Vasavi Hospital
-
‘ప్రాణం పోయినా... వైద్యం చేశారు!’
ఖైరతాబాద్(హైదరాబాద్): ప్రాణం పోయిన తర్వాత కూడా చికిత్స అందించారంటూ ఓ మృతుడి బంధువులు ఖైరతాబాద్‌లోని ఓ ఆస్పత్రి ముందు ఆదివారం ధర్నాకు దిగారు. సైఫాబాద్ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన వి.బ్రహ్మాచారి(35) ఈ నెల 6న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చేవెళ్లలోని ఓ ఆస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యసేవల కోసం నగరానికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో 7వ తేదీ ఉదయం ఖైరతాబాద్‌లోని వాసవి హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. పరీక్షించిన డాక్టర్లు కడుపులో పేగు తెగిపోయిందని చెప్పి అదే రోజు సాయంత్రం శస్త్రచికిత్స పూర్తిచేశారు. ఆ తరువాత ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రహ్మచారి పరిస్థితి విషమించి చనిపోయినట్లు వైద్యులు ఆదివారం తెల్లవారుజామున బంధువులకు తెలియజేశారు. ధర్నాకు దిగిన రోగి బంధువులు...... అయితే, బ్రహ్మాచారి చనిపోయి రెండు రోజులైనా తమకు చెప్పకుండా చికిత్స అందిస్తూ వచ్చారంటూ రోగి బంధువులు ఆదివారం మధ్యాహ్నం హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. న్యాయం చేయాలంటూ మృతుడి తమ్ముడు చంద్రశేఖర్‌తో పాటు బంధువులు డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు, హాస్పిటల్ యాజమాన్యం సర్దిచెప్పడంతో బాధితులు మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు. అయితే, రోగిని కాపాడేందుకు పూర్తిస్థాయిలో డాక్టర్లు ప్రయత్నించారని, చనిపోయిన తరువాత చికిత్స నిర్వహించామని చెప్తున్న విషయంలో వాస్తవం లేదని వాసవి హాస్పిటల్ మేనేజర్ నాగేశ్వర్రావు తెలిపారు. -
మృతుని బంధువుల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని వాసవీ ఆస్పత్రి ముందు మృతుని బంధువులు ఆదివారం ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని దేవురపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మచారి(35) అనే వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఐదు రోజుల క్రితం కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అతను చికిత్సపొందుతూ రెండు రోజుల క్రితమే చనిపోయినా.. ఆసుపత్రి సిబ్బంది ఆదివారమే మృతిచెందినట్లు చెబుతున్నారంటూ బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుని బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
11 నెలల చిన్నారికి అరుదైన సర్జరీ
సాక్షి, హైదరాబాద్ : పుట్టుకతోనే వచ్చే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు సంవత్సరంలోగానే గుర్తించి శస్త్రచికిత్స నిర్వహిస్తే వారు సాధారణ జీవితాన్ని గడపవచ్చని డాక్టర్ కేఆర్ మేఘనాథ్ తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా 11 నెలల బాబుకు బైలాట్రల్ కన్స్ట్రక్ట్ సర్జరీని తమ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించగలిగినట్టు ఆయున తెలిపారు. బుధవారం హైదరాబాద్ వాసవి హాస్పిటల్‌లోని మా ఇఎన్‌టి ఆసుపత్రిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాంత్రిక తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే ఇన్‌ప్లాంట్స్‌ను అమర్చే శస్త్రచికిత్స ద్వారా వినికిడి లోపాన్ని తగ్గించవచ్చు అన్నారు. ఈ శస్త్రచికిత్సను ఇప్పటివరకు 11సంవత్సరాల నుంచి మొదలుకొని 52 సంవత్సరాల వయస్సు వారికి కూడా నిర్వహించినట్లు తెలిపారు. గతంలో ఒక చెవికి మాత్రమే చేసేవారమని, అయితే ఇప్పుడు రెండు చెవులకు కూడా ఈ సర్జరీ నిర్వహిస్తున్నావుని అన్నారు. ఇలా రెండు చెవులకు శస్త్రచికిత్స ద్వారా మామూలు వ్యక్తుల్లో ఉన్నట్టే వినికిడి శక్తి వస్తుందన్నారు. ఒక్కసారి ఇన్‌ప్లాంట్స్ అమరిస్తే దాదాపు పదేళ్లకుపైగా ఎలాంటి వినికిడి సమస్యలు తలెత్తవన్నారు. ఏడాదిలోపు పిల్లలకు ఉచితంగా పరీక్ష చేస్తున్నావుని డాక్టర్ మేఘనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్, సతీష్, చీఫ్ ఆర్డియాలజిస్ట్ రాజా తదితరులు పాల్గొన్నారు.