VNR Vignan Jyothi College
-
'హిమాచల్' మృతులకు ఏపీ కేబినెట్ సంతాపం!
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ సమావేశం విశాఖలో జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లో చనిపోయిన వీఎన్ఆర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. బెల్టు షాపుల రద్దు, రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. రుణమాఫీ సహా 5 సంతకాల అమలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వయోపరిమితి పెంపులో ఎదురయ్యే అభ్యంతరాలపై, సమస్యలపై కేబినెట్ సమావేశం చర్చించింది. గుంటూరు సమీపంలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు తొలిసారి కేబినెట్ సమావేశం నిర్వహించారు. -
మృతదేహాలను వెతికేందుకు మానవ రహిత విమానాలు
మండి( హిమాచల్ ప్రదేశ్): హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మృతి చెందిన 18 మంది విద్యార్థులను వెతికేందుకు మానవ రహిత విమానాన్ని వినియోగించుకోనున్నట్టు జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది. నదిలో మునిగిపోయిన విద్యార్ధుల ఆచూకీని తెలుసుకునేందుకు ఉపరితలం నుంచి మానవ రహిత విమానం ద్వారా ఫోటోలు తీయడానికి వినియోగించనున్నారు. విద్యార్ధుల మృతదేహాలను గుర్తించేందుకు రిమోట్ సెన్సింగ్ ద్వారా విమానం ఫోటోలు తీయడానికి, నీటి అడుగు భాగంలో పనిచేసే కెమెరాల వినియోగం, ప్రమాద ఘటనా స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు జాతీయ విపత్తు సంస్థ నిర్ణయం తీసుకుంది. -
'నదిలో గల్లంతైన విద్యార్ధులు బతికిలేనట్టే'
మండి( హిమాచల్ ప్రదేశ్): బియాస్ నదిలో గల్లంతైన విద్యార్ధులు ఇక బతికి లేనట్టేనని జాతీయ విపత్తు సంస్థ అధికారి జైదీప్ సింగ్ అన్నారు. 18 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టామని జైదీప్ సింగ్ తెలిపారు. గాలింపు చర్యల్లో రేపు కొన్ని మృతదేహాలు బయటపడే అవకాశముందని ఆయన తెలిపారు. బియాస్ నదిలో ఉదయం పూట నదిలో నీళ్లు తక్కువగా ఉంటున్నాయని, అదే సమయంలో గాలింపునకు ఆస్కారం ఉంటోందని జైదీప్ సింగ్ అన్నారు. విద్యార్ధుల గాలింపు చర్యలపై అధికారులతో హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ మరోసారి సమీక్ష జరిపారు. రిజర్వాయర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో సైరన్ వినిపించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం వీరభద్ర సింగ్ ఆదేశించారు. తీరం వెంబడి హెచ్చరిక బోర్డులు పెట్టాలని కూడా అధికారులకు సూచించారు. కనీసం 500 మంది జవాన్లను గాలింపు కోసం వినియోగించాలని హోంశాఖను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి కోరారు.