Vamsi Chand Reddy
-
చర్చంటే జూపల్లికి భయమెందుకు: వంశీచంద్
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఆయకట్టు తగ్గింపు, జీఓలో మార్పులపై బహిరంగచర్చకు రావడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ పాలమూరుకు అన్యాయం చేసేవిధంగా జీఓలను మార్చారని ఆరోపించారు. ఆయకట్టును 62 వేల నుంచి 37 వేలకు తగ్గించారని చెప్పారు. ఈ మార్పులు తెలుసుకోలేని అజ్ఞానంలో జూపల్లి ఉండటం జిల్లా ప్రజల దురదృష్టమన్నారు. ఆయనకు మంత్రిగా కొనసాగే హక్కులేదని, వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. డిండికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుపోవద్దని సీఎంకు గతంలో లేఖ రాసిన జూపల్లి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కోట్లు దండుకోవడానికి ఆయన కల్వకుర్తి కాలువలు, టన్నెల్ సైజులు తగ్గించారని ఆరోపించారు. -
లక్షల కొద్దీ ఎక్కడి నుంచి తెస్తారు?
⇒ గొర్రె పిల్లల పంపిణీ పథకంపై సర్కారును నిలదీసిన కాంగ్రెస్ ⇒ నాలుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న గొర్రె పిల్లల సంఖ్యే 60 లక్షలు ⇒ మరి 84 లక్షల గొర్రెపిల్లలు ఇస్తామని ఎలా చెబుతున్నారు? ⇒ మేత కోసం 10% భూమి అవసరం.. రాష్ట్రంలో ఉన్నది 3 %లోపే ⇒ 19వ లైవ్‌స్టాక్ నివేదిక వివరాలను సభ ముందు పెట్టిన వంశీచంద్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండేళ్లలో 84 లక్షల గొర్రె పిల్లలను పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభు త్వం గొప్పగా చెప్పుకుంటోందని, అన్ని లక్షల గొర్రె పిల్లలను ఎక్కడి నుంచి తీసుకొస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. తెలంగాణ చుట్టూ ఉన్న నాలుగు రాష్ట్రాల్లో కలిపి కూడా అన్ని గొర్రెలు అందుబాటులో లేవని.. దూర ప్రాంతాల నుం చి తెచ్చే అవకాశమూ తక్కువని స్పష్టం చేసిం ది. 19వ జాతీయ లైవ్‌స్టాక్ (పశు సంపద) నివే దిక ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీసింది. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమ యంలో కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలోనే 84 లక్షల గొర్రె పిల్లలను సరఫరా చేస్తామని చెబుతోందని అదెలా సాధ్యమని ప్ర శ్నించారు. ప్రభుత్వం గొర్రె పిల్లలు కొనాలను కుంటున్న ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణా టకల్లో ఉన్న మొత్తం గొర్రె పిల్లల సంఖ్య 60 లక్షల లోపేనని లైవ్‌స్టాక్ నివేదిక స్పష్టం చేస్తోం దని, అలాంటప్పుడు 84 లక్షల గొర్రె పిల్లలను సమకూర్చడం ఎలా సాధ్యమని నిలదీశారు. ఇలాగైతే పథకం సాధ్యమెలా? జాతీయ వ్యవసాయ కమిషన్ సిఫార్సుల ప్రకారం గొర్రెల మేత కోసం 8 శాతం నుంచి 10 శాతం భూమి ఉండాలని వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో 2 నుంచి 3 శాతం లోపే అలాంటి భూ మి ఉందని రాష్ట్ర ప్రభుత్వ గణాంకా లే స్పష్టం చేస్తున్నా యన్నారు. మరి గొర్రెలకు మేత ఎలా సమకూరు స్తారని ప్రశ్నించా రు. తుమ్మ చెట్లపై గొర్రెల పెంపకం దారులకు హక్కు కల్పించాలన్న ప్రభుత్వ ఉత్తర్వు అమలు కావటం లేదని.. మిషన్ కాకతీయ పేరుతో చాలాచోట్ల చెరువుల వద్ద ఉన్న తుమ్మ చెట్లను నరికేస్తున్నారని వివరించారు. గొర్రె పిల్లల పంపిణీ పథకంపై ప్రభుత్వం సరైన కసరత్తు చేయలేదని విమర్శించారు. ఈ పథకం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరిగినందున గొర్రెల ధరలను భారీగా పెంచి అమ్మే అవకాశం ఉంద ని, దాన్ని ప్రభుత్వం సరిగా డీల్ చేయాలని అధికారపక్ష సభ్యులు ప్రభాకర్, అంజయ్య సూచించారు. వెటర్నరీ ఆస్పత్రులను బలోపేతం చేయాలని కోరారు. గొర్రెల పెంపక సంఘాల్లో మహిళలకు అవకాశం కల్పించాలని, దుబాయికి వెలసవెళ్లి మృత్యువాత పడ్డ వ్యక్తుల కుటుంబాల్లోని మహిళలకు అవకాశం కల్పించాలని శోభ కోరారు. మనసుంటే మార్గముంటుంది: తలసాని గొర్రె పిల్లలను 4 పొరుగు రాష్ట్రాల నుంచే కొంటామని, వాటికి కొరత లేదని మంత్రి తలసాని శ్రీని వాసయాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌వి విమర్శలేనని, మనసుంటే మార్గం ఉం టుందని ప్రభుత్వం నిరూపిస్తుందని చెప్పా రు. గొర్రె పిల్లలను కొనేప్పుడే అక్రమాలు జరగకుండా జియో ట్యాగింగ్ చేయిస్తామ ని, బీమా కూడా చేయిస్తామని తెలిపారు. -
కల్వకుర్తి డివిజన్ కోసం ధర్నా
కల్వకుర్తి డివిజన్ సాధన కోసం ఇందిరాపార్క్ వద్ద అఖిల పక్షాల నేతలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పజ ల ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ వారు విమర్శించారు.టీసీఎల్పీ నేత జానారెడ్డి, , టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ధర్నా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు -
ముదురుతున్న కాంగ్రెస్ యువ నేతల గొడవ
రాజీకి రాని వంశీచంద్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేసిన జానా, పొన్నాల వెనక్కి తగ్గేది లేదని చెబుతున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దాడి చేసింది విష్ణువర్ధన్‌రెడ్డేనని సీసీ కెమెరా ఫుటేజీల్లో వెల్లడి: పోలీసులు సాక్షి, హైదరాబాద్: ఒక వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం మరింతగా ముదురుతోంది. టీ కాంగ్రెస్ పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా... ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇద్దరూ రాజీకి వచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అన్నట్లుగా ఇద్దరూ పట్టుపడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఒక వివాహ వేడుకలో వంశీచంద్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి గొడవ పడిన విషయం తెలిసిందే. వారిద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ వివాదం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనే భావనతో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సీఎల్పీ నేత జానారెడ్డి శుక్రవారమే వంశీచంద్‌తో మాట్లాడారు. ఎంపీ వి.హనుమంతరావు శనివారం విష్ణువర్ధన్‌రెడ్డితో మాట్లాడారు. వంశీచంద్‌తో కూడా మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చూస్తానని పేర్కొన్నారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కూడా రంగంలోకి దిగి... సర్దుకుపోవాలని ఇద్దరినీ కోరారు. వారి తో మాట్లాడి రాజీ కుదిర్చే బాధ్యతను పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్‌కు అప్పజెప్పారు. ‘ఇది మా సొంతింటి వ్యవహారం. మేం పరిష్కరించుకుంటాం..’ అని పొన్నాల మీడియాతో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారేలా ఉందని, రాజీ పడాలని సీనియర్ నేతలు చేసిన సూచనను వంశీచంద్, విష్ణు ఇద్దరూ కూడా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. పోలీస్స్టేషన్లలో పెట్టిన కేసులను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకునేది లేదని, ఎవ రిది తప్పయితే వారే మూల్యం చెల్లిస్తారని తమ అనుచరుల వద్ద వారు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వంశీచంద్‌రెడ్డి దీనిని ఢిల్లీ పెద్దలు, రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇది పూర్తిగా వ్యక్తిగతమని, గొడవ జరిగింది పార్టీ వేదికపై కానందున పార్టీకి వచ్చే ఇబ్బందేమీ లేదని.. ఇక రాజీ ప్రసక్తి ఎందుకన్న అభిప్రాయాన్ని వంశీచంద్‌రెడ్డి వ్యక్తం చేయగా.. విష్ణు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. పెళ్లిలో వంశీచంద్ తనతో కరచాలనం చేసి చెవిలో అసభ్యకర పదజాలంతో మాట్లాడటంతోనే గొడవ జరిగిందని విష్ణు పేర్కొంటున్నారు. వంశీపై దాడికి పాల్పడిన విష్ణు సీసీ ఫుటేజీలో వెల్లడి: సీఐ కాంగ్రెస్ యువ నేతల మధ్య గొడవపై కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. దీనికి సంబంధించి మాదాపూర్ సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ మండపం వైపు వచ్చిన వంశీచంద్‌రెడ్డి విష్ణుతో చేయి కలిపారు. అభినందించిన విష్ణు ఉన్న ఫళంగా వంశీపై దాడికి పాల్పడ్డారు. అడ్డువచ్చిన గన్‌మన్ నజీర్పైన కూడా దాడి చేశాడు. ఆ తర్వాత కొద్ది దూరంలో నిలబడి ఉన్న వంశీపై మళ్లీ దాడి చేశాడు. అయితే సీసీ ఫుటేజీలను బట్టి ప్రభుత్వ ఉద్యోగి అయిన గన్‌మన్‌పై దాడికి పాల్పడినట్లుగా స్పష్టం కావడంతో విష్ణుపై కేసులో ఐపీసీ 332 సెక్షన్‌ను కూడా జతచేశామని సీఐ నర్సింహులు తెలిపారు. విష్ణు ఫిర్యాదు ఆధారంగా వంశీపై కేసు నమోదు చేసినప్పటికీ... వంశీ దాడి పాల్పడినట్లు ఆధారాలు లభించలేదని, అయినా దానిపై దర్యాప్తు చేపడతామని సీఐ వెల్లడించారు. -
కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి గెలుపు
మహబూబ్‌నగర్: కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి ఆచారిపై 72 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ నియోజకవర్గంలోని వెల్దండ మండలం జూపల్లిలోని 119వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో ఈ రోజు రీపోలింగ్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఆ తరువాత ఓట్లను లెక్కించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి గెలుపుతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 21కి చేరింది. -
ప్రత్యేక రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: నాలుగు రాష్ట్రాల్లో వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేవని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, ప్రత్యేక రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై టీడీపీ, బీజేపీ నాయకుల మాటలు చూస్తుంటే భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలవడం ఖాయమన్నారు. గతంలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ వద్దనందుకే తెలంగాణ ఏర్పాటు చేయలేదని బీజేపీ నేతలే చెప్పారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల ఫలితాల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకం కలిగించడానికి బీజేపీ అడ్డుకునే అవకాశం ఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ 2014లో యూపీఏను గెలిపిస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు, సమాచార హక్కు, ఆహార భద్రత, ఉపాధిహామీ చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. 2014 ఎన్నికల్లో యూపీఏ కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిత్‌కుమార్ సింగ్, యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు పడమటి శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు ఇమ్మడి పురుషోత్తం, చంద్రశేఖర్, కృష్ణంరాజు, సాయికేశవ్, నరేష్, సంతోష్, నాగార్జున్పాల్గొన్నారు.