‘ప్రాణం పోయినా... వైద్యం చేశారు!’
ఖైరతాబాద్(హైదరాబాద్): ప్రాణం పోయిన తర్వాత కూడా చికిత్స అందించారంటూ ఓ మృతుడి బంధువులు ఖైరతాబాద్‌లోని ఓ ఆస్పత్రి ముందు ఆదివారం ధర్నాకు దిగారు. సైఫాబాద్ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన వి.బ్రహ్మాచారి(35) ఈ నెల 6న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చేవెళ్లలోని ఓ ఆస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యసేవల కోసం నగరానికి తీసుకువెళ్లాలని సూచించారు.
దీంతో 7వ తేదీ ఉదయం ఖైరతాబాద్‌లోని వాసవి హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. పరీక్షించిన డాక్టర్లు కడుపులో పేగు తెగిపోయిందని చెప్పి అదే రోజు సాయంత్రం శస్త్రచికిత్స పూర్తిచేశారు. ఆ తరువాత ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రహ్మచారి పరిస్థితి విషమించి చనిపోయినట్లు వైద్యులు ఆదివారం తెల్లవారుజామున బంధువులకు తెలియజేశారు.
ధర్నాకు దిగిన రోగి బంధువులు......
అయితే, బ్రహ్మాచారి చనిపోయి రెండు రోజులైనా తమకు చెప్పకుండా చికిత్స అందిస్తూ వచ్చారంటూ రోగి బంధువులు ఆదివారం మధ్యాహ్నం హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. న్యాయం చేయాలంటూ మృతుడి తమ్ముడు చంద్రశేఖర్‌తో పాటు బంధువులు డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు, హాస్పిటల్ యాజమాన్యం సర్దిచెప్పడంతో బాధితులు మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు. అయితే, రోగిని కాపాడేందుకు పూర్తిస్థాయిలో డాక్టర్లు ప్రయత్నించారని, చనిపోయిన తరువాత చికిత్స నిర్వహించామని చెప్తున్న విషయంలో వాస్తవం లేదని వాసవి హాస్పిటల్ మేనేజర్ నాగేశ్వర్‌రావు తెలిపారు.