చైర్మన్..ఓ అటెండర్!
రోడ్డు భద్రతను చూడాల్సింది వీరే
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 30న మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనం.. ఆ తర్వాత 40 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో వంద మందికి పైగా మృతి.. ఇలా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడినవారు దాదాపు 15 వేల మంది.. క్షతగాత్రులు మరో 70 వేల మంది.. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఏటా 14 వేల నుంచి 15 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తోంది? రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడానికి ఇప్పటివరకు ఏం చేసింది? అంటే కంటితుడుపు చర్యలు తప్ప మరేమీ లేవనే చెప్పాలి. మరోవైపు పదమూడేళ్ల క్రితం ఘనంగా ఏర్పాటు చేసిన ‘రోడ్డు భద్రతా సంస్థ’ (రోడ్ సేఫ్టీ అథారిటీ) నామమాత్రంగానే మిగిలింది.
వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయపరుస్తూ రోడ్డు ప్రమాదాలను నిరోధించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఇది ప్రస్తుతం నిధులు, సిబ్బంది, కనీస సదుపాయాల్లేక కొట్టుమిట్టాడుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆనుకుని ఉన్న ‘ఎ’ బ్లాక్ మూడో అంతస్తులోని సంస్థ కార్యాలయం చూస్తే... ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది. చైర్మన్, అటెండర్ మాత్రమే ఇక్కడ సిబ్బంది. ఒక టేబులు, ఒక కుర్చీ మాత్రమే ఇక్కడ మౌలిక సౌకర్యాలు!
చెప్పిందేమిటి... చేసిందేమిటి?: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో రోడ్డు భద్రతా సంస్థను చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం 13 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసింది. రోడ్డు రవాణా సంస్థతో పాటు పోలీసు, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్టీఏ తదితర విభాగాలను సమన్వయంచేస్తూ రోడ్డు ప్రమాదాల నిరోధానికి శాస్త్రీయమైన అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం.
రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలు, అక్కడ ప్రమాదానికి కారణాలు, ప్రమాదకరమైన కల్వర్టులు, మలుపులపై ఇది అధ్యయనం చేయాలి. అంతేకాదు వాహనాల ఫిట్నెస్, వేగ నియంత్రణ, ప్రభుత్వ, ప్రైవేటు వాహన చోదకులు డ్రెవింగ్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, వారికి శిక్షణ తదితర అంశాలపై కూడా నివేదికలివ్వాలి. దీనికి తొలి చైర్మన్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎంవీ కృష్ణారావును ప్రభుత్వం నియమించింది. అత్యంత ఆర్భాటంగా సంస్థ ఏర్పాటు వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత దానికి అవసరమైన నిధులను సర్కారు కేటాయించలేదు. చివరకు సిబ్బందిని, అధికారులను కూడా నియమించలేదు. మౌలిక సదుపాయాలనూ కల్పించలేదు. సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో తనకు అనుకూలంగా లేనివారిని ఈ సంస్థకు చైర్మన్గా బదిలీ చేయడానికే ఈ సంస్థను వినియోగించుకోవడం మొదలెట్టింది.
ఆఫీసుకొచ్చి ఏం చేయాలి?: బృహత్తర బాధ్యతలు నిర్వర్తించాల్సిన రోడ్డు భద్రతా సంస్థపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపడం విమర్శలకు దారితీస్తోంది. నిధు లు, సిబ్బందీ లేని సంస్థతో ఏం చేయాలని ప్రస్తుత చైర్మన్గా ఉన్న అదనపు డీజీ ఎస్వీ రమణమూర్తి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. చివరకు సర్కారు వైఖరిపై కినుక వహించి కార్యాలయానికీ రావట్లేదని తెలిసింది. కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న ఒక్క అటెండర్ను కూడా ఆయన పలుమార్లు అభ్యర్థన పంపితేనే ప్రభుత్వం నియమించింది. ఇలాంటి స్థితిలో కూడా ఈ సంస్థకు గతంలో చైర్మన్గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎ.కె.మహంతి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కష్టపడి రూపొందించిన నివేదికను సైతం అటకెక్కించింది. ఈవిధమైన సర్కారు నిర్లక్ష్య వైఖరి ప్రజలకు శాపంలా మారింది. ఘోర ప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటున్న ప్రస్తుత తరుణంలోనైనా ప్రభుత్వం స్పందిస్తుందేమో చూడాల్సిందే మరి.