voice samples
-
దొరికేశాడు
అన్నాడీఎంకే రెండాకుల గుర్తుకోసం అక్రమమార్గాన్ని ఎంచుకున్నటీటీవీ దినకరన్ సాక్ష్యాధారాలతో సహా దొరికేశారు. ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపేందుకు హవాలా బ్రోకర్‌తో దినకరన్ జరిపిన సంభాషణలపై స్వర పరీక్షలు చేసి ఆ గొంతు టీటీవీ దినకరన్దేనని ఢిల్లీ పోలీసులు తేల్చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: రెండాకుల గుర్తుకోసం లంచం కేసులో టీటీవీ దినకరన్‌పై పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. హవాలా బ్రోకర్‌తో సంభాషణ దినకరన్ స్వరమే అని నిర్ధారించారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే వర్గాలుగా చీలిపోయిన తరుణంలో ఆర్కేనగర్ ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో చీలిక వర్గాలన్నీ పోటీకి దిగి రెండాకుల గుర్తు తమదంటే తమదని వాదించుకున్నాయి. దీంతో అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం ఎవరికీ దక్కకుండా ఎన్నికల కమిషన్ వాటిపై తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో తలా ఒక పార్టీని పెట్టుకుని, స్వతంత్ర అభ్యర్థులుగా తలా ఒక చిహ్నాన్ని పొందారు. అయితే రెండాకుల గుర్తు లేకుండా ప్రజలను ఆకర్షించడం అసాధ్యమనే సత్యాన్ని చీలికవర్గ నేతలంతా తెలుసుకున్నారు. పార్టీ సభ్యుల సంతకాల సేకరణతో సంఖ్యా బలం నిరూపించుకోవడం ద్వారా రెండాకుల చిహ్నం కోసం పోటీపడడం ప్రారంభించారు. అయితే, రూ.50 కోట్ల లంచం ఇచ్చి ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులను లోబరుచుకోవడం ద్వారా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవాలని దినకరన్ ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన హవాలా బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ సహాయాన్ని ఆశ్రయించారు. ఈ లావాదేవీలు జరుగుతున్న తరుణంలో బ్రోకర్ సుఖేష్ ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిచ్చిన వాంగ్మూలంతో దినకరన్‌ను సైతం అరెస్ట్ చేశారు. కొన్ని నెలలు ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న దినకరన్ బెయిల్‌పై బయటకు వచ్చారు. సాక్ష్యాధారాల సేకరణ బ్రోకర్ సుఖేష్‌కు తనకు సంబంధం లేదని దినకరన్ బుకాయించడంతో పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను సేకరించేపనిలో పడ్డారు. ఒక టీవీ చానల్‌కు దినకరన్ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను సంపాదించి దినకరన్ గొంతును నిర్ధారించుకున్నారు. ముడుపుల వ్యవహరంలో హవాలా బ్రోకర్ సుకేష్, దినకరన్ మధ్య సాగిన సెల్‌ఫోన్ సంభాషణలను పోల్చిచూస్తూ జరిపిన స్వరపరీక్షలో ఈ గొంతు దినకరన్దేనని నిర్ధారణ అయినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం ప్రకటించారు. తీవ్రంగా పరిగణించి.. దినకరన్ ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపిన ప్రయత్నాన్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ కేసులో ఆయన ప్రమేయం రుజువుకావడంతో ఆయనను మళ్లీ అరెస్ట్‌చేసి చార్జిషీటు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
యడ్యూరప్పకు కోర్టు నోటీసులు
సాక్షి, బెంగళూరు: కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్‌తో పాటు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పకు బెంగళూరు సెషన్స్ కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. రెండు నెలల కిందట నగర బీజేపీ కార్యాలయంలో వీరిద్దరూ వేదికపై ‘మనం కూడా హైకమాండ్‌కు ముడుపులు ఇచ్చాం. అయితే అందరికీ తెలిసేటట్టు ఇస్తామా’ అని ఒకరికొకరు చెప్పుకుంటున్నట్లున్న వీడియోను కాంగ్రెస్ నాయకులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సీడీలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్ప సిటీ సైబర్ పోలీస్‌స్టేషన్‌లో అందజేసి దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు. పోలీసులు కోర్టును ఆశ్రయించగా వీరిద్దరికీ కోర్టు నోటీసులు జారీ చేస్తూ, ఇవి అందిన ఏడు రోజుల్లోపు స్వర పరీక్షలకు హాజరు కావాలని ఆదేశించింది. -
పాత కేసు.. ములాయంకు కొత్త కష్టాలు
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు కొత్త కష్టాలు ఎదురవనున్నాయి. గతంలో ఆయన ఎదుర్కొన్న ఆరోపణలకు సంబంధించి మరోసారి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్‌ను బెదిరించినట్లు గతంలో నమోదైన కేసుకు సంబంధించి ఆయన బెదిరించింది నిజామా కాదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ముందడుగు వేస్తున్నారు. త్వరలో ములాయం స్వరానికి సంబంధించి నమూనాలు సేకరించబోతున్నారు. 2015లో ములాయం తనను ఫోన్లో బెదిరించారంటూ ఠాకూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. అక్రమాస్తులు పోగేశారని ఆరోపిస్తూ గాయత్రి ప్రజాపతిపై లోకాయుక్తలో ఠాకూర్, ఆయన సతీమణి నూతన్ ఠాకూర్ పిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ములాయం వారిని బెదిరించారంట. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు విచారణ నెమ్మదిగా జరిగింది. దీంతో ప్రస్తుతం కేసు పరిస్థితిపై దర్యాప్తు అధికారి లక్నో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సంధ్యా శ్రీవాత్సవ ముందు హాజరై ఎన్నికల కారణంగా పోలీసులు ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేకపోయారని, త్వరలోనే యాదవ్ ఠాకూర్ మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేయడంతోపాటు ములాయం స్వర నమూనాలు కూడా సేకరిస్తామని చెప్పారు. ఈ కేసు ఏప్రిల్ 24న తిరిగి విచారణకు రానుంది. -
చంద్రబాబుకు స్వర పరీక్ష
- నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్న ఏసీబీ - సెల్‌ఫోన్ రికార్డు వాయిస్ వాస్తవమైనదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ ల్యాబ్ - చంద్రబాబు నిరాకరిస్తే అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తీసుకునే యోచనలో ఏసీబీ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వేగం పెంచింది. ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పాత్రపై దర్యాప్తు జరి పేందుకు గాను పూర్తిస్థాయిలో దృష్టిసారించిం ది. అందులో భాగంగా చంద్రబాబుకు స్వర పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయ డం కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపిన కేసులో సీఎం బాబు పాత్రపై అనేక ఆధారాలు లభ్యమైన సంగతి తెల్సిందే. ఎమ్మెల్యేలతో ఫోన్లో చంద్రబాబు స్వయంగా బేరసారాలు నడిపినట్లు ఆడియో టేపులు వెలుగు చూశాయి. నామినేటెడ్ ఎమ్మె ల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో చంద్రబాబు మాట్లాడిన వాయిస్‌పై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ(ఎఫ్ఎస్ఎల్) గతంలోనే నివేదిక అందజేసింది. ఆ వాయిస్ నిజమైనదే అని, ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదని స్పష్టం చేసిం ది. అందులో ఉన్న స్వరం ఏపీ సీఎం చంద్రబాబుదేనని తాజాగా ముంబైకి చెందిన ఒక ల్యాబ్ నివేదిక అందజేసింది. అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు... చంద్రబాబుకు స్వర పరీక్షలు నిర్వహించాలని ఏసీబీ భావిస్తోంది. ప్రైవేటు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టుతో పాటు కేసు తీవ్రత దృష్ట్యా ఎఫ్ఎస్ఎల్ చేత మరోసారి పరీక్షలు జరిపించాలని నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని భావిస్తోందని అధికారులు అంటున్నారు. ఏడాది కిందటే చేయాలనుకున్న ఏసీబీ.. ఓటుకు కోట్లు కేసులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు స్వర పరీక్షలు జరిపించాలని ఏడాది కిందటే ఏసీబీ భావించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సీఎం చంద్రబాబు సాగించిన సంభాషణ మొత్తం వాస్తవమైనదేనని ఎఫ్ఎస్ఎల్ నివేదిక నిర్ధారించింది. తర్వాత ఆ ఆడియో టేపులోని గొంతు చంద్రబాబు స్వరనమూనాతో సరిపోల్చేందుకు... స్వరపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మొదటగా కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్రవెంకట వీరయ్యల స్వర పరీక్షలు పూర్తి చేసింది. అసెంబ్లీ రికార్డుల నుంచి తీసుకున్న ఎమ్మెల్యేల వాయిస్ రికార్డులను, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బేరసారాలు సాగించిన ఫోన్ సంభాషణల వాయిస్ రికార్డును సరిపోల్చేందుకు ఎఫ్ఎస్ఎల్కు పంపింది. రెండింటి వాయిస్‌లు సరిపోలినట్లు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. అలాగే చంద్రబాబు స్వరనమూనాలను కూడా పరీక్షలకు పంపి న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలను ఉంచాలని భావించింది. అయితే గత కొంతకాలంగా ఈకేసు నెమ్మదించింది. తాజాగా న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఏసీబీ... చంద్రబాబుకు కూడా ఇపుడు స్వరపరీక్షను పూర్తి చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా చంద్రబాబుకు నోటీసులను పంపించాలని, వాటికి ఆయన స్పందించకపోతే ఆయన స్వరనమూనాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తీసుకోవాలని భావిస్తోంది. ఒక వేళ నోటీసులకు స్పందిస్తే గనుక ఆయన వద్దకెళ్లి తాజాగా స్వరనమూనాలను తీసుకొని ఎఫ్ఎస్ఎల్కు అందజేయాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు.