సేవకుడు నాయకుడు..! | Servant leader ..! | Sakshi
Sakshi News home page

సేవకుడు నాయకుడు..!

Published Wed, Jun 4 2014 11:24 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

సేవకుడు నాయకుడు..! - Sakshi

సేవకుడు నాయకుడు..!

‘‘ఈ ప్రపంచాన్ని మార్చగలిగేవి రెండే రెండు.. ఒకటి నాయకత్వం, రెండు సృజనాత్మకత...’’తిమోతీ వాంగ్ అనే ఆ యువకుడి అభిప్రాయం ఇది. మరి ఈ అభిప్రాయాన్ని ప్రపంచానికి దిశానిర్దేశం చేసేందుకు చెప్పలేదతను. తను నమ్మి, పాటించి ఒక స్థాయికి ఎదిగి.. తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొన్నాక చెబుతున్నాడు. దీంతో ఈ మాటలకు విలువ పెరుగుతోంది. వాంగ్ 22 ఏళ్ల యువకుడే... అయితే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో దేశ సమకాలీన రాజకీయాల గురించి చర్చించేంత స్థాయి అతడిది. అంత చిన్న వయసులో అంత స్థాయికి ఎలా ఎదిగాడు? అనే సందేహం వస్తుందెవరికైనా! మరి నాయకత్వం, సృజనాత్మకతలు ఈ ప్రపంచాన్నే మార్చేస్తాయని అంటున్నాడు ఈ యువకుడు. ఆ రెండూ పుష్కలంగా ఉన్న ఇతడి జీవితాన్ని అవి ఆ స్థాయికి తీసుకెళ్లడం పెద్ద విచిత్రం ఏమీ కాదు కదా!
 
యువత రాజకీయం... అనేది మాట్లాడటానికి చాలా పెద్ద అంశం. ఒకవైపు రాజకీయ నేతలేమో యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తారు. అయితే సగటు యువత ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలవైపు అడుగువేయడం అనేది చాలా పెద్ద సాహసమే అవుతుంది. ఇండియాలోనే కాదు.. అమెరికాలోనైనా అది అంతే. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది సాహసవంతులు కనిపిస్తూ ఉంటారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమిస్తూ ఉంటారు.

అంటే రాజకీయ పార్టీలతో కలిసి కాదు, అసలు వీళ్లకు రాజకీయమే తెలియదు. వీళ్లు నాయకులు అంతే.. తమ సమస్యల విషయంలో, తమపై ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానాల విషయంలో తమ గళాన్ని వినిపిస్తున్నప్పుడు వీళ్లలోని నాయకత్వ లక్షణాలు ఆవిష్కృతం అవుతాయి. అలా విద్యార్థి దశ నుంచి నేతగా వచ్చి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడితో రాజకీయ విధానాల గురించి చర్చించేంత స్థాయికి చేరుకొన్న యువనేత తిమోతీ వాంగ్.

అంతే కాదు ఒకవైపు యువత హక్కుల గురించి పోరాడుతూనే, పెద్ద ఎంటర్‌ప్రెన్యూరర్‌గా కూడా రాణించడం ఇతడి ప్రత్యేకత. నేషనల్ యూత్ అసోసియేషన్(ఎన్‌వైఏ) అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు వాంగ్. యువజన పక్షపాతిగా వాషింగ్టన్ డీసీ స్థాయిలో వాళ్ల హక్కుల కోసం పోరాడే సంస్థగా దీనికి పేరుంది.
 
22 వేల మంది సభ్యులతో, ప్రతి ఏటా దాదాపు ఏడులక్షలా యాభైవేల మంది విద్యార్థులకు అండగా నిలుస్తోంది ఎన్‌వైసీ. ప్రభుత్వం విద్యకు కేటాయించే బడ్జెట్ విషయం దగ్గర నుంచి విద్యార్థుల హక్కుల పరిరక్షణ వరకూ అనేక అంశాల విషయంలో ఈ యూత్ ఆర్గనైజేషన్ పోరాడుతూ ఉంటుంది. రాజకీయ నేతలేమో... యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉంది, వారే దేశ భవిష్యత్తును ప్రభావితం చేయగలరు, తీర్చిదిద్దగలరని చెబుతూ ఉంటారు. మరి అలాంటి భవిష్యత్తును పరిరక్షించుకొందాం రండి, ప్రశ్నిద్దాం రండి అంటూ ఎన్‌వైసీ పిలుపునిస్తుంది.
 
దీని నాయకుడిగా వాంగ్ అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్‌లలోని లెజిస్లేటర్‌లతో కలసి పని చేస్తున్నాడు వాంగ్. 2010లో తన 17 వయేట వాంగ్ ఈ సంస్థను స్థాపించాడు. అంతకు ముందునుంచే ఈ యువకుడు అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాలు పంచుకొన్నాడు.

ఒబామా ప్రభుత్వం విద్యాశాఖకు కేటాయించాల్సిన డబ్బులో దాదాపు 140 మిలియన్ డాలర్లను కోత పెట్టడంపై ఎన్‌వైసీ అధ్యక్షుడిగా వాంగ్ తీవ్రమైన నిరసన తెలిపాడు. వ్యక్తిగతంగా డెమొక్రాటిక్ పార్టీ మద్దతు దారుడే అయినా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాడు. విద్యకు కేటాయింపులను తగ్గించడాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాడు. చివరకు ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. కోతలు ఎత్తివేసి విద్యకు ఇవ్వాల్సిన నిధులను యథావిధిగా అందజేసింది. ఇది వాంగ్ విద్యార్థి ఉద్యమాల్లో ప్రముఖమైన విజయంగా చెప్పవచ్చు.
 
రాజకీయ ప్రస్థానం : వాంగ్‌ది దక్షిణ కొరియా నుంచి వలస వచ్చిన కుటుంబం. కానీ ఇత డు జన్మతః అమెరికన్. . ఇతడికి విద్యార్థుల్లో ఉన్న గుర్తింపును చూసి అమెరికన్లు ‘అమెరికన్లపై ప్రభావం చూపగలుతున్న దక్షిణాసియా నాయకుడు’గా పిలుస్తున్నారు. ఓటరుగా అర్హత సాధించాక వాంగ్ అధికార డెమొక్రాటిక్ పార్టీ సభ్యుడిగా మేరీలాండ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
 
వ్యాపారవేత్త సలహాదారు: ఇతడు యువజన నాయకుడిగా సక్సెస్ అయ్యాడంటే.. అందుకు వ్యాపార రంగంలో సాధించిన విజయాలు కూడా ఒక కారణం కావచ్చు! ఇంటర్నెట్ ఎంటర్ ప్రెన్యూనరర్ గా వాంగ్‌కు మంచి పేరుంది. తన పదిహేనవ యేటే వ్యాపార రంగంలోకిప్రవేశించాడు అప్పట్లో ఆపరేషన్‌ఫ్లై.ఐఎన్‌సీ స్థాపించాడు.  ఆవిధంగా వ్యాపార రంగంలో సాధించిన ప్రగతికి గానూ గ్రేటర్ వాషింగ్టన్ పరిధిలో ప్రముఖ వ్యాపారవేత్తగానూ గుర్తింపు సంపాదించుకొని అనేక యువ పారిశ్రామికవేత్తగా అవార్డులు కూడా అందుకొన్నాడు.
 
‘ఫార్చ్యూన్’  500 జాబితాలోని అనేక కంపెనీల సీఈవోలకు వాంగ్ ఒక సలహాదారుగా ఉన్నాడు. అమెరికన్ ప్రభుత్వం కూడా వివిధ అంశాల్లో వాంగ్ అభిప్రాయాన్ని తీసుకొంటూ ఉంటుంది. వాంగ్ ప్రస్తుత యువత ఎదుర్కొంటున్న పరిస్థితులు, పరిణామాలపై కొన్ని పుస్తకాలను కూడా రచించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement