకతనూ చాటుకుంటున్నాయి. స్వాతంత్య్రోద్యమ సమయంలో వెలుగొందిన ఈ నూరుకౌంట్ చీర మళ్లీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ట్రెండ్ అవుతోంది. పొందూరు చీరలనే ఎలా నేస్తారు? వాటి విశేషాలు సవివరంగా తెలుసుకుందామా..!మండుటెండలో ఈ చీర చల్లగా హాయిగా ఉంటుంది. ఎముకలు కొరికే చలిలో వెచ్చదనాన్ని ఇచ్చే పొందికైన చీరలివి. స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికని స్వయంగా తన కొడుకు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపించారట. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యతను చూసి దేవదాస్ ఎంతో ముచ్చటపడ్డారట. ఆయన చెప్పిన వివరాలతో మహాత్మ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో అద్భుతమైన వ్యాసం రాశారు. దీంతో ఒక్కసారిగా నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు చేనేత వైభవం. ఆచార్య వినోభాబావే 1955లో శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే... నేడు ఆంధ్రా ఫైన్‌ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది. దీని పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తుంటే వీరిలో 200మంది నేత కార్మికులు, 1500 మంది నూలు వడికేవారు ఉన్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఈ గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా సున్నితమైన చేతులతో పత్తిని శుద్ధి చేసి వడుకుతోన్న స్త్రీలే ఎక్కువగా కనిపిస్తారు. చేపముల్లుతో పత్తిని శుద్ది చేసి..?పొందూరు నేత కోసం మొదట చేసే పని... చేప ముల్లుతో పత్తిని శుద్ధి చేయడం. అందుకోసం వారు వాలుగ చేప దవడని ఉపయోగిస్తారు. ఇదే వారి ప్రధాన పరికరం. రాజమహేంద్రవరం పరిసరాల్లో మాత్రమే దొరికే ఈ చేపముల్లుని జాలర్లు వారికి ప్రేమగా ఇస్తారు. ఈ ముల్లును స్థానికంగా, ఒక్కోటి ఇరవై రూపాయలకు కొంటారు. దీంతో దూదిని ఏకడం వల్ల పత్తిలోని మలినాలు పోయి, వస్త్రం దృఢంగా ఉంటుందనేది చేనేత కార్మికుల నమ్మకంఅక్కినేని, సినారే బ్రాండ్ అంబాసిడర్లుగా..తెల్లని దుస్తులు ధరించాలనుకునే చాలామంది నిరాశ పడే విషయం... ఒక్క ఉతుకు తరవాత అవి మెరుపు పోవడం, నల్లగా మారడం. కానీ ఈ పొందూరు చీరలు, పంచెలు ఉతికేకొద్దీ ఇంకా ఇంకా వన్నెలీనుతాయి. వేసవిలో చల్లగా, తెల్లగా ఉండే ఈ పంచెల్ని అక్కినేని, సినారే వంటివారు ఎంతగానో ప్రేమించారు. బ్రాండ్ అంబాసిడర్లుగానూ మారారు. ఇప్పటికీ ‘అక్కినేని అంచు పంచెలు’ ఇక్కడ బాగా అమ్ముడవుతాయి. ‘నూరు కౌంట్ మా ప్రత్యేకం. వాలుగ చేప దవడతో దూదిని ఏకిన తరవాత... మగ్గానికి చేరే ముందు వివిధ దశల్లో శుద్ధిచేస్తాం. నూరు కౌంట్ అనడానికి రీజన్..ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తియ్యటం, మెత్తబరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం ఇలా ఎనిమిది దశలు ఉంటాయి. మేమే పత్తి కొనుక్కుని ప్రత్యేక పనిముట్లను ఉపయోగించి పైన చెప్పిన పద్ధతుల్లో సన్నని, స్వచ్ఛమైన నూలుపోగులు తయారు చేస్తాం. అందుకే దీన్ని నూరు కౌంట్ అంటారు. ఆ స్వచ్ఛమైన నూలుపోగులతోనే చీరలు రూపొందిస్తాం. మా దగ్గర తయారయ్యే జాందానీ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పూర్తిగా చేతులతోనే నేస్తాం. ఒక్కో చీర ధర రూ.4000 నుంచి రూ.15000 వరకూ ఉంటుంది. తయారీకి 15-20 రోజులు పడుతుంది. ధరతో సంబంధం లేకుండా ఈ చీరలకు ఇప్పటికీ డిమాండ్ ఉండటం విశేషం. మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, గాంధీజీ మనవరాలు తారాగాంధీ వంటివారకి ఈ పొందూరు చీరలనే ఎంతోగానో ఇష్టంగా ధరించేవారట.మోదీకి సైతం బహుకరించేందుకు.. 75 ఏళ్ల జల్లేపల్లి కాంతమ్మ... ఆరేళ్ల ప్రాయం నుంచీ ఈ నేత పనిలోనే ఉన్నారు. నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం ఉన్న అతి కొద్దిమందిలో కాంతమ్మ ఒకరు. గాంధీజీ సిద్ధాంతాల్ని ఇప్పటికీ ఆచరిస్తోన్న కాంతమ్మని కలవడానికి దేశం నలుమూలల నుంచి చేనేత ప్రేమికులు వస్తూనే ఉంటారు. 2013లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఎర్రకోట నుంచి ఆహ్వానం అందుకున్నారు కాంతమ్మ. అప్పుడే ప్రధాని మోదీకి ఖాదీ గొప్పతనం వివరించి, తన చేతులతో వడికిన నూలును బహుకరించారు. ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు గుంటూరు, వావిలాల, మెట్టుపల్లి, తుని తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, మచిలిపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఈ పొందూరు నేతన్నలకు ప్రస్తుత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ 48 వేలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అయితే తర్వాత తరాలు ఈ విద్యపై ఆసక్తి చూపించడం లేదని నేత కార్మికులు బాధపడుతున్నారు. (చదవండి: ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!) -
Tirumala: ఆనంద నిలయ విమాన విశిష్టత
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువుండే నెలవు ఆనంద నిలయం. తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలసి ఉన్న ప్రదేశమే ఆనంద నిలయం. గర్భాలయమైన ఆనంద నిలయంపై నిర్మించిన బంగారు శిఖరమే ఆనంద నిలయ విమానంగా పేరుపొందింది. ఈ విమాన నిర్మాణానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీవారి బంగారు గోపురం మూడంతస్తులుగా ఉంటుంది. మొదటి రెండు అంతస్తులు దీర్ఘచతురస్రాకారంలోను, మూడోది వర్తులాకారంలోను ఉంటాయి. ఏకశిలపై నిర్మితమైన ఆనంద నిలయ గోపురం ఎత్తు ముప్పయ్యేడు అడుగుల ఎనిమిది అంగుళాలు. గోపురం కింద ఉండే ప్రాకారం ఎత్తు ఇరవయ్యేడు అడుగుల నాలుగు అంగుళాలు. నేలపై నుంచి బంగారు కలశం వరకు ఆనంద నిలయ విమానం ఎత్తు అరవై ఐదు అడుగుల రెండంగుళాలు. మొదటి అంతస్తు పదిన్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ భాగంలో ఎలాంటి బొమ్మలూ ఉండవు. ఇందులో లతలు, మకర తోరణాలు, చిన్న శిఖరాలు మాత్రమే ఉంటాయి. రెండో అంతస్తు ఎత్తు పదడుగుల తొమ్మిది అంగుళాలు. ఇందులో నలభై బొమ్మలు ఉంటాయి. మకర తోరణంతో పాటు వరాహస్వామి, నరసింహస్వామి, వైకుంఠనాథుడు తదితర విష్ణు రూపాలు, జయవిజయులు, గరుడ, విష్వక్సేన, అనంత, ఆంజనేయ, మహర్షుల రూపాలు కూడా ఉంటాయి. ఇందులో ఉత్తరంవైపు శ్రీవేంకటేశ్వరుడు విమాన వేంకటేశ్వరుడిగా కొలువుదీరి ఉంటాడు. గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకుంటే కలిగే పుణ్యఫలం విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా లభిస్తుందని భక్తుల విశ్వాసం. (క్లిక్ చేయండి: అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!) గోపురం చివర వర్తులాకారంలో ఉండే అంతస్తు పదహారడుగుల మూడంగుళాల ఎత్తులో ఉంటుంది. ఇందులో మహాపద్మంతో పాటు ఇరవై బొమ్మలు ఉంటాయి. నాలుగు దిక్కుల్లోను, నాలుగు మూలల్లోను ఎనిమిది సింహాలు ఉంటాయి. గోపుర కలశానికి ఆనుకుని ఉండే మహాపద్మంలో చిలుకలు, లతలు, హంసలు వంటి చిత్రాలు కనువిందు చేస్తాయి. శ్రీవారి గర్భగుడి నుంచి మలయప్పస్వామి ఊరేగింపుగా వెళ్లేటప్పుడు విమాన ప్రదక్షిణ చేస్తూ బయటకు వెళతారు. అంతేకాదు, స్వామివారికి సమర్పించే ఏ పూజాద్రవ్యమైనా, తోమాలసేవలో సమర్పించే పుష్పాలనైనా, అభిషేకానికి సమర్పించే ఆకాశగంగ తీర్థాన్నైనా విమాన ప్రదక్షిణం పూర్తి చేసిన తర్వాతే గర్భాలయంలోకి తీసుకువెళతారు. (క్లిక్ చేయండి: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...) -
మంచి మాట: ఉత్తమ వ్యక్తిత్వం ఎలా రూపు దిద్దుకుంటుంది?
కొంతమంది దృష్టిలో వ్యక్తిత్వమంటే... ప్రవర్తన, దార్శనికత, ఉద్వేగ భరితం, చక్కని ఆలోచనా విధానం, సంభాషించే పద్దతి, కుటుంబంతో, ఇతరులతో మసలుకునే విధానం.. విశ్వాసాలు. మరికొంతమందికది సాహసం.. నియమబద్ధత.. ఖచ్చితత్వం.. క్రమశిక్షణ.. సృజనశీలత. ఇలా ఒక వ్యక్తిలోని అనేక గుణాల సమాహారమే వ్యక్తిత్వమంటే. ఈ లక్షణాలలో ఏ ఒక్కటైనా అభిలషణీయమైన నిష్పత్తిలోకాక హెచ్చు స్థాయి లో ఉన్నప్పుడు అది ఆ వ్యక్తిత్వం ఒక విశిష్ఠతను సంతరించు కుంటుంది. అది మంచిగా.. లేదా చెడుగా పరిణమించవచ్చు. ఇక్కడ అప్రమత్తత కావాలి. ఒక మహాభవనం నిర్మించాలంటే దానికి పటిష్టమైన పునాది అవసరం. ఇటుక మీద ఇటుక పెడుతూ సిమెంట్ పూస్తూ తాపీతో చదును చేసి.. గోడలు కట్టి.. ఆకర్షణీయమైన.. ఆహ్లాదకరమైన రంగులు వేసి ఇతర సర్వ హంగులు సమకూర్చిన తరువాత కాని తయారు కాదు ఏ మహా భవంతి అయినా. ఉన్నత వ్యక్తిత్వ సౌధానికి అంతే. తపన.. కోరిక.. పట్టుదలనే ఇటుకలకు సంకల్పం, ధృతి అనే సిమెంట్‌ను జోడించి నిర్మించాలి. ఇంత దృఢమైన, సుందరమైన భవన స్థాపన అనేక సంవత్సరాల కృషి.. తపన. కోరిక ..పట్టుదల వల్ల మాత్రమే సాకారమవుతుంది. దీనిని ఒకసారి నిర్మించి వదిలేస్తే సరిపోదు. నిరంతర పరిశీలన కావాలి. దీనిలోని లోపాలను గమనించి అవసరమైతే పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే ఒక గొప్ప వ్యక్తిత్వ సౌధం ఏర్పడి మరింతగా శక్తిమంతమైనదిగా రూపొందుతుంది. అలా తమ జీవితకాలమంతా ఎవరైతే తపిస్తారో ఆ వ్యక్తిత్వం ఒక పారిజాత పుష్పమవుతుంది. ఎన్నటికీ ఇగిరిపోని గంధ మవుతుంది. దాని ప్రభావం ఆ తరం వారి మీదే కాక, అనేక తరాలవారి మీద ఉంటుంది. శాశ్వత ముద్ర వేస్తుంది. వారే చిరంజీవులవుతారు. ఏకాగ్రత సాధనకు ఏకలవ్యుడు.. జ్ఞానాన్వేషణలో గురువునే ప్రశ్నించిన నరేంద్రుడు.. ఆకలితో మలమల మాడుతూ శలభాల్లా పడిపోతున్న గోదావరి వాసులకు పాశ్చాత్యుడైనా అపర భగీరధుడై గోదావరీ జలాలను పారించి వారికి అన్నపూర్ణనే ఇచ్చిన సర్ అర్థర్ కాటన్ మానవత్వం, ఆకలితో అలమటించే వారికి డొక్కా సీతమ్మ నిరతాన్నదానం .. ఇలా ఎందరివో ఉత్తమ వ్యక్తిత్వాలు. ఈ వ్యక్తిత్వ రూపకల్పన ఎలా జరుగుతుంది, దీనికి ప్రేరణ ఎలా వస్తుంది, దీని దిశ –దశ లు ఏమిటి.. అన్న జిజ్ఞాస మనలో కలగాలి. అన్వేషణ చేయాలి. దీనికి మంచి పుస్తకాలు చదవాలి. సారాన్ని గ్రహించాలి. దానిని మదిలో నిలుపుకోవాలి. మన జీవితానికి ఎంత వరకు.. ఎలా అన్వయించుకోవాలో తెలియగల వివేచన కావాలి. ఒక సాధారణ కరమ్ చంద్ గాంధీ అనే గుజరాతీయుడు జాన్ రస్కిన్.. టాల్‌స్టాయ్.. హెన్రీ డేవిడ్ థోరో ల రచనల ఆలంబనగా తన జీవితాన్ని.. దాని పథాన్ని మార్చుకుని ఎంతటి ఉన్నత దశకు చేరుకున్నాడో మన కందరకు తెలుసు. ఆయన మీద భగవద్గీత ఎంత ప్రభావాన్ని చూపిందో... బైబిల్ కూడ అంతే. వాటిని చక్కని వ్యక్తిత్వ సాధనకు గొప్పగా ఉపయోగించుకున్నాడు. అంతేకాదు. ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపిన.. చూపగలిగే వ్యక్తులలో నాటి నుండి నేటి వరకు ఉన్నారు. పుస్తక పఠనం చక్కని వ్యక్తిత్వానికి ఎలా దారితీస్తుందో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలదు. ఈ రకమైన ప్రభావం పరోక్షంగా ఉంటుంది. దీనికన్నా సులువైన, గొప్పదైన మార్గమూ ఉంది. అదే పరిశీలన. అది చాలా అద్భుతమైనది. మన చుట్టూ వుండే మనుష్యులు.. వారి ప్రవర్తన ను పరిశీలించటం వల్ల కూడ చక్కని వ్యక్తిత్వం ఒనగూరుతుంది. వ్యక్తులే కాదు, గ్రహించగలిగే శక్తే ఉండాలే కాని, ఈ అనంతమైన సృష్టిలో మనకు స్ఫూర్తినివ్వనిది.. ఇవ్వలేనిదేముంది..? తుఫానులో విపరీతమైన గాలి వానకు, కూకటి వేళ్ళతో కూలిపోయే మహావృక్షాలు ఉంటాయి. ఆ పక్కనే భూమి మీద ఒరిగి పోయి.. గాలివాన తరువాత మళ్ళీ నిటారుగా నిలబడి తమ ఉనికి చాటుకునే గడ్డిపరకలూ ఉంటాయి. అక్కడివరకూ మన పరిశీలనా దృష్టిని సారించగలగాలి. కష్టాలు, బాధల తుఫానులతో అతలాకుతలమయ్యే వేళ గడ్డిసరకని ఆదర్శంగా తీసుకుంటే ధైర్య స్థైర్యాలు అలవడతాయి. ఇవి గొప్ప వ్యక్తిత్వపు లక్షణాలే కదూ! మనం పుట్టిన ప్రదేశం.. దాని శీతోష్ణ స్థితులు.. కుటుంబ నేపథ్యం.. ఆర్థిక స్థితి.. ఇవన్నీ మన ఆలోచన రీతిని ప్రభావితం చేసేవే. ఆ ప్రభావిత ఆలోచనలు మన మాట తీరును.. ప్రవర్తనను నిర్దేశిస్తాయి. వీటి సారమే కదా మన వ్యక్తిత్వం. ఇదే మన జీవనశైలి అనే రథానికి సారథి. కొందరి మనసు వజ్ర దృఢ సమానమైన కఠినం. ఇంకొందరిది వెన్నంత మృదుత్వం. మరికొందరిది ఈ రెండిటి కలవోత. ఈ రెండిటికి చెందక పాదరసంతో పోల్చతగ్గ వ్యక్తిత్వం కలవాళ్ళుంటారు. ఒక స్థిరమైన ఆలోచన.. వైఖరి.. లేక వారి ప్రవర్తన.. మాట.. అనూహ్యంగా క్షణ క్షణానికి మారిపోతుంటాయి. అభిప్రాయాలూ అంతే. ‘ఎప్పటి కెయ్యది ప్రస్తుతమప్పటి కా మాటలాడి.. ‘ అన్న సుమతీకారుడి మాటలకు ప్రత్యక్షరూపమే కొందరి వ్యక్తిత్వం. మాటలు తూచి తూచి మాట్లాడతారు. ఎవరి మనస్సు నొప్పించరు. మృదుస్వభావులు. వివాద రహితులు. జనప్రియులు. తన వారన్నవారందరిని కోల్పోయి, అనాథలై, అభాగ్యులై జీవన సమరంలో అతి చిన్నవయసులో ప్రవేశించే వారి ఆలోచన, వారి సమాజపు ఆకళింపు పూలపాన్పు జీవిత నేపథ్యం ఉన్నవారి కన్నా భిన్నంగా ఉంటుంది. పలుకు పదునుగా, కరకుగా ఉంటుంది. జీవన పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యులకు ఈ మనస్తత్వమున్నవారు చేరువవుతారు. దానిని అక్కున చేర్చుకుంటారు. వ్యక్తిత్వాలలో ఎన్నిరకాలుంటాయి అని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పలేనన్ని.. గణించలేనన్ని– అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతివ్యకి ఒకరకమైన వ్యక్తిత్వానికి నమూనా. ప్రతివ్యక్తిలోనూ వుండే విభిన్నత..ౖ వెవిధ్యమే ఇందుకు హేతువు. మంచి వ్యక్తిత్వ వర్గీకరణకు.. నిర్వచనానికి మనం కొన్ని ప్రమాణాలు పెట్టుకుంటాం. ఏ వ్యక్తి పేరు తలచుకోగానే మన మనసుకు ఒక రకమైన హాయి.. ఆనందం కలిగి మన ముఖంపై చిరునవ్వు చిందుతుందో, ఎవరి ప్రవర్తన మన మనస్సును నొప్పించదో అతడు మంచివాడని.. అతనిది మంచి వ్యక్తిత్వమని భావిస్తాం. వారి గురించి ఆలోచన మన మదిలో మెదలగానే మనసంతా పరిమళ భరితమవుతుంది. ఇది ఒక అవగాహన. ఏ వ్యక్తుల పేర్లు తలచుకోగానే మనకు భక్తి, ప్రపత్తులు కలుగుతాయో... దేశభక్తి మనలో ఉప్పొంగుతుందో.. త్యాగనిరతి జ్ఞప్తికి వస్తుందో.. వారి ఉన్నతమైన మానవీయ లక్షణాలు తడతాయో.. నిర్భయత్వం.. ప్రేమ, కరుణ మనకు స్ఫురిస్తుందో .. ఆ వ్యక్తులందరూ గొప్పవారే... వారి వ్యక్తిత్వాలన్నీ గొప్పవే .. స్ఫూర్తిదాయకమైనవే. మనం ఏ వ్యక్తిత్వానికి చేరువవుతామన్నది మన స్వభావాన్ని బట్టి ఉంటుంది. మన జీవిత నేపథ్యం కూడ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఉత్తమ వ్యక్తిత్వం దేశాన్ని ఉత్తమమైనదిగా చేస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తిత్వాన్ని పిల్లల్లో రూపు దిద్దటానికి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ప్రయత్నించాలి. కొందరు మనస్సులో ఏదైనా ఆలోచన తట్టిన క్షణమే పని చేసేస్తారు. లేడికి లేచిందే పరుగులా వాళ్ళనుకున్నది చేయటమే వారి తత్వం. ముందు వెనుకలు చూడరు. లోతుగా తరచి చూడరు. సాధ్యాసాధ్యాల గురించి యోచన చేయరు. పర్యవసానాలు దర్శించగలిగే శక్తే ఉండదు. ఈ వ్యక్తిత్వం కలిగినవారు వారు ముప్పును తెచ్చుకోవటమే కాదు. ఇతరులకూ తెస్తారు. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
చుట్టేసే ట్యాబ్లెట్ ఇది...
ఫొటో చూస్తే విషయం అర్థమైపోతుంది. కెనెడాలోని క్వీన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ట్యాబ్లెట్ ఇది. స్క్రీన్‌ను ఉండలా చుట్టేయగలగడం దీని ప్రత్యేకత. డాక్టర్ రోల్ వెర్టిగాల్ నేతృత్వంలోని బృందం ఈ నమూనా యంత్రాన్ని తయారు చేసింది. వివరాలు చూస్తే.. ఏడున్నర అంగుళాల వెడల్పు ఉండే ఈ ట్యాబ్లెట్ స్క్రీన్‌పై చిత్రాలు 2కే రెజల్యూషన్‌లో కనిపిస్తాయి. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో తయారుచేసిన గొట్టం లాంటి ఆకారంపై ఈ తెరను చుట్టేయవచ్చు. గొట్టానికి రెండు చివరల చక్రాల్లాంటివి ఉంటాయి. వాటిని అటు ఇటు తిప్పితే స్క్రీన్‌పై ఉండే ఫొటోలు, వీడియోలు, సమాచారం కనిపిస్తుందన్నమాట. ఈ చక్రాలకు ఒకవైపు ఉండే కెమెరాలను వాడుకుంటే సంజ్ఞల ద్వారా కూడా ట్యాబ్లెట్‌ను పనిచేయించవచ్చు. మొబైల్‌ఫోన్, వాయిస్ రికార్డర్గానూ దీన్ని ఉపయోగించుకోవచ్చునని, అవసరం లేనప్పుడు ఎంచక్కా జేబులో పెట్టేసుకోవచ్చునని వెర్టిగాల్ తెలిపారు. ఈ వినూత్నమైన ట్యాబ్లెట్ వివరాలను ఈ వారం స్పెయిన్‌లో జరగబోయే మొబైల్ హెచ్సీఐలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. -
సేవకుడు నాయకుడు..!
‘‘ఈ ప్రపంచాన్ని మార్చగలిగేవి రెండే రెండు.. ఒకటి నాయకత్వం, రెండు సృజనాత్మకత...’’తిమోతీ వాంగ్ అనే ఆ యువకుడి అభిప్రాయం ఇది. మరి ఈ అభిప్రాయాన్ని ప్రపంచానికి దిశానిర్దేశం చేసేందుకు చెప్పలేదతను. తను నమ్మి, పాటించి ఒక స్థాయికి ఎదిగి.. తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొన్నాక చెబుతున్నాడు. దీంతో ఈ మాటలకు విలువ పెరుగుతోంది. వాంగ్ 22 ఏళ్ల యువకుడే... అయితే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో దేశ సమకాలీన రాజకీయాల గురించి చర్చించేంత స్థాయి అతడిది. అంత చిన్న వయసులో అంత స్థాయికి ఎలా ఎదిగాడు? అనే సందేహం వస్తుందెవరికైనా! మరి నాయకత్వం, సృజనాత్మకతలు ఈ ప్రపంచాన్నే మార్చేస్తాయని అంటున్నాడు ఈ యువకుడు. ఆ రెండూ పుష్కలంగా ఉన్న ఇతడి జీవితాన్ని అవి ఆ స్థాయికి తీసుకెళ్లడం పెద్ద విచిత్రం ఏమీ కాదు కదా! యువత రాజకీయం... అనేది మాట్లాడటానికి చాలా పెద్ద అంశం. ఒకవైపు రాజకీయ నేతలేమో యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తారు. అయితే సగటు యువత ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలవైపు అడుగువేయడం అనేది చాలా పెద్ద సాహసమే అవుతుంది. ఇండియాలోనే కాదు.. అమెరికాలోనైనా అది అంతే. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది సాహసవంతులు కనిపిస్తూ ఉంటారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమిస్తూ ఉంటారు. అంటే రాజకీయ పార్టీలతో కలిసి కాదు, అసలు వీళ్లకు రాజకీయమే తెలియదు. వీళ్లు నాయకులు అంతే.. తమ సమస్యల విషయంలో, తమపై ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానాల విషయంలో తమ గళాన్ని వినిపిస్తున్నప్పుడు వీళ్లలోని నాయకత్వ లక్షణాలు ఆవిష్కృతం అవుతాయి. అలా విద్యార్థి దశ నుంచి నేతగా వచ్చి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడితో రాజకీయ విధానాల గురించి చర్చించేంత స్థాయికి చేరుకొన్న యువనేత తిమోతీ వాంగ్. అంతే కాదు ఒకవైపు యువత హక్కుల గురించి పోరాడుతూనే, పెద్ద ఎంటర్‌ప్రెన్యూరర్‌గా కూడా రాణించడం ఇతడి ప్రత్యేకత. నేషనల్ యూత్ అసోసియేషన్(ఎన్‌వైఏ) అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు వాంగ్. యువజన పక్షపాతిగా వాషింగ్టన్ డీసీ స్థాయిలో వాళ్ల హక్కుల కోసం పోరాడే సంస్థగా దీనికి పేరుంది. 22 వేల మంది సభ్యులతో, ప్రతి ఏటా దాదాపు ఏడులక్షలా యాభైవేల మంది విద్యార్థులకు అండగా నిలుస్తోంది ఎన్వైసీ. ప్రభుత్వం విద్యకు కేటాయించే బడ్జెట్ విషయం దగ్గర నుంచి విద్యార్థుల హక్కుల పరిరక్షణ వరకూ అనేక అంశాల విషయంలో ఈ యూత్ ఆర్గనైజేషన్ పోరాడుతూ ఉంటుంది. రాజకీయ నేతలేమో... యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉంది, వారే దేశ భవిష్యత్తును ప్రభావితం చేయగలరు, తీర్చిదిద్దగలరని చెబుతూ ఉంటారు. మరి అలాంటి భవిష్యత్తును పరిరక్షించుకొందాం రండి, ప్రశ్నిద్దాం రండి అంటూ ఎన్వైసీ పిలుపునిస్తుంది. దీని నాయకుడిగా వాంగ్ అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్లలోని లెజిస్లేటర్లతో కలసి పని చేస్తున్నాడు వాంగ్. 2010లో తన 17 వయేట వాంగ్ ఈ సంస్థను స్థాపించాడు. అంతకు ముందునుంచే ఈ యువకుడు అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాలు పంచుకొన్నాడు. ఒబామా ప్రభుత్వం విద్యాశాఖకు కేటాయించాల్సిన డబ్బులో దాదాపు 140 మిలియన్ డాలర్లను కోత పెట్టడంపై ఎన్వైసీ అధ్యక్షుడిగా వాంగ్ తీవ్రమైన నిరసన తెలిపాడు. వ్యక్తిగతంగా డెమొక్రాటిక్ పార్టీ మద్దతు దారుడే అయినా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాడు. విద్యకు కేటాయింపులను తగ్గించడాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాడు. చివరకు ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. కోతలు ఎత్తివేసి విద్యకు ఇవ్వాల్సిన నిధులను యథావిధిగా అందజేసింది. ఇది వాంగ్ విద్యార్థి ఉద్యమాల్లో ప్రముఖమైన విజయంగా చెప్పవచ్చు. రాజకీయ ప్రస్థానం : వాంగ్‌ది దక్షిణ కొరియా నుంచి వలస వచ్చిన కుటుంబం. కానీ ఇత డు జన్మతః అమెరికన్. . ఇతడికి విద్యార్థుల్లో ఉన్న గుర్తింపును చూసి అమెరికన్లు ‘అమెరికన్లపై ప్రభావం చూపగలుతున్న దక్షిణాసియా నాయకుడు’గా పిలుస్తున్నారు. ఓటరుగా అర్హత సాధించాక వాంగ్ అధికార డెమొక్రాటిక్ పార్టీ సభ్యుడిగా మేరీలాండ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. వ్యాపారవేత్త సలహాదారు: ఇతడు యువజన నాయకుడిగా సక్సెస్ అయ్యాడంటే.. అందుకు వ్యాపార రంగంలో సాధించిన విజయాలు కూడా ఒక కారణం కావచ్చు! ఇంటర్నెట్ ఎంటర్ ప్రెన్యూనరర్ గా వాంగ్‌కు మంచి పేరుంది. తన పదిహేనవ యేటే వ్యాపార రంగంలోకిప్రవేశించాడు అప్పట్లో ఆపరేషన్ఫ్లై.ఐఎన్‌సీ స్థాపించాడు. ఆవిధంగా వ్యాపార రంగంలో సాధించిన ప్రగతికి గానూ గ్రేటర్ వాషింగ్టన్ పరిధిలో ప్రముఖ వ్యాపారవేత్తగానూ గుర్తింపు సంపాదించుకొని అనేక యువ పారిశ్రామికవేత్తగా అవార్డులు కూడా అందుకొన్నాడు. ‘ఫార్చ్యూన్’ 500 జాబితాలోని అనేక కంపెనీల సీఈవోలకు వాంగ్ ఒక సలహాదారుగా ఉన్నాడు. అమెరికన్ ప్రభుత్వం కూడా వివిధ అంశాల్లో వాంగ్ అభిప్రాయాన్ని తీసుకొంటూ ఉంటుంది. వాంగ్ ప్రస్తుత యువత ఎదుర్కొంటున్న పరిస్థితులు, పరిణామాలపై కొన్ని పుస్తకాలను కూడా రచించాడు.