విజ్ఞానజ్యోతి విద్యార్థుల మృతి కేసు; ప్రభుత్వానికి చుక్కెదురు
న్యూఢిల్లీ: వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి కేసులో హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విద్యార్థుల మృతికి హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. తీర్పు అమలుకు 6 నెలల సమయం కావాలని ప్రభుత్వం కోరగా, మూడు నెలల్లో పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 24 మంది విద్యార్థులు 2014 జూన్ 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపణలు వచ్చాయి. చనిపోయిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని కోర్టు కొట్టివేయడంతో విద్యార్థుల కుటుంబాలకు ఊరట లభించింది.