ముంబై : స్వీడన్ రాజదంపతులు కింగ్ కార్ల్-16 గుస్టాఫ్, క్వీన్ సిల్వియా ఐదు రోజుల భారత పర్యటనలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. భారత పర్యటనలో రాజదంపతులు ప్రదర్శిస్తున్న నిరాడంబరత పలువురుని ఆకట్టుకుంటుంది. తాజాగా బుధవారం రాజదంపతులు ముంబై వెర్సోవా బీచ్‌లోని చెత్తను ఏరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో అక్కడి వాలంటీర్లకు సహాయం అందించారు. పర్యావరణ ఉద్యమకారుడు ఆఫ్రోజ్ షాతో కలిసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, వెర్సోవా బీచ్‌లోని వ్యర్థాలను తొలగించడానికి ఆఫ్రోజ్ రెండేళ్ల క్రితం ఒంటరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన వెంట 12,000 మది వాలంటీర్లు ఉన్నారు. ఆఫ్రోజ్ కృషికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారు. బీచ్‌లో చెత్త ఏరుతున్న సమయంలో రాజదంపతులు అక్కడి వాలంటీర్లతో ముచ్చటించారు. అలాగే బుధవారం సాయంత్రం వారు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో సమావేశం కానున్నారు. అనంతరం డెహ్రాడూన్ బయలుదేరి వెళ్తారు. ఉత్తరఖాండ్‌లోని రామ్ జూలాను సందర్శిస్తారు. అలాగే గురువారం హరిద్వార్‌లో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్‌ను స్వీడన్ రాజదంపతులు ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment