ముదురుతున్న కాంగ్రెస్ యువ నేతల గొడవ | Stir signs of the young leaders of Congress | Sakshi
Sakshi News home page

ముదురుతున్న కాంగ్రెస్ యువ నేతల గొడవ

Published Sun, Dec 14 2014 1:47 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ముదురుతున్న కాంగ్రెస్ యువ నేతల గొడవ - Sakshi

ముదురుతున్న కాంగ్రెస్ యువ నేతల గొడవ

  • రాజీకి రాని వంశీచంద్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి
  • ప్రయత్నాలు ముమ్మరం చేసిన జానా, పొన్నాల
  • వెనక్కి తగ్గేది లేదని చెబుతున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
  • దాడి చేసింది విష్ణువర్ధన్‌రెడ్డేనని సీసీ కెమెరా ఫుటేజీల్లో వెల్లడి: పోలీసులు
  • సాక్షి, హైదరాబాద్: ఒక వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం మరింతగా ముదురుతోంది. టీ కాంగ్రెస్ పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా... ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇద్దరూ రాజీకి వచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అన్నట్లుగా ఇద్దరూ పట్టుపడుతున్నట్లు సమాచారం.
     
    హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఒక వివాహ వేడుకలో వంశీచంద్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి గొడవ పడిన విషయం తెలిసిందే. వారిద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ వివాదం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనే భావనతో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సీఎల్పీ నేత జానారెడ్డి శుక్రవారమే వంశీచంద్‌తో మాట్లాడారు. ఎంపీ వి.హనుమంతరావు శనివారం విష్ణువర్ధన్‌రెడ్డితో మాట్లాడారు.

    వంశీచంద్‌తో కూడా మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చూస్తానని పేర్కొన్నారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కూడా రంగంలోకి దిగి... సర్దుకుపోవాలని ఇద్దరినీ కోరారు. వారి తో మాట్లాడి రాజీ కుదిర్చే బాధ్యతను పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్‌కు అప్పజెప్పారు. ‘ఇది మా సొంతింటి వ్యవహారం. మేం పరిష్కరించుకుంటాం..’ అని పొన్నాల మీడియాతో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారేలా ఉందని, రాజీ పడాలని సీనియర్ నేతలు చేసిన సూచనను వంశీచంద్, విష్ణు ఇద్దరూ కూడా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు.

    పోలీస్‌స్టేషన్లలో పెట్టిన కేసులను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకునేది లేదని, ఎవ రిది తప్పయితే వారే మూల్యం చెల్లిస్తారని తమ అనుచరుల వద్ద వారు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వంశీచంద్‌రెడ్డి దీనిని ఢిల్లీ పెద్దలు, రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.

    ఇది పూర్తిగా వ్యక్తిగతమని, గొడవ జరిగింది పార్టీ వేదికపై కానందున పార్టీకి వచ్చే ఇబ్బందేమీ లేదని.. ఇక రాజీ ప్రసక్తి ఎందుకన్న అభిప్రాయాన్ని వంశీచంద్‌రెడ్డి వ్యక్తం చేయగా.. విష్ణు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. పెళ్లిలో వంశీచంద్ తనతో కరచాలనం చేసి చెవిలో అసభ్యకర పదజాలంతో మాట్లాడటంతోనే గొడవ జరిగిందని విష్ణు పేర్కొంటున్నారు.
     
     వంశీపై దాడికి పాల్పడిన విష్ణు
     సీసీ ఫుటేజీలో వెల్లడి: సీఐ
     
    కాంగ్రెస్ యువ నేతల మధ్య గొడవపై కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. దీనికి సంబంధించి మాదాపూర్ సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ మండపం వైపు వచ్చిన వంశీచంద్‌రెడ్డి విష్ణుతో చేయి కలిపారు. అభినందించిన విష్ణు ఉన్న ఫళంగా వంశీపై దాడికి పాల్పడ్డారు. అడ్డువచ్చిన గన్‌మన్ నజీర్‌పైన కూడా దాడి చేశాడు. ఆ తర్వాత కొద్ది దూరంలో నిలబడి ఉన్న వంశీపై మళ్లీ దాడి చేశాడు. అయితే సీసీ ఫుటేజీలను బట్టి ప్రభుత్వ ఉద్యోగి అయిన గన్‌మన్‌పై దాడికి పాల్పడినట్లుగా స్పష్టం కావడంతో విష్ణుపై కేసులో ఐపీసీ 332 సెక్షన్‌ను కూడా జతచేశామని సీఐ నర్సింహులు తెలిపారు. విష్ణు ఫిర్యాదు ఆధారంగా వంశీపై కేసు నమోదు చేసినప్పటికీ... వంశీ దాడి పాల్పడినట్లు ఆధారాలు లభించలేదని, అయినా దానిపై దర్యాప్తు చేపడతామని సీఐ వెల్లడించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement