Visakha HPCL
-
హెచ్‌పీసీఎల్ యాజమాన్యానికి పనబాక క్లీన్చిట్
విశాఖ : విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) లో పేలుడు ప్రమాద దుర్ఘటనపై యాజమాన్యానికి కేంద్రమంత్రి పనబాక లక్ష్మి క్లీన్చిట్ ఇచ్చారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు మంత్రి పనబాక గురువారం 20 లక్షల నష్టపరిహారం అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా హెచ్‌పీసీఎల్‌కు వ్యతిరేకంగా కేసు వేసిన విషయం తనకు తెలియదని పనబాక చెప్పుకొచ్చారు. కాగా గత ఏడాది ఆగస్ట్‌లో హెచ్పీసీఎల్లో జరిగిన పేలుడు ప్రమాదంలో 25మంది మృతి చెందారు. మృతులతో పాటు, క్షతగాత్రుల్లో చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. మృతుల కుటుంబాలకు హెచ్‌పీసీఎల్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. -
25కు చేరిన హెచ్‌పీసీఎల్ మృతుల సంఖ్య
విశాఖ : విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) లో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 25కు చేరింది. ఓల్డ్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాంట్రాక్ట్ కార్మికుడు అప్పల్రాజు శుక్రవారం మృతి చెందాడు. గత నెల 23వ తేదీన హెచ్పీసీఎల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో పదిమంది అక్కడికక్కడే చనిపోగా, చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. మృతులతో పాటు, క్షతగాత్రుల్లో చాలామాంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. మృతుల కుటుంబాలకు హెచ్‌పీసీఎల్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. మరోవైపు తీవ్రంగా గాయపడినవారిని మెరుగైన చికిత్స నిమిత్తం ముంబయికి తరలించారు. -
ప్రమాదానికి బాధ్యతారాహిత్యమే కారణం: బాబు
విశాఖ : విశాఖ హెచ్పీసీఎల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి కంపెనీ అధికారులు బాధ్యతారాహిత్యమే కారణమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన శనివారం ప్రమాద ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారని మండిపడ్డారు. ఈ సంఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే మృతి చెందినవారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోం ఇవ్వాలన్నారు. కాగా హెచ్పీసీఎల్లో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. -
హెచ్‌పీసీఎల్ ప్రమాదంలో 11కు చేరిన మృతుల సంఖ్య
విశాఖపట్నం: నగరంలోని హెచ్‌పీసీఎల్ సంస్థకు చెందిన రిఫైనరీలో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 36 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటనలో మరణించిన, గాయపడిన వారి వివరాలు కోసం 180042500002 నెంబర్‌కు ఫోన్ చేయాలని ఉన్నతాధికారులు చెప్పారు. ప్రమాదం వివరాలు తెలిపేందుకు హెచ్‌పీసీఎల్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేయగా, దానిని మృతుల బంధువులు అడ్డుకున్నారు. ఆచూకీ తెలియని మృతదేహాల కోసం అధికారులను వారు నిలదీశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని శనివారం సందర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఉన్నతాధికారులనడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ కూడా ఈ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఇక్కడికి రానున్నారు. ప్రమాద ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలిస్తారు.