నిర్లక్ష్యానికి మూల్యం
అనధికార లే అవుట్లపై కొరడా
ఉదాసీన కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
లోకాయుక్త నోటీసులు... ఉడా పరిశీలనలపై కదిలిన యంత్రాంగం
తీవ్రంగా పరిగణిస్తున్న కలెక్టర్
విజయనగరం కంటోన్మెంట్: ఇబ్బడిముబ్బడిగా పంచాయతీల్లో వెలుస్తున్న అక్రమ లే అవుట్లు ఇప్పుడు కార్యదర్శులకు ముప్పు తెచ్చేలా ఉన్నాయి. వాటిపై ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం.... కనీసం ఉన్నతాధికారులకు వాటిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం... ఇంకా పంటభూములుగానే చెలామణీ అవుతున్నా పట్టించుకోకపోవడం... ఇవన్నీ వారి నిర్లక్ష్యంగానే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అక్రమ లే అవుట్లపై లోకాయుక్త జోక్యం చేసుకున్నా... సరైన సమాధానం ఇవ్వకపోవడానికి వారినే బాధ్యులను చేసేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. త్వరలో వారికి షోకాజ్ నోటీసులను జారీ చేయనుంది. జిల్లాలోని పంచాయతీల్లో వెలుస్తున్న అక్రమ లే అవుట్లపై లోకాయుక్త తరచూ ప్రశ్నిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న లే అవుట్లను ఎందుకు గుర్తించలేదు? గుర్తించినా వాటిని ఎందుకు రద్దు చేయలేదు? వాటి నుంచి ఫీజుల వసూళ్లు ఎందుకు చేపట్టలేదన్న కోణంలో కార్యదర్శులకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ అనుమతి కోసం లేఖ రాస్తున్నారు. అక్కడి నుంచి అనుమతి వచ్చిన వెంటనే జిల్లాలోని 122 గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అనధికారంవే ఎక్కువ
జిల్లా వ్యాప్తంగా 263 లే అవుట్లుంటే అనధికారికంగా మరో 276 ఉన్నాయి. జిల్లాలోని దాదాపు 26 మండలాల్లో ఇవి వ్యాపించి ఉన్నట్టు పంచాయతీ అధికారులు గుర్తించారు. వీరి వద్ద నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయడం లేదు సరికదా... వాటిని వ్యవసాయ భూములుగానే రికార్డుల్లో కొనసాగిస్తున్నారు. వాటిని నివాస ప్రాంతాలుగా, ప్లాట్లుగా మార్చేందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన లక్షలాది రూపాయలకు ఎగనామం పెడుతున్నారు. అలాగే కొన్ని అధికార లే అవుట్ల యజమానులు ప్రభుత్వానికి రిజర్వుడుగా ఇవ్వాల్సిన పదిశాతం భూమిని కూడా ఇవ్వడం లేదు. అందులోనూ ప్లాట్లు వేసి విక్రయాలు జరిపించేస్తున్నారు. ఇలా ఇటు కొనుగోలుదారుల్ని, అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వీటన్నింటిపైనా చర్యలు తీసుకోవాల్సిన పంచాయతీల కార్యదర్శులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి.
వెన్నాడుతున్న లోకాయుక్త
జిల్లాలోని అక్రమ లే అవుట్లపై తగు వివరణ ఇవ్వాలని లోకాయుక్త రిజిస్ట్రార్ డీపీఓ కార్యాలయానికి నోటీసులు పంపించారు. గరివిడి మండలం కోడూరుకు చెందిన మీసాల రాజినాయుడు అనే వ్యక్తి లోకాయుక్తలో లే అవుట్ల అక్రమాలపై కేసు వేశారు. దీనిపై గతంలో పూర్తి స్థాయి సమాచారం ఇవ్వకుండా ఎన్ని లే అవుట్లున్నాయి? ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలు అసమగ్రంగా ఇవ్వడంతో వీటిపై తీసుకున్న చర్యలేంటో తెలపాలని లోకాయుక్త కోరినట్లు తెలిసింది. దీంతో ఏదో ఒక చర్య తీసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఇప్పుడీ షోకాజ్ నోటీసులకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరో పక్క ఉడా అధికారులు కూడా తాము గుర్తించిన అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని లేఖలు రాస్తున్నాయి. మరికొంత మంది సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తున్నారు. ఎందుకీ తలనొప్పనే ఆలోచనతో అధికారులు అప్రమత్తమయినట్టు తెలుస్తోంది. దీనికంతటికీ కార కులయిన పంచాయతీ కార్యదర్శులనే బాధ్యులను చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సంసిద్ధమవుతున్నారు. త్వరలోనే వీరికి షోకాజ్ నోటీసులు అందే అవకాశం ఉంది.
జిల్లా కలెక్టర్కు తప్పుడు సమాచారం ?
జిల్లాలోని అక్రమ లే అవుట్లపై ఇటీవల జిల్లా కలెక్టర్ ఓ కార్యదర్శిని ప్రశ్నిస్తే ఇక్కడ అక్రమమైనవి ఏమీ లేవని చెప్పడంతో కలెక్టర్ సీరియస్ అయినట్టు సమాచారం. పట్టణ పరిసరాల్లోని ఓ గ్రామంలో లే అవుట్లు అక్రమంగా వెలిసినట్టు స్పష్టమైన సమాచారం తనవద్ద ఉన్నప్పటికీ అస్పష్టంగా కార్యదర్శి సమాధానం ఇవ్వడంపై వారి పాత్రను కలెక్టర్ సైతం శంకిస్తున్నారని తెలిసింది. అందుకే వారిపై గురిపెట్టి ఈ అక్రమాలకు చెక్పెట్టాలనే వ్యూహం రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.