కర్నూలులో ‘ఎర్ర’ డంప్ స్వాధీనం
జిల్లా వ్యాప్తంగా 19 మంది స్మగ్లర్ల అరెస్టు
రూ.కోటి విలువైన దుంగలు, వాహనాలు సీజ్
సిబ్బందిని అభినందించిన ఎస్పీ శ్రీనివాస్
చిత్తూరు (అర్బన్): జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా పోలీసులు జరిపిన దాడుల్లో 19 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి, రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగల్ని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన 179 ఎర్రచందనం దుంగల్ని సైతం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఈ వివరాలను వెల్లడించారు.
కర్నూలులో భారీ డంప్..
చిత్తూరు పశ్చిమ విభాగం సీఐ ఆదిరానాయణ తన ఎస్ఐలు, సిబ్బందితో కలిసి మూడు రోజుల క్రితం కాణిపాకం వద్ద ఎర్రచందనం తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతను చిత్తూరు నగరంలోని టెలిఫోన్ కాలనీకి చెందిన షామీర్‌బాషా (25)గా గుర్తించారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు జిల్లాలోని కొత్తపల్లె మండలం గోకవరం గ్రామంలో వెంకటేశ్వర్లుకు చెందిన పొలంలో 179 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. షామీర్బాషాను ఇప్పటికే అరెస్టు చేసి, రిమాండు పంపగా కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లును బుధవారం అరెస్టు చేసి, దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు.
పీలేరు పరిధిలో..
పీలేరు సీఐ నరసింహులు మంగళవారం పీలేరు శివారు ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో పీలేరుకు చెందిన నాగేంద్రనాయక్ (27) మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ ఉన్నాడు. ఇటుకల వ్యాపారం నుంచి ఎర్రచందనం డాన్‌గా ఎదిగాడు. నాగేంద్రనాయక్‌తో పాటు పీలేరు పరిసర ప్రాంతాలకు చెందిన చెంగల్‌రెడ్డి, వెంకటముని, తేజ, శంకర్, చెంగల్రాయుడు, రమణనాయక్, సురేంద్ర, రాజన్న, గోపినాయన్, సురేష్‌ను అరెస్టు చేశారు.
వాయల్పాడు పరిధిలో..
వాయల్పాడు సీఐ శ్రీధర్ తన సిబ్బందితో మంగళవారం మండలంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎర్రచందనం తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో వైఎస్సార్ జిల్లా పొద్దుటూరుకు చెందిన డీ.బాలచంద్ర (27), ఎం.అరుణ్‌కుమార్ (24), ఎం.నరేంద్రకుమార్ (25), బీ.ఆదినారాయణ (22), ఎం.సురేష్‌రెడ్డి (32), వేంపల్లెకు చెందిన రవికుమార్ (35)లను అరెస్టు చేశారు. ఈ మూడు కేసుల్లో నిందితుల నుంచి 217 ఎర్రచందనం దుంగలు, ఓ సుమో, మారుతి-800, ఐదు మోటారు సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన ఓఎస్డీ రత్న, డీఎస్పీలు గిరిధర్, దేవదాసు, సీఐలు, ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐలు షాదిక్ అలీ, మహేశ్వర్ పాల్గొన్నారు.