v.dinesh reddy
-
వైఎస్సార్ సీపీకే ప్రజాదరణ
పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి మేడ్చల్, న్యూస్‌లైన్: మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీని ప్రజలు విశేషంగాఆదరిస్తున్నారని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి వి.దినేష్‌రెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్ మండల వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తాను నియోజకవర్గ పరిధిలో ఎక్కడకు వెళ్లినా అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తోందన్నారు. తనను ఆదరించి ఎంపీగా గెలిపిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో మురికి వాడలు లేకుండా చేస్తానన్నారు. తాగునీటి వసతి, మెరుగైన రోడ్లు తదితర వసతులు కలిపిస్తానని పేర్కొన్నారు. కాగా.. మండలంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీ జోరుగా సాగింది. మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు, మార్కెట్ రోడ్డు, హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డు, బస్‌డిపో, ముకుంద్ థియేటర్, కిష్టాపూర్, పూడూర్ గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి దినేష్‌రెడ్డి బైక్ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బలపరిచిన మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బి.వి. ప్రకాష్ వంజరి, నాయకులు శ్రీధర్‌గౌడ్, మహబూబ్అలీ, అనిల్, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాల ఘనత వైఎస్‌దే కీసర: మహానేత వైస్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచి పోయారని వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి దినేష్‌రెడ్డి అన్నారు. కీసరలో శనివారం నిర్వహించిన బైక్‌ర్యాలీలో ఆయన మాట్లాడారు. 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ భ్రష్టుపట్టించిందని విమర్శించారు. వైఎస్ పేద ప్రజలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ ఆశయ సాధనకోసమే జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీని స్థాపించారని గుర్తు చేశారు. ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని, అందుకోసమే వైఎస్సార్ సీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడిపోయిందని, తనను గెలిపిస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సేవాదళ్ కన్వీనర్ దర్గాసుఖేందర్రెడ్డి, కీసర ఇన్చార్జి ముజిబ్, నేతలు డా.నరహరి, ప్రవీణ్, నారాయణ, రమేష్ , కుంటోళ్ల సత్యనారాయణ, రత్నం, మంగమ్మ, ప్రకాష్‌రెడ్డి, కోటేశ్వర్రావు, ముఖేష్‌రాజ్, అంజి, రాజు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. రాజన్న రాజ్యం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం ఘట్కేసర్ టౌన్: రైజన్న రాజ్యం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఘట్కేసర్ పట్టణంలో శనివారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అస్తవ్యస్తంగా ఉన్న పోలీస్‌శాఖను ప్రక్షాళన చేశానని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించానన్నారు. పేదల పక్షపాతి వైఎస్సార్‌ను బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. సూర్య, చంద్రాదులు ఉన్నంత వరకు ఆయన చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సుస్థిర పాలన, రామ రాజ్యం తిరిగి రావాలంటే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో తూకుంట కృష్ణారెడ్డి, సామల యాదిరెడ్డి, పెరమాండ్ల అశోక్, శ్యామ్‌రావ్, రాజు, గణేష్, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
యువతరం దూకుడు
వైఎస్సార్సీపీ ప్రయోగంతో సంప్రదాయ నేతల్లో దడ.. విద్యాధికులతో పోటీలో ప్రత్యర్థుల బెంబేలు పార్టీ అభ్యర్థులుగా ఐఏఎస్, ఐపీఎస్‌లు, వైద్యులు, ఇంజనీర్లు అత్యధికులు ఉన్నత విద్యావంతులే.. 110 మంది గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు, పీహెచ్డీ చేసిన విద్యాధికులు యువతకు ప్రాధాన్యం.. తొలిసారి పోటీ చేస్తున్నది 66 మంది నవతరానికి తోడుగా అపార అనుభవమున్న రాజకీయ నేతలు జగన్ సారథ్యంలో దూసుకుపోతున్న ప్రచారం సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల్లో గడగడలాడిపోతున్నారు. కారణం.. ఆయ న ప్రత్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున బరిలో నిలవటమే. వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన ఈ మాజీ ఐఏఎస్ అధికారిని ఎదుర్కొనడం చంద్రబాబుకు సవాలుగా మారింది. ఒక్క కుప్పంలోనే కాదు.. చాలా నియోజకవర్గాల్లో అఖిల భారత సర్వీసుల్లో పనిచేసిన అధికారులతో పాటు అనేక రంగాల్లో పేరు గడించిన నిష్ణాతులు, ఉన్నత విద్యావంతులను వైఎస్సార్ కాంగ్రెస్ బరిలోకి దించింది. ఇది.. ఆయా సీట్లలో సంప్రదాయ పద్ధతిలో ఎన్నికల రంగంలోకి వచ్చిన నేతలకు దడ పుట్టిస్తోంది. మూడున్నరేళ్ల కిందట ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ వైపు.. తొలి నుంచీ విద్యావంతులు, యువకులు విపరీతంగా ఆకర్షితులయ్యారు. సామాజిక స్పృహతో పాటు సమాజంలోని పేద బడుగు వర్గాలకు సేవ చేయాలన్న తపన, రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపుకు నడిపించాలన్న ఉత్సాహం, ఉన్నతాశయాలు గల వారిని వైఎస్సార్ సీపీ ఎంపిక చేసినట్టు ఆ పార్టీ అభ్యర్థులను పరిశీలిస్తే విదితమవుతుంది. యువతరం నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధునాతన భావాలకు అద్దంపట్టే విధంగా.. అపార అనుభవమున్న మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు.. వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులు, ఉన్నత విద్యావంతులు, సామాజిక స్పృహ ఉన్న యువకులతో పాత కొత్తల మేలు కలయికగా.. అన్ని సామాజిక వర్గాల సమాహారంగా ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఢీ కొనడం ఇతర పార్టీలకు కత్తిమీద సాముగా మారింది. వైఎస్సార్సీపీ బరిలోకి దింపిన నేతలకు దీటుగా ప్రచారం చేయటంలో ప్రత్యర్థులు బెంబేలెత్తుతున్నారు. బరిలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు... చిత్తూరు లోక్‌సభ పరిధిలోకి వచ్చే కుప్పం అసెంబ్లీలో మాజీ ఐఏఎస్ అధికారి పోటీ చేస్తుంటే.. చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి కూడా మరో మాజీ ఐఏఎస్ అధికారి వి.వరప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి మరో మాజీ ఐఏస్ అధికారి తోట చంద్రశేఖర్‌ను వైఎస్సార్ సీపీ పోటీకి పెట్టింది. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ డీజీపీ వి.దినేష్‌రెడ్డి రంగంలో ఉన్నారు. 110 మంది ఉన్నత విద్యావంతులే... సీమాంధ్రలోని 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారిలో 110 మందికి పైగా అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీలు చేసిన వారే. వీరిలో 83 మంది డిగ్రీ, 26 మంది పీజీ విద్యను అభ్యసించారు. వీరు కాక 16 మంది వృత్తి నిపుణులైన ఇంజనీర్లు, 9 మంది వైద్యులు ఉన్నారు. సాఫ్ట్వేర్ నిపుణులు, న్యాయవాదులు, అధ్యాపకులు, పారిశ్రామిక వేత్తలు.. ఇలా అనేక రంగాలకు చెందిన వారూ ఉన్నారు. వేమూరు అభ్యర్థి డాక్టర్ మేరుగ నాగార్జున అధ్యాపక వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. సామాజిక స్పృహ మెండుగా ఉన్న నాగార్జున దళిత, బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడాలన్న తపనతో ఉన్నారు. మంచి సర్జన్‌గా పేరున్న మదనపల్లె అభ్యర్థి దేశాయి తిప్పారెడ్డి ప్రాక్టీసును వదలి ఎన్నికల బరిలోకి దిగారు. చిన్న పిల్లల వ్యాధుల చికిత్సలో నిపుణురాలైన వినుకొండ అభ్యర్థి నన్నపనేని సుధ (ఎం.డి.) వృత్తిని వదలి రాజకీయాల్లోకి వచ్చారు. నర్సరావుపేటలో పేరుమోసిన ఎముకల శస్త్ర చికిత్సా నిపుణుడైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ రంగంలో ఇప్పటికే బాగా రాణిస్తున్నా ప్రజాసేవలోకి వచ్చారు. గన్నవరం నుంచి రంగంలో ఉన్న డాక్టర్ దుట్టా రామచంద్రరావు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సహాధ్యాయి. ఆయన వయసులో పెద్దవారైనా వైఎస్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవకు నడుంకట్టారు. పెదకూరపాడు స్థానం నుంచి పోటీ చేస్తున్న బొల్లా బ్రహ్మనాయుడు పారిశ్రామికవేత్త. ఆయన పాల పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా దిగ్విజయంగా వెలుగొందుతున్నారు. కాంట్రాక్టులు, ఫార్మారంగంలో పేరు ప్రతిష్టలున్న రాంకీ గ్రూపుకు చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, షిప్పింగ్ కంపెనీల రంగంలో ఇప్పటికే స్థిరపడి విజయవంతంగా రాణిస్తున్న పెనమలూరు అభ్యర్థి కె.విద్యాసాగర్ వంటి వారు పలు కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తూ వస్తున్నారు. కందుకూరు అభ్యర్థి పోతుల రామారావు, రాయదుర్గం అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి, దర్శి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కనిగిరి అభ్యర్థి బుర్రా మధుసూదన యాదవ్ వ్యాపార రంగంలో బాగా రాణిస్తున్న వారే. యువతరానికి అనుభవం తోడు: ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో మెజారిటీ అభ్యర్థులు యువకులే. వారితో పాటు అపార రాజకీయ అనుభవం ఉన్న వారూ ఉన్నారు. వీరంతా యువనేత సారథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని పరుగెత్తిస్తున్నారు. అసెంబ్లీకి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న వారిలో అతి పిన్న వయస్కుడు ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి పోటీ చేస్తున్న గొట్టిపాటి భరత్ కాగా అందరి కంటే పెద్ద వారు వైఎస్సార్ కడప జిల్లాలోని మైదుకూరు స్థానానికి పోటీ చేస్తున్న 67 ఏళ్ల శెట్టిపల్లి రఘురామిరెడ్డి. మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అత్యధికంగా ఎనిమిదోసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. శెట్టిపల్లి రఘురామిరెడ్డి (మైదుకూరు), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు) ఇద్దరూ ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీ పడుతున్నారు. మొత్తం మీద 30 సంవత్సరాల లోపు వారు నలుగురు, 30-40 మధ్య వయసువారు 12 మంది, 40-50 మధ్య వయసు వారు 78 మంది, 50-60 మధ్య వయసు వారు 60 మంది, 60 సంవత్సరాల పైబడిన వారు 18 మంది అభ్యర్థులు ప్రస్తుతం వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. లోక్‌సభ బరిలో పాత - కొత్త తరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా విద్యావేత్తలు, యువకులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించిన సీనియర్లతో మేలు కలయికగా ఉంది. సీమాంధ్ర ప్రాంతంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో చాలా మంది ఆయా రంగాలపై మంచి అవగాహన ఉన్న వారే కావడం విశేషం. వీరిలో పలువురు పారిశ్రామిక వేత్తలు, సాంకేతిక నిపుణులు, పాలనానుభవంలో ఆరితేరిన వారు కూడా ఉన్నారు. మొత్తం 25 మంది అభ్యర్థుల్లో సగం మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎనిమిది మంది డిగ్రీ వరకూ విద్యను అభ్యసించిన వారు ఉంటే.. మరో ముగ్గురు ఇంజనీరింగ్‌లో పట్టభద్రులు ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఎంబీఏ, ఎంఎస్ పట్టా పుచ్చుకున్న వారు నలుగురున్నారు. ఈ నలుగురికీ రాజకీయాలు కొత్తే అయినా వ్యాపారరంగంలో మాత్రం ఇప్పటికే మంచి అనుభవాన్ని గడించారు. తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్న ఐదుగురు మహిళల్లో కూడా ఒకరు మినహా మిగతా అందరూ విద్యాధికులే. ఇద్దరు డిగ్రీ విద్యార్హత కలిగి ఉండగా ఒకరు పీజీ, మరొకరు పీహెచ్డీ చేశారు. ఈ ఐదుగురిలో ముగ్గురు రాజకీయాలకు పూర్తిగా కొత్తకావడం విశేషం. 25 మంది అభ్యర్థుల్లో 10 మంది పారిశ్రామికవేత్తలుగా ఆయా రంగాల్లో రాణిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వీరంతా భవిష్యత్తులో కేంద్రంపై తగిన సమయంలో ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకునే పట్టుదల ఉన్నవారు. పాలనా రంగంలో నిపుణులైన ఐఏఎస్, ఐపీఎస్ మాజీ అధికారులు ఇద్దరు ఈ అభ్యర్థుల్లో ఉన్నారు. అభ్యర్థుల్లో కొంత మంది ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నా లోక్‌సభకు తొలిసారిగా పోటీ చేస్తున్న వారు 20 మంది ఉన్నారు. నెల్లూరు, నంద్యాల, అనంతపురం సిట్టింగ్ ఎంపీలైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డికి మాత్రమే లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. వీరిలో ఏడోసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఘనత 69 ఏళ్ల మేకపాటికి దక్కుతుంది. అభ్యర్థులందరిలోనూ పెద్దవారై న మేకపాటి ఇప్పటికి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ఆరోసారి లోక్‌సభ బరిలోకి దిగుతున్న అనంత నాలుగుసార్లు, మూడోసారి పోటీ చేస్తున్న ఎస్.పి.వై రెండుసార్లు ఇప్పటికే లోక్‌సభకు ఎన్నికై ఉన్నారు. గతంలో ఒకసారి గెలిచి, మరోసారి ఓడిన వల్లభనేని బాలశౌరి మూడోసారి గుంటూరు నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయానుభవం గల మాజీ మంత్రులు కె.పార్థసారథి, పినిపె విశ్వరూప్ తొలిసారి లోక్‌సభ బరిలోకి దిగుతున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా పోటీ చేస్తున్న వారిలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కూడా ఉన్నారు. అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాథ్ (28 ఏళ్లు) అందరికన్నా చిన్నవాడు. మొత్తం మీద 30 ఏళ్ల లోపు వారు వారు ఇద్దరు, 40 ఏళ్ల లోపు వారు ముగ్గురు, 50 ఏళ్ల లోపు వారు పది మంది, 60 ఏళ్ల లోపు వారు ఆరుగురు, 60 ఏళ్లకు పైబడిన వారు ముగ్గురు మాత్రమే ఉన్నారు. తొలిసారి అసెంబ్లీ బరిలో 66 మంది సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు 175 మందిలో తొలిసారిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తు న్న వారు 66 మంది ఉన్నారు. రాజకీయాల్లో అనుభవం ఉండి, జడ్పీటీసీ సభ్యులుగా, మండల, జిల్లా పరిషత్‌ల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉండి మళ్లీ శాసనసభకు పోటీ చేస్తున్న వారు 109 మంది ఉన్నారు. వీరిలో 23 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉంటూ మళ్లీ పోటీ చేస్తున్నారు. 13వ శాసనసభలో కొంత కాలం ప్రా తినిధ్యం వహించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసి తృణప్రాయంగా పదవులను వదులుకున్న వారూ పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్నారు. రెండోసారి వచ్చిన అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీల విప్‌లను ఉల్లంఘించి ఓట్లేసి పదవులు కోల్పోయిన 15 మంది మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇలా అనర్హతకు గురైన మద్దాలి రాజేశ్‌కుమార్ మాత్రం తన సతీమణి డాక్టర్ దేవీప్రియ ను రంగంలోకి దించారు. గత ఐదేళ్లు కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉండిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్ కూడా మళ్లీ పోటీలోకి దిగారు. మోపిదేవి, ధర్మాన ఇద్దరూ కూడా సీబీఐ పెట్టిన అక్రమ కేసుల బాధితులు కావడం విశేషం. -
ఖాకీ టు ఖద్దరు
శ్రీరంగం కామేష్ ఖాకీకి, ఖద్దరుకు అవినాభావ సంబంధం. ఖద్దరు పవరేంటో బాగా తెలిసినవారు ఖాకీలే. రాజకీయాల్లో చేరితే ప్రజా సేవకు మరింత అవకాశం ఉంటుందని భావించిన ఎందరో పోలీసు అధికారులు వివిధ రాజకీయ పార్టీల్లో చేరారు. రిటైరయ్యాక కొందరు, ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసి మరికొందరు పార్టీల కండువాలు కప్పుకున్నారు. వారిలో కొందరు రాజకీయాల్లోనూ విజయవంతమైన నేతలుగా నిరూపించుకున్నారు. విజయరామారావు రాష్ట్రంలో.. పీవీ రంగయ్యనాయుడు, బలరాం నాయక్‌లు కేంద్రంలో మంత్రి పదవులను కూడా అలంకరించగలిగారు. రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న పోలీసు అధికారుల వివరాలు.. వి.దినేష్‌రెడ్డి: వైఎస్సార్సీపీ హైదరాబాద్ పోలీసు కమిషనర్ నుంచి డీజీపీ వరకు అనేక కీలక పోస్టుల్లో పని చేసిన ఐపీఎస్ అధికారి వి.దినేష్‌రెడ్డి. 2013 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విధానాలకు ఆకర్షితుడై రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. రంగయ్య నాయుడు: కాంగ్రెస్ రాష్ట్ర డీజీపీగా పని చేసిన పివీ రంగయ్య నాయుడు 1991లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి దిగి గెలుపొందారు. అప్పటి పీవీ నరసింహారావు కేబినెట్లో 1996 వరకు కేంద్రమంత్రిగా పని చేశారు. ఆపై ఎమ్మెల్సీగా కొనసాగారు. కె.విజయరామారావు: తెలుగుదేశం హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పని చేసిన కె.విజయరామారావు సీబీఐ డెరైక్టర్‌గా కూడా వ్యవహరించారు. పదవీ విరమణ తరవాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు. 2004 ఎన్నికల్లో ఓటమి చెందారు. ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. పేర్వారం రాములు: టీఆర్ఎస్ డీజీపీ ర్యాంక్‌లో ఉండి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పని చేసిన తొలి ఐపీఎస్ అధికారి పేర్వారం రాములు. ఆపై రాష్ట్ర డీజీపీగానూ వ్యవహరించారు. పదవీ విరమణ అనంతరం మొదట్లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. డీటీ నాయక్ : పీఆర్పీ విజయవాడ పోలీసు కమిషనర్‌గా, వరంగల్ ఎస్పీగా పని చేసిన సమయంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఐపీఎస్ అధికారి డీటీ నాయక్. పదవీ విరమణ తరవాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రావులపాటి : టీడీపీ సీనియర్ ఐపీఎస్ అధికారి రావులపాటి సీతారామరావు పదవీ విరమణ అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఎంవీ భాస్కర్‌రావు: ఆంధ్రనాడు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పని చేసి ఘర్షణల్ని అదుపు చేయడంలో పలువురి ప్రశంసలు పొందిన ఐపీఎస్ అధికారి ఎంవీ భాస్కర్‌రావు.. ఆ తరువాత రాష్ట్ర డీజీపీగానూ పని చేశారు. పదవీ విరమణ అనంతరం మిగి లిన వారికి భిన్నంగా ఆంధ్రనాడు పార్టీ స్థాపించారు. వర్ల రామయ్య: టీడీపీ గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వర్ల రామయ్య పోలీసు విభాగంలో ఎసై ్స గా అడుగుపెట్టారు. విజయవాడ కేంద్రంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ఇన్స్పెక్టర్, డీఎస్పీగా పనిచేశారు. వీఆర్ఎస్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009 తిరుపతి ఎంపీ స్థానానికి పోటీపడి ఓడిపోయారు. ప్రస్తుతం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి. కానిస్టేబుల్ నుంచి కేంద్రమంత్రిగా వరంగల్ జిల్లా మదనపల్లెలో పుట్టిన పి.బల్రామ్ నాయక్ వరంగల్ జిల్లా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిన నాయక్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరం ఎంపీగా గెలిచి యూపీఏ-2లో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మరోసారి మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ పడుతున్నారు. మరెందరో... *రిటైర్డ్ ఐపీఎస్‌లు అయిన శ్రీనివాసులు,డి.రెడ్డప్పరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీలుగా పని చేశారు. *రిటైర్డ్ డీఐజీ స్థాయి అధికారి చంద్రశేఖర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. *మాజీ డీజీ స్థాయి అధికారి ఎస్కే జయచంద్రం ఇటీవలే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. *ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో వివాదాస్పద పరిస్థితుల్లో తన డీఎస్పీ పోస్టుకు రాజీనామా చేసిన నళిని తొలుత టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఆపై భారతీయ జనతా పార్టీలో చేరారు. *సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ లో ఇన్స్పెక్టర్గా పనిచేసిన అంజయ్య గద్వాల్లో డీఎస్పీగా పని చేస్తున్న సమయంలో వీఆర్ఎస్ తీసుకుని కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ తరఫున సిద్ధిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. *హైదరాబాద్‌లోని చిలకలగూడ ఠాణాలో ఇన్స్పెక్టర్గా పనిచేసిన హనుమంతరావు పీఆర్పీ ఆవిర్భావంతోనే వీఆర్ఎస్ తీసుకుని ఆ పార్టీ లో చేరారు. విజయనగరం జిల్లా సాలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆపై మళ్లీ పోలీసు ఉద్యోగంలో చేరారు. *నగర కమిషనరేట్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ధనుంజయ్‌గౌడ్ ప్రజారాజ్యం పార్టీలో చేరి నల్లగొండ జిల్లా సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. *ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన దొమ్మాట సాంబయ్య మాజీ పోలీసు అధికారే. వరంగల్ జిల్లాకే చెందిన ఈయన కరీంనగర్ జిల్లాలో సీఐగా పనిచేస్తూ వీఆర్ఎస్ తీసుకున్నారు. *రాష్ట్రంలోని వివిధ కీలక పోస్టింగ్స్‌తో పాటు నగర పోలీసు కమిషనరేట్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పని చేసిన ఐపీఎస్ అధికారి దినకర్ప్రసాద్ పదవీ విరమణ అనంతరం టీడీపీలో చేరారు. -
నిరంతరం మీ వెంటే ఉంటాం
ఏఎస్‌రావునగర్,న్యూస్‌లైన్: మహానేత వైఎస్సార్ అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి నాంది అని పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి వి.దినేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఏఎస్‌రావునగర్‌లోని పార్టీ కార్యాలయం ఆవరణలో 200 మంది మహిళ సంఘాల సభ్యులు పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా జరిగిన సభలో దినేశ్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలంటూ..ప్రతి కార్యకర్తకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని స్పష్టం చేశారు. విధినిర్వహణలో నిస్వార్థంగా సేవలందించానని, తనను గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీఇచ్చారు. ఆయన వెంట పార్టీ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి కుమార్‌యాదవ్, సుమతీమోహన్,ప్రశాంత్, త్రిపాఠి, డాక్టర్ పురుషోత్తంరెడ్డి, డాక్టర్ కొండారెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు మాటమీద నిలబడే వ్యక్తి కాదు : రాజా ముషీరాబాద్: చంద్రబాబు మాటమీద నిలబడే వ్యక్తి కాదని సినీహీరో రాజా విమర్శించారు. ముషీరాబాద్ వైఎస్సార్సీపీ అభ్యర్థి గాదె బాల్రెడ్డికి మద్దతుగా మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి తప్ప ఎవరూ పేదల గురించి పట్టించుకోలేదన్నారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో బీసీ,మైనార్టీల శ్రేయస్సే లక్ష్యంగా ఉందని, అది జగన్ మనస్సులోంచి వచ్చిన మేనిఫెస్టో అని కొనియాడారు. పార్టీ కార్యాలయం ప్రారంభం అల్వాల్ : ప్రజావసరాలను తెలుసుకుని సాగే పాలన కావాలంటే వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని దినేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం మచ్చబొల్లారంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హామీలనివ్వడంతోపాటు నెరవేర్చే సత్తా ఉన్న వారినే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జోరుగా బొడ్డు పాదయాత్ర బహదూర్‌పురా: వైఎస్సార్సీపీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి బొడ్డు సాయినాథ్‌రెడ్డి ప్రచారంలో జోరుగా దూసుకెళ్తున్నారు. మంగళవారం నందిముస్లాయిగూడలో పార్టీ ప్రచార కార్యాలయాన్ని పార్టీ బహదూర్‌పురా అభ్యర్థి రామేశ్వరిశ్యామలతో కలిసి ప్రారంభించారు. అనంతరం నందిముస్లాయిగూడలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.