యువతరం దూకుడు | large number of youth contest in ysrcp | Sakshi
Sakshi News home page

యువతరం దూకుడు

Published Sat, Apr 26 2014 2:13 AM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM

large number of youth contest in ysrcp

 వైఎస్సార్‌సీపీ ప్రయోగంతో సంప్రదాయ నేతల్లో దడ.. విద్యాధికులతో పోటీలో ప్రత్యర్థుల బెంబేలు

  • పార్టీ అభ్యర్థులుగా ఐఏఎస్, ఐపీఎస్‌లు, వైద్యులు, ఇంజనీర్లు
  • అత్యధికులు ఉన్నత విద్యావంతులే.. 110 మంది గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీ చేసిన విద్యాధికులు
  • యువతకు ప్రాధాన్యం..
  • తొలిసారి పోటీ చేస్తున్నది 66 మంది
  • నవతరానికి తోడుగా అపార అనుభవమున్న రాజకీయ నేతలు
  • జగన్ సారథ్యంలో దూసుకుపోతున్న ప్రచారం

 
 సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల్లో గడగడలాడిపోతున్నారు. కారణం.. ఆయ న ప్రత్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున బరిలో నిలవటమే. వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన ఈ మాజీ ఐఏఎస్ అధికారిని ఎదుర్కొనడం చంద్రబాబుకు సవాలుగా మారింది. ఒక్క కుప్పంలోనే కాదు..  చాలా నియోజకవర్గాల్లో అఖిల భారత సర్వీసుల్లో పనిచేసిన అధికారులతో పాటు అనేక రంగాల్లో పేరు గడించిన నిష్ణాతులు, ఉన్నత విద్యావంతులను వైఎస్సార్ కాంగ్రెస్ బరిలోకి దించింది. ఇది.. ఆయా సీట్లలో సంప్రదాయ పద్ధతిలో ఎన్నికల రంగంలోకి వచ్చిన నేతలకు దడ పుట్టిస్తోంది. మూడున్నరేళ్ల కిందట ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ వైపు.. తొలి నుంచీ విద్యావంతులు, యువకులు విపరీతంగా ఆకర్షితులయ్యారు. సామాజిక స్పృహతో పాటు సమాజంలోని పేద బడుగు వర్గాలకు సేవ చేయాలన్న తపన, రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపుకు నడిపించాలన్న ఉత్సాహం, ఉన్నతాశయాలు గల వారిని వైఎస్సార్ సీపీ ఎంపిక చేసినట్టు ఆ పార్టీ అభ్యర్థులను పరిశీలిస్తే విదితమవుతుంది. యువతరం నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధునాతన భావాలకు అద్దంపట్టే విధంగా.. అపార అనుభవమున్న మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు.. వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులు, ఉన్నత విద్యావంతులు, సామాజిక స్పృహ ఉన్న యువకులతో పాత కొత్తల మేలు కలయికగా.. అన్ని సామాజిక వర్గాల సమాహారంగా ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఢీ కొనడం ఇతర పార్టీలకు కత్తిమీద సాముగా మారింది. వైఎస్సార్‌సీపీ బరిలోకి దింపిన నేతలకు దీటుగా ప్రచారం చేయటంలో ప్రత్యర్థులు బెంబేలెత్తుతున్నారు.
 
 బరిలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు...
 చిత్తూరు లోక్‌సభ పరిధిలోకి వచ్చే కుప్పం అసెంబ్లీలో మాజీ ఐఏఎస్ అధికారి పోటీ చేస్తుంటే.. చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి కూడా మరో మాజీ ఐఏఎస్ అధికారి వి.వరప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు.

  ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి మరో మాజీ ఐఏస్ అధికారి తోట చంద్రశేఖర్‌ను వైఎస్సార్ సీపీ పోటీకి పెట్టింది.

  మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ డీజీపీ వి.దినేష్‌రెడ్డి రంగంలో ఉన్నారు.
 
 110 మంది ఉన్నత విద్యావంతులే...
 సీమాంధ్రలోని 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారిలో 110 మందికి పైగా అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీలు చేసిన వారే. వీరిలో 83 మంది డిగ్రీ, 26 మంది పీజీ విద్యను అభ్యసించారు. వీరు కాక 16 మంది వృత్తి నిపుణులైన ఇంజనీర్లు, 9 మంది వైద్యులు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ నిపుణులు, న్యాయవాదులు, అధ్యాపకులు, పారిశ్రామిక వేత్తలు.. ఇలా అనేక రంగాలకు చెందిన వారూ ఉన్నారు.
 
 వేమూరు అభ్యర్థి డాక్టర్ మేరుగ నాగార్జున అధ్యాపక వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. సామాజిక స్పృహ మెండుగా ఉన్న నాగార్జున దళిత, బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడాలన్న తపనతో ఉన్నారు.
 
మంచి సర్జన్‌గా పేరున్న మదనపల్లె అభ్యర్థి దేశాయి తిప్పారెడ్డి ప్రాక్టీసును వదలి ఎన్నికల బరిలోకి దిగారు.

చిన్న పిల్లల వ్యాధుల చికిత్సలో నిపుణురాలైన వినుకొండ అభ్యర్థి నన్నపనేని సుధ  (ఎం.డి.) వృత్తిని వదలి రాజకీయాల్లోకి వచ్చారు.
 
నర్సరావుపేటలో పేరుమోసిన ఎముకల శస్త్ర చికిత్సా నిపుణుడైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ రంగంలో ఇప్పటికే బాగా రాణిస్తున్నా ప్రజాసేవలోకి వచ్చారు.
 
గన్నవరం నుంచి రంగంలో ఉన్న డాక్టర్ దుట్టా రామచంద్రరావు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సహాధ్యాయి. ఆయన వయసులో పెద్దవారైనా వైఎస్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవకు నడుంకట్టారు.

  పెదకూరపాడు స్థానం నుంచి పోటీ చేస్తున్న బొల్లా బ్రహ్మనాయుడు పారిశ్రామికవేత్త. ఆయన పాల పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా దిగ్విజయంగా వెలుగొందుతున్నారు.
 
కాంట్రాక్టులు, ఫార్మారంగంలో పేరు ప్రతిష్టలున్న రాంకీ గ్రూపుకు చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, షిప్పింగ్ కంపెనీల రంగంలో ఇప్పటికే స్థిరపడి విజయవంతంగా రాణిస్తున్న పెనమలూరు అభ్యర్థి కె.విద్యాసాగర్ వంటి వారు పలు కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తూ వస్తున్నారు.
 
  కందుకూరు అభ్యర్థి పోతుల రామారావు, రాయదుర్గం అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి, దర్శి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కనిగిరి అభ్యర్థి బుర్రా మధుసూదన యాదవ్ వ్యాపార రంగంలో బాగా రాణిస్తున్న వారే.

 యువతరానికి అనుభవం తోడు: ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో మెజారిటీ అభ్యర్థులు యువకులే. వారితో పాటు అపార రాజకీయ అనుభవం ఉన్న వారూ ఉన్నారు. వీరంతా యువనేత సారథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని పరుగెత్తిస్తున్నారు.
 
అసెంబ్లీకి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తున్న వారిలో అతి పిన్న వయస్కుడు ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి పోటీ చేస్తున్న గొట్టిపాటి భరత్ కాగా అందరి కంటే పెద్ద వారు వైఎస్సార్ కడప జిల్లాలోని మైదుకూరు స్థానానికి పోటీ చేస్తున్న 67 ఏళ్ల శెట్టిపల్లి రఘురామిరెడ్డి.
 
మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అత్యధికంగా ఎనిమిదోసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. శెట్టిపల్లి రఘురామిరెడ్డి (మైదుకూరు), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు) ఇద్దరూ ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీ పడుతున్నారు.
 
మొత్తం మీద 30 సంవత్సరాల లోపు వారు నలుగురు, 30-40 మధ్య వయసువారు 12 మంది, 40-50 మధ్య వయసు వారు 78 మంది, 50-60 మధ్య వయసు వారు 60 మంది, 60 సంవత్సరాల పైబడిన వారు 18 మంది అభ్యర్థులు ప్రస్తుతం వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్నారు.
 
 లోక్‌సభ బరిలో పాత - కొత్త తరాల
 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా విద్యావేత్తలు, యువకులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించిన సీనియర్లతో మేలు కలయికగా ఉంది. సీమాంధ్ర ప్రాంతంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో చాలా మంది ఆయా రంగాలపై మంచి అవగాహన ఉన్న వారే కావడం విశేషం. వీరిలో పలువురు పారిశ్రామిక వేత్తలు, సాంకేతిక నిపుణులు, పాలనానుభవంలో ఆరితేరిన వారు కూడా ఉన్నారు. మొత్తం 25 మంది అభ్యర్థుల్లో సగం మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎనిమిది మంది డిగ్రీ వరకూ విద్యను అభ్యసించిన వారు ఉంటే.. మరో ముగ్గురు ఇంజనీరింగ్‌లో పట్టభద్రులు ఉన్నారు.  పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఎంబీఏ, ఎంఎస్ పట్టా పుచ్చుకున్న వారు నలుగురున్నారు. ఈ నలుగురికీ రాజకీయాలు కొత్తే అయినా వ్యాపారరంగంలో మాత్రం ఇప్పటికే మంచి అనుభవాన్ని గడించారు. తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్న ఐదుగురు మహిళల్లో కూడా ఒకరు మినహా మిగతా అందరూ విద్యాధికులే. ఇద్దరు డిగ్రీ విద్యార్హత కలిగి ఉండగా ఒకరు పీజీ, మరొకరు పీహెచ్‌డీ చేశారు. ఈ ఐదుగురిలో ముగ్గురు రాజకీయాలకు పూర్తిగా కొత్తకావడం విశేషం. 25 మంది అభ్యర్థుల్లో 10 మంది పారిశ్రామికవేత్తలుగా ఆయా రంగాల్లో రాణిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వీరంతా భవిష్యత్తులో కేంద్రంపై తగిన సమయంలో ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకునే పట్టుదల ఉన్నవారు. పాలనా రంగంలో నిపుణులైన ఐఏఎస్, ఐపీఎస్ మాజీ అధికారులు ఇద్దరు ఈ అభ్యర్థుల్లో ఉన్నారు.
 
  అభ్యర్థుల్లో కొంత  మంది ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నా లోక్‌సభకు తొలిసారిగా పోటీ చేస్తున్న వారు 20 మంది ఉన్నారు. నెల్లూరు, నంద్యాల, అనంతపురం సిట్టింగ్ ఎంపీలైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డికి మాత్రమే లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. వీరిలో ఏడోసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఘనత 69 ఏళ్ల మేకపాటికి దక్కుతుంది. అభ్యర్థులందరిలోనూ పెద్దవారై న మేకపాటి ఇప్పటికి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ఆరోసారి లోక్‌సభ బరిలోకి దిగుతున్న అనంత నాలుగుసార్లు, మూడోసారి పోటీ చేస్తున్న ఎస్.పి.వై రెండుసార్లు ఇప్పటికే లోక్‌సభకు ఎన్నికై ఉన్నారు. గతంలో ఒకసారి గెలిచి, మరోసారి ఓడిన  వల్లభనేని బాలశౌరి మూడోసారి గుంటూరు నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయానుభవం గల మాజీ మంత్రులు కె.పార్థసారథి, పినిపె విశ్వరూప్ తొలిసారి లోక్‌సభ బరిలోకి దిగుతున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా పోటీ చేస్తున్న వారిలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కూడా ఉన్నారు. అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న గుడివాడ అమర్‌నాథ్ (28 ఏళ్లు) అందరికన్నా చిన్నవాడు. మొత్తం మీద 30 ఏళ్ల లోపు వారు వారు ఇద్దరు, 40 ఏళ్ల లోపు వారు ముగ్గురు, 50 ఏళ్ల లోపు వారు పది మంది, 60 ఏళ్ల లోపు వారు ఆరుగురు, 60 ఏళ్లకు పైబడిన వారు ముగ్గురు మాత్రమే ఉన్నారు.
 
 తొలిసారి అసెంబ్లీ బరిలో 66 మంది
 సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు 175 మందిలో తొలిసారిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తు న్న వారు 66 మంది ఉన్నారు. రాజకీయాల్లో అనుభవం ఉండి, జడ్పీటీసీ సభ్యులుగా, మండల, జిల్లా పరిషత్‌ల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉండి మళ్లీ శాసనసభకు పోటీ చేస్తున్న వారు 109 మంది ఉన్నారు. వీరిలో 23 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉంటూ మళ్లీ పోటీ చేస్తున్నారు. 13వ శాసనసభలో కొంత కాలం ప్రా తినిధ్యం వహించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసి తృణప్రాయంగా పదవులను వదులుకున్న వారూ పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్నారు. రెండోసారి వచ్చిన అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీల విప్‌లను ఉల్లంఘించి ఓట్లేసి పదవులు కోల్పోయిన 15 మంది మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇలా అనర్హతకు గురైన మద్దాలి రాజేశ్‌కుమార్ మాత్రం తన సతీమణి డాక్టర్ దేవీప్రియ ను రంగంలోకి దించారు. గత ఐదేళ్లు కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉండిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్ కూడా మళ్లీ పోటీలోకి దిగారు. మోపిదేవి, ధర్మాన ఇద్దరూ కూడా సీబీఐ పెట్టిన అక్రమ కేసుల బాధితులు కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement