VVIP choppers
-
వీవీఐపీల కోసం బోయింగ్ విమానాలు..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర వీవీఐపీలు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బీ777 విమానాలను బోయింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎయిర్ ఇండియాకు అందచేస్తుందని సీనియర్ అధికారులు వెల్లడించారు. వీవీఐపీల ప్రయాణం కోసమే కేటాయించిన ఈ విమానాల డెలివరీ జులై నాటికి పూర్తవుతుందని గత ఏడాది అక్టోబర్‌లో అధికారులు పేర్కొన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో స్వల్ప జాప్యం చోటుచేసుకుందని, ఈ రెండు విమానాలు సెప్టెంబర్ నాటికి డెలివరీ అవుతాయని అధికారులు తెలిపారు. ఈ రెండు బీ777 విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు కాకుండా భారత వైమానిక దళ పైలట్లు నడపనున్నారు. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్) ఈ విమానాలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎయిర్ ఇండియాకు చెందిన బీ747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఏఐఈఎస్ఎల్ సమాకూర్చే ఎయిర్ ఇండియా పైలట్లు బీ747 విమానాలను నడుపుతున్నారు. ఈ విమానాల్లో ప్రముఖులు పర్యటించని సందర్భాల్లో వీటిని ఎయిర్ ఇండియా వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగిస్తోంది. చదవండి : అంతర్జాతీయ టీకా కూటమికి 15 మిలియన్ డాలర్లు -
అగస్టా కేసులో ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో న్యాయవాది గౌతం ఖెతాన్‌కు చెందిన రూ.8.46 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అటాచ్ చేసింది. రెండో దశ విచారణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు సంస్థ తెలిపింది. వెల్లడించని విదేశీ ఖాతాలను ఆయన కలిగి ఉన్నారని వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా భారీ మొత్తంలో సింగపూర్, మారిషస్ దేశాల నుంచి విదేశీ కరెన్సీని ఖెతాన్ పొందినట్లు విచారణలో తేలిందని ఈడీ వివరించింది. ఢిల్లీ, హరియాణా, ఉత్తరాఖండ్‌లలో ఆయన ఆస్తులు కలిగి ఉన్నారని, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అగస్టా కేసులో నిందితుడిగా ఉన్న ఖెతాన్ బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసి ఆయనను జనవరి 25న అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆదాయపన్ను శాఖ వివరాలను ఆధారంగా చేసుకుని తాజాగా ఆయనపై మరో కేసును ఈడీ నమోదు చేసింది. -
రూ. 3,600 కోట్ల హెలికాప్టర్ ఒప్పందం రద్దు
భారతీయ వైమానిక దళానికి 12 వీవీఐపీ హెలికాప్టర్లను సరఫరా చేయడానికి ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌లాండ్‌తో గతంలో కుదిరిన భారీ ఒప్పందాన్ని భారత్ రద్దుచేసుకుంది. రూ. 3,600 కోట్ల విలువైన ఈ ఒప్పందం కుదరడానికి ఆ కంపెనీ కొంతమంది వ్యక్తులకు రూ. 360 కోట్లు లంచం ముట్టజెప్పిందని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2010లో కుదిరిన ఈ ఒప్పందం కోసం భారత వైమానిక దళం మాజీ అధిపతి ఎస్.పి. త్యాగి తదితరులకు భారీ మొత్తంలో లంచాలు ముట్టజెప్పారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే.. ఈలోపు బుధవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీల మధ్య కుదిరిన సమావేశం అనంతరం ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, మొత్తం 12 హెలికాప్టర్లకు గాను ఇప్పటికే మూడింటిని అగస్టా వెస్ట్‌లాండ్ సంస్థ భారత్‌కు పంపేసింది. ఇప్పుడు ఈ కంపెనీతో ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని భారత్ నిర్ణయించుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.