‘ఆమె’ భద్రతే ధ్యేయంగా..
ఆమె.. మహిళా భద్రతే ధ్యేయంగా పోరాటం చేస్తోంది. 18 ఏళ్ల వయసులో ఓ పోకిరి లైంగిక దాడి నుంచి తప్పించుకొని బయటపడింది. తాను ఎదుర్కొన్న సమస్య మరే మహిళకూ ఎదురు కాకూడదని, లక్నోలో 15 మంది సభ్యులతో రెడ్ బ్రిగేడ్ పేరున ఉషా విశ్వకర్మ పోరాటం ప్రారంభించింది. 2011లో చిన్నగా ప్రారంభమైన ఆ సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా 8,500 మందితో కొనసాగుతోంది.
లైంగిక హింసను దేశవ్యాప్తంగా నిర్మూలించేందుకు రెడ్ బ్రిగేడ్ స్థాపకురాలు ఉషా విశ్వకర్మ నడుం బిగించింది. మొదట్లో మహిళల్లో అవగాహన కోసం మేం నిర్వహించే వీధి నాటకాలు, ఉద్యమాల సమయంలో ఎర్రని దుస్తులు ధరించడం చూసినవారంతా సరదాకు మమ్మల్ని రెడ్ బ్రిగేడ్ అని పిలిచేవారని, ఆ పేరునే తమ గ్రూప్‌నకు పెట్టుకున్నామని ఉష చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు సహాయం అందించడంతో ప్రారంభించిన ఉద్యమం.. నేడు పలు రకాల మహిళా సమస్యలపై పోరాటం వరకు వెళ్లింది. అపరాధుల ఇళ్లకు వెళ్లి వారికి ఫిర్యాదుచేసి, కుటుంబ సభ్యుల్లోనూ అవగాహన కల్పించి.. మార్పు తెచ్చేందుకు ప్రయత్రాలు ప్రారంభించిన రెడ్ బ్రిగేడ్.. ఒక్కోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు స్వయంగా వారి బుద్ధి చెప్పే ప్రయత్నాలు కూడా చేసేవారు. రాను రాను మహిళలకు ఆత్మరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం, పాఠశాలల్లో బాలికలకు శిక్షణ తరగతులను నిర్వహించడం ప్రారంభించింది. ఎదుటివారి బలహీనతలే లక్ష్యంగా పోరాడేందుకు ప్రత్యేక బోధనా తరగతులను నిర్వహించడం రెడ్ బ్రిగేడ్ కార్యక్రమాల్లో భాగమైంది.
6-11 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ పేరున ప్రత్యేక బోధనతో పాటు.. ఆత్మరక్షణకు ప్రత్యేక సందర్భాల్లో ఎలా స్పందించాలో నేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు, చదువు, పెళ్లి లాంటి విషయాలపైనా, మహిళా హక్కులపైనా అవగాహన తరగతులను నిర్వహిస్తున్నారు. పై చదువులు చదవాలనుకున్న వారికి సాయం అందించడంతో పాటు... వివిధ సమస్యలపై అవగాహన ర్యాలీలు, ఉద్యమాలను చేపట్టిన రెడ్ బ్రిగేడ్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ముఖ్యంగా ఈవ్ టీజింగ్, అత్యాచార బాధితుల్లో జీవితంపై అవగాహన కల్పించి, ఆసక్తిని పెంచి, తిరిగి వారి కాళ్లపై వారు నిలబడేందుకు రెడ్ బ్రిగేడ్ సహాయపడుతోంది. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ తర్వాత ప్రతినెలా 29న అత్యాచార బాధితులకు మద్దతునిస్తూ ప్రత్యేక నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది. రెడ్ బ్రిగేడ్ ప్రారంభించినప్పుడు సమాజం నుంచి, కుటుంబం నుంచి ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని, కొందరు తనను కాల్ గర్ల్ అని కూడా పిలిచేవారని, సమాజానికి భయపడి తల్లిదండ్రులు కూడా తనకు వ్యతిరేకంగానే ఉండేవారని ఉషా చెప్పింది. అయితే రెడ్ బ్రిగేడ్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్త గుర్తింపుతో రాను రాను విమర్శలు తగ్గడంతో పాటు.. వ్యతిరేకించిన వారే సహాయానికి ముందుకు వచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఓసారి బాలికను వేధిస్తున్నఓ పెద్దింటి కుర్రాడి విషయంలో అతడి కుటుంబ సభ్యులు ఉషాపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైల్లో పెట్టించారు. ఆ సమయంలో సుమారు 100 మంది మహిళలు పోలీసుస్టేషన్లో ఆమెకు మద్దతుగా నిలిచారు. ఉషాను విడిపించాలి, లేదంటే మమ్మల్ని కూడా జైల్లో పెట్టాలని డిమాండ్ చేయడం రెడ్ బ్రిగేడ్‌కు లభించిన మంచి గుర్తింపు అని ఉషా చెబుతారు. అయితే తమ సేవలను మరింత విస్తరించేందుకు ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని, మహిళల రక్షణకు మరింతమంది చేయి కలపాలని ఆమె కోరుతున్నారు.