ఈ ముగ్గురూ పెళ్లికాని ముఖ్యమంత్రులు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కొన్ని పార్టీలకు సంతోషం, మరికొన్ని పార్టీలకు బాధను మిగిల్చాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డులు సృష్టించినవారు, చరిత్ర తిరగరాసినవారు ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో మరో విశేషం కూడా ఉంది. కొత్తగా ప్రమాణం చేయనున్న ఐదుగురు ముఖ్యమంత్రుల్లో ముగ్గురు అవివాహితులే..!
తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు జయలలిత, మమతా బెనర్జీలు అవివాహితులన్న విషయం తెలిసిందే. అసోంకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కూడా పెళ్లి చేసుకోలేదు. విద్యార్థి దశ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన 52 ఏళ్ల సోనోవాల్ బ్రహ్మచారిగా ఉంటూ తన జీవితాన్ని పూర్తిగా ప్రజలకు అంకింతం చేశారు. అసోం ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అసోంలో బీజేపీ తొలిసారి మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వైదొలగబోతున్న ఎన్సీఆర్ కాంగ్రెస్ చీఫ్ రంగసామి (66) కూడా అవివాహితుడే. పుదుచ్చేరిలో అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కేరళకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి విజయన్ మాత్రం వివాహితుడే.