ఖాకీ టు ఖద్దరు
శ్రీరంగం కామేష్
ఖాకీకి, ఖద్దరుకు అవినాభావ సంబంధం. ఖద్దరు పవరేంటో బాగా తెలిసినవారు ఖాకీలే. రాజకీయాల్లో చేరితే ప్రజా సేవకు మరింత అవకాశం ఉంటుందని భావించిన ఎందరో పోలీసు అధికారులు వివిధ రాజకీయ పార్టీల్లో చేరారు. రిటైరయ్యాక కొందరు, ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసి మరికొందరు పార్టీల కండువాలు కప్పుకున్నారు. వారిలో కొందరు రాజకీయాల్లోనూ విజయవంతమైన నేతలుగా నిరూపించుకున్నారు. విజయరామారావు రాష్ట్రంలో.. పీవీ రంగయ్యనాయుడు, బలరాం నాయక్‌లు కేంద్రంలో మంత్రి పదవులను కూడా అలంకరించగలిగారు. రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న పోలీసు అధికారుల వివరాలు..
వి.దినేష్‌రెడ్డి: వైఎస్సార్‌సీపీ
హైదరాబాద్ పోలీసు కమిషనర్ నుంచి డీజీపీ వరకు అనేక కీలక పోస్టుల్లో పని చేసిన ఐపీఎస్ అధికారి వి.దినేష్‌రెడ్డి. 2013 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విధానాలకు ఆకర్షితుడై రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.
రంగయ్య నాయుడు: కాంగ్రెస్
రాష్ట్ర డీజీపీగా పని చేసిన పివీ రంగయ్య నాయుడు 1991లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి దిగి గెలుపొందారు. అప్పటి పీవీ నరసింహారావు కేబినెట్‌లో 1996 వరకు కేంద్రమంత్రిగా పని చేశారు. ఆపై ఎమ్మెల్సీగా కొనసాగారు.
కె.విజయరామారావు: తెలుగుదేశం
హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పని చేసిన కె.విజయరామారావు సీబీఐ డెరైక్టర్‌గా కూడా వ్యవహరించారు. పదవీ విరమణ తరవాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు. 2004 ఎన్నికల్లో ఓటమి చెందారు. ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
పేర్వారం రాములు: టీఆర్‌ఎస్
డీజీపీ ర్యాంక్‌లో ఉండి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పని చేసిన తొలి ఐపీఎస్ అధికారి పేర్వారం రాములు. ఆపై రాష్ట్ర డీజీపీగానూ వ్యవహరించారు. పదవీ విరమణ అనంతరం మొదట్లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు.
డీటీ నాయక్ : పీఆర్పీ
విజయవాడ పోలీసు కమిషనర్‌గా, వరంగల్ ఎస్పీగా పని చేసిన సమయంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఐపీఎస్ అధికారి డీటీ నాయక్. పదవీ విరమణ తరవాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
రావులపాటి : టీడీపీ
సీనియర్ ఐపీఎస్ అధికారి రావులపాటి సీతారామరావు పదవీ విరమణ అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నారు.
ఎంవీ భాస్కర్‌రావు: ఆంధ్రనాడు
హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పని చేసి ఘర్షణల్ని అదుపు చేయడంలో పలువురి ప్రశంసలు పొందిన ఐపీఎస్ అధికారి ఎంవీ భాస్కర్‌రావు.. ఆ తరువాత రాష్ట్ర డీజీపీగానూ పని చేశారు. పదవీ విరమణ అనంతరం మిగి లిన వారికి భిన్నంగా ఆంధ్రనాడు పార్టీ స్థాపించారు.
వర్ల రామయ్య: టీడీపీ
గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వర్ల రామయ్య పోలీసు విభాగంలో ఎసై ్స గా అడుగుపెట్టారు. విజయవాడ కేంద్రంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్, డీఎస్పీగా పనిచేశారు. వీఆర్‌ఎస్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009 తిరుపతి ఎంపీ స్థానానికి పోటీపడి ఓడిపోయారు. ప్రస్తుతం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి.
కానిస్టేబుల్ నుంచి కేంద్రమంత్రిగా
వరంగల్ జిల్లా మదనపల్లెలో పుట్టిన పి.బల్‌రామ్ నాయక్ వరంగల్ జిల్లా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిన నాయక్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరం ఎంపీగా గెలిచి యూపీఏ-2లో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మరోసారి మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ పడుతున్నారు.
మరెందరో...
*రిటైర్డ్ ఐపీఎస్‌లు అయిన శ్రీనివాసులు,డి.రెడ్డప్పరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీలుగా పని చేశారు.
*రిటైర్డ్ డీఐజీ స్థాయి అధికారి చంద్రశేఖర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
*మాజీ డీజీ స్థాయి అధికారి ఎస్‌కే జయచంద్రం ఇటీవలే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
*ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో వివాదాస్పద పరిస్థితుల్లో తన డీఎస్పీ పోస్టుకు రాజీనామా చేసిన నళిని తొలుత టీఆర్‌ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఆపై భారతీయ జనతా పార్టీలో చేరారు.
*సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన అంజయ్య గద్వాల్‌లో డీఎస్పీగా పని చేస్తున్న సమయంలో వీఆర్‌ఎస్ తీసుకుని కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ తరఫున సిద్ధిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
*హైదరాబాద్‌లోని చిలకలగూడ ఠాణాలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన హనుమంతరావు పీఆర్పీ ఆవిర్భావంతోనే వీఆర్‌ఎస్ తీసుకుని ఆ పార్టీ లో చేరారు. విజయనగరం జిల్లా సాలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆపై మళ్లీ పోలీసు ఉద్యోగంలో చేరారు.
*నగర కమిషనరేట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ధనుంజయ్‌గౌడ్ ప్రజారాజ్యం పార్టీలో చేరి నల్లగొండ జిల్లా సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు.
*ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన దొమ్మాట సాంబయ్య మాజీ పోలీసు అధికారే. వరంగల్ జిల్లాకే చెందిన ఈయన కరీంనగర్ జిల్లాలో సీఐగా పనిచేస్తూ వీఆర్‌ఎస్ తీసుకున్నారు.
*రాష్ట్రంలోని వివిధ కీలక పోస్టింగ్స్‌తో పాటు నగర పోలీసు కమిషనరేట్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పని చేసిన ఐపీఎస్ అధికారి దినకర్‌ప్రసాద్ పదవీ విరమణ అనంతరం టీడీపీలో చేరారు.