చర్చంటే జూపల్లికి భయమెందుకు: వంశీచంద్
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఆయకట్టు తగ్గింపు, జీఓలో మార్పులపై బహిరంగచర్చకు రావడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ పాలమూరుకు అన్యాయం చేసేవిధంగా జీఓలను మార్చారని ఆరోపించారు.
ఆయకట్టును 62 వేల నుంచి 37 వేలకు తగ్గించారని చెప్పారు. ఈ మార్పులు తెలుసుకోలేని అజ్ఞానంలో జూపల్లి ఉండటం జిల్లా ప్రజల దురదృష్టమన్నారు. ఆయనకు మంత్రిగా కొనసాగే హక్కులేదని, వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. డిండికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుపోవద్దని సీఎంకు గతంలో లేఖ రాసిన జూపల్లి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కోట్లు దండుకోవడానికి ఆయన కల్వకుర్తి కాలువలు, టన్నెల్ సైజులు తగ్గించారని ఆరోపించారు.