venkatapuram colony
-
కరోనా వైరస్: దిగ్బంధంలో వెంకటాపురం
పద్మనాభం (భీమిలి): పద్మనాభం మండలం వెంకటాపురంలో కరోనా కల్లోలం సృష్టించింది. దీంతో గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన వారు కూడా పది రోజుల నుంచి భయాందోళనల మధ్య గడుపుతున్నారు. గ్రామంలోకి లండన్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా వైరస్ సోకినట్టు గతనెల 22న విశాఖ చెస్టు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. దీంతో అదే రోజు యువకుడి కుటుంబంలో నలుగురితో పాటు 23 మందిని విశాఖ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరిలో యువకుడి తండ్రికి 26న పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇతను ఎవరిని కలిశారో తెలుసుకుని మరో 10 మందిని తరలించారు. రెండు విడతల్లో మొత్తం 33 మందిని ఆసుపత్రికి తరలించారు. కాగా యువకుడి సోదరి, తల్లికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో నాలుగు కేసులు నమోదు కావడంతో గ్రామస్తులు భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. (వణుకుతున్న వెంకటాపురం) ఇద్దరు ఇంటికి.. మిగిలిన వారు క్వారంటైన్లో.. వీరి ఇంట్లో ఇద్దరి పనిమనుషులతో పాటు యువకుడి నాన్నమ్మకు నెగిటివ్ రావడంతో ఇళ్లకు పంపించేశారు. మిగతా 26 మంది క్వారంటైన్లో ఉన్నారు. వీరికి సంబంధించి రిపోర్టులు ఇంకా రాకపోవడంతో వీరి కుంటుంబ సభ్యులతో పాటు వీరు కలిసిన వారు భయాందోళన నడుమ కాలం గడుపుతున్నారు. రిపోర్టుల కోసం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు. దిగ్భంధంలో గ్రామం కరోనా వైరస్ ప్రబలడంతో వెంకటాపురాన్ని దిగ్భందించారు. గ్రామస్తులను ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు హెచ్చరించారు. గ్రామానికి మూడు వైపులా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి వెంకటాపురం గ్రామస్తులు ఇతర గ్రామాల్లోకి వెళ్లకుండా కట్టడి చేశారు. కరోనా వైరస్ భయంతో వెంకటాపురం గ్రామం ఊసేత్తెతే మిగతా గ్రామల ప్రజలు హడలిపోతున్నారు. దీని వల్ల వెంకటాపురం ప్రజలను అటు మజ్జిపేట, ఇటు రేవిడి గ్రామస్తులు రానివ్వడం లేదు. దూరం పెట్టేశారు పదిరోజులుగా ఈ రెండు పంచాయతీలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పంచాయతీ ప్రజల ఆందోళన కారణంగా మంగళవారం నుంచి రేవిడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రౌతులపాలెం వరకు వంట గ్యాస్ సరఫరా జరుగుతోంది. వీరికి మాస్క్‌లు, శానిటైజర్లు, డెటాల్, కర్చీఫ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ ప్రాంతంలో పండించిన కూరగాయలు కరోనా భయంతో గ్రామాలను దాటకుండానే పశువులకు ఆహారమయిపోతున్నాయి. ఎటూ రానివ్వడం లేదు వంట గ్యాస్ పది రోజులుగా ఈ ప్రాంతానికి రాలేదు. తెచ్చుకుందామంటే ఇటు మహారాజుపేట వైపు అటు పాండ్రంగి వైపు రానివ్వడం లేదు. పోరాడితే ఈ రోజు నుంచి అది కూడా మూడు కిలోమీటర్ల దూరంలో రౌతులపాలెం చెరువు వద్దకు వచ్చి సిలిండర్లు విడిపించుకోమంటున్నారు. – పిల్లి ఆదినారాయణ, రేవిడి దాణా కోసం కటకట పది రోజులగా పశువులకు దాణా సరఫరా నిలిచిపోయింది. దాణా కోసం విజయనగరం వెళ్తామంటే లాక్డౌన్ కారణంగా పోలీసులు అనుమతించడం లేదు. పశువులు నీరసించిపోతున్నాయి. పాలదిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. – భూపతిరాజు రాజేష్, డెయిరీ యజమాని, రేవిడి -
వర్షం కురవాలి.. సిరులు పండాలి
వర్షాలు పుష్కలంగా కురిసి సిరులు పండాలని కాంక్షిస్తూ ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీవాసులు దాదాపు వెయ్యి మంది పూజారి తిమ్మప్ప ఆధ్వర్యంలో గుంటె రంగస్వామికి తుంగభద్ర నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఎమ్మిగనూరు టౌన్: వర్షం కోసం ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీ వాసులు ఆయుధాలు చేపట్టారు. వీటితో పూజారి తిమ్మప్ప ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది పాదయాత్రగా నందవరం మండలంలోని గంగవరానికి వెళ్లారు. అక్కడ తుంగభద్ర జలాలను తీసుకొని శుక్రవారం అర్ధరాత్రి తిరుగు పయానమయ్యారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో పట్టణానికి చేరుకున్నారు. తుంగభద్ర జలాల బిందెతో పూజారి తిమ్మప్ప, కాలనీ వాసులు పట్టణంలోని వీధుల గుండా బయలుదేరి మధ్యాహ్నం 12.30గంటలకు వెంకటాపురం కాలనీకి చేరుకున్నారు. దారిపొడువున మహిళలు పూజారికి కాళ్లకు జలాభిషేకం చేసి ఆహ్వానం పలికారు. శ్రీగుంటె రంగస్వామి ఆలయం చుట్టూ ఐదుసార్లు పూజరితో పాటు జలాల కోసం వెళ్లిన ప్రజలు ప్రదక్షణ చేశారు. ప్రదక్షణ సందర్భంగా తమ కోర్కేలు తీర్చుకునేందుకు మహిళలు పూజారి కాళ్లకు అడ్డం పడుతూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. కాలనీలోని శ్రీగుంటెరంగస్వామికి పూజారి జలాభిషేకం చేశారు. అనంతరం శ్రీవెంకటేశ్వరస్వామి, లక్ష్మమ్మ అవ్వ, ఆంజనేయస్వామితో పాటు గ్రామదేవతలకు నదీ జలాలతో అభిషేకించారు. వర్షం కురవాలి..సిరులు పండాలంటూ శ్రావణమాసం మొదటి శనివారం ప్రతి ఏడాదీ దేవతలను తుంగభద్ర జలాలతో అభిషేకిస్తామని కాలనీ వాసులు తెలిపారు. నదీ జలా లు తీసుకొచ్చే సమయంలో అడవి జంతువుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు పూర్వీకులు ఆయుధాలు తీసుకెళ్లేవారని, ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. కౌన్సిలర్లు భాస్కర్‌రెడ్డి, నాగమ్మ, కాలనీ పెద్దలు నీలకంఠరెడ్డి, బజారి, బి.జగన్నాథ్‌రెడ్డి, రంగన్న, పాండు, గుంటె రంగస్వామి పాల్గొన్నారు.