కొత్తమార్గాల అన్వేషణలో బెస్ట్
సాక్షి, ముంబై: వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో మెట్రో రైల్వేస్టేషన్లను కలుపుతూ సాగే కొత్తమార్గాల కోసం బెస్ట్ అన్వేషణ ప్రారంభించింది. ఇటీవలే ప్రారంభమైన వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో సేవలు ప్రారంభం కావడంతో బెస్టుకు చెందిన బస్సులలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఘాట్కోపర్-అంధేరీల మధ్య నడిచే బెస్టు బస్సు సర్వీసులను సగానికి సగం తగ్గించింది. మెట్రో సేవల ప్రారంభానికి ముందు 340 నంబరు బెస్టు బస్సులు 292 ట్రిప్పులు తిరిగేవి. మెట్రో రైల్వే సేవలు ప్రారంభంతో ఈ ట్రిప్పుల సంఖ్యను 150కి తగ్గించారు.
ఇలా మెట్రో సేవలు అందుబాటులో ఉన్న మార్గాల్లో బెస్ట్ ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో కొత్తమార్గాలపై కన్నేసిన బెస్ట్ మెట్రో స్టేషన్లను కలుపుకొని వెళ్లే కొత్త మార్గాల్లో బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. తక్కువ దూరమైనప్పటికీ ప్రయాణికుల సంఖ్య ఆశించినస్థాయిలోనే ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మెట్రో స్టేషన్ల నుంచి పారిశ్రామిక ప్రాంతాలకు, కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు బెస్ట్ బస్సులను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయించిన అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. సర్వేలకు సంబంధించిన నివేదికలు రాగానే సర్వీసులను ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
కలిసొచ్చే అంశమే...
మెట్రో చార్జీలు ఎక్కువగా ఉండడం బెస్ట్ సంస్థకు కలిసొచ్చే విషయంగా ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఘాట్కోపర్ నుంచి అంధేరీకి మెట్రో రైలు చార్జీ సుమారు రూ. 30 ఉంటుందని అంచనా. అయితే బెస్టు బస్సు చార్జీ మాత్రం ఘాట్కోపర్ నుంచి అంధేరి వరకు కేవలం రూ. 15 ఉండనుంది. దీంతో రానుపోను చార్జీలు కలిపితే మెట్రో ఒక చార్జీతో సమానం అవుతుండడంతో ప్రయాణికులు బెస్ట్ బస్సులనే ఆశ్రయిస్తారని, ఫలితంగా ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు.
పెరుగుతున్న నష్టం..
మెట్రోసేవలు అందుబాటులోకి రావడంతో బెస్ట్ సంస్థలో ప్రస్తుతానికి ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. ప్రస్తుతం మెట్రో చార్జీలు తక్కువగా ఉండడం, సేవలు కొత్త కూడా కావడంతో ప్రయాణికులంతా మెట్రోల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో బెస్ట్‌కు ఇప్పటిదాకా రూ. 18 కోట్లమేర నష్టం వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. నెలరోజులపాటు మెట్రో చార్జీలు ఇంతే ఉండే అవకాశం ఉండడంతో తమ నష్టాలు మరింతగా పెరిగే అవకాశముందంటున్నారు.