warangal bypoll
-
'ఓట్లు వేయకుంటే కళ్లు పోతాయా?'
హన్మకొండ(వరంగల్ జిల్లా): వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఓట్లు వేయకపోతే కళ్లు పోతాయని కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అగర్వాల్‌తో కలిసి హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. శాపనార్థాలకు ఓటర్లు భయపడరని, ఓట్లు పడవని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేస్తే రాష్ట్ర మంత్రులంతా వరంగల్‌లోనే ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు, హామీలు అమలు చేయకుండా కళ్లు పోతాయనడం మూర్ఖత్వం, దుర్మార్గమని మండిపడ్డారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను బెదిరిస్తున్నారని, ఆ సంఘాలను తీసేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. చివరి వరకు పత్తి కొనుగోలు చేస్తే రాజీనామా చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అంటున్నారని.. ఆయనకు పత్తి కోనుగొలు అధికారం లేనప్పుడు రాజీనామా చేయడమెందుకని ప్రశ్నించారు. పత్తి కొనుగోలుకు నయా పైసా ఖర్చు చేయకుండా ఆర్థిక మంత్రిని బలి చేయడం బాగుండదని, అధికారమంతా కేసీఆర్ వద్దే కేంద్రీకృతమై ఉందని అన్నారు. మహారాష్ట్రలో లాగా సీసీఐకి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, చేతగాకపోతే తామే చేస్తామని అన్నారు. పత్తి రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. -
విచ్చలవిడిగా డబ్బు పంపకం!
-
వరంగల్‌లో విచ్చలవిడిగా డబ్బు పంపకం!
వరంగల్: వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపకం కొనసాగుతున్నది. తాజాగా సోమవారం వరంగల్‌లోని దేవరుప్పలలో విచ్చలవిడిగా డబ్బు పంచుతూ టీడీపీ-బీజేపీ నేతలు మీడియా కెమెరాకు చిక్కారు. జనసమీకరణ కోసం ఆ రెండు పార్టీల నేతలు డబ్బులు పంచుతున్న దృశ్యాలను 'సాక్షి' కెమెరాలో బంధించింది. వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి దేవయ్య బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమితో నిరుత్సాహంగా ఉన్న బీజేపీ వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు భారీగా డబ్బులు పంచుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ-టీడీపీ నేతలు దేవరుప్పల్‌లో బహిరంగంగానే డబ్బులు పంచుతూ కనిపించారు. -
బాబు, కేసీఆర్ తోడు దొంగలు: రోజా
వరంగల్: వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ మాటల మాంత్రికుడు, చంద్రబాబు మూటల మాంత్రికుడు అని విమర్శించారు. సోమవారం ధర్మసాగర్లో ఎన్నికల రోడ్ షో నిర్వహించిన రోజా మాట్లాడుతూ చంద్రబాబు, కేసీఆర్ తోడు దొంగలని, రైతులకు వారు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ కరువు దుర్భిక్షమే తాండవిస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్ అహంకారం వల్ల వరంగల్ ఉప ఎన్నిక వచ్చిందని, ఉప ఎన్నిక పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా దుయ్యబట్టారు. -
'వైఎస్ జగన్ ప్రభంజనంతో గెలిచి తీరుతాం'
-
'వైఎస్ జగన్ ప్రభంజనంతో గెలిచి తీరుతాం'
హైదరాబాద్: వరంగల్ ఎంపీ స్థానం అక్కడి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కట్టబెడతారని వైఎస్ఆర్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ప్రభంజనం ముందు ఏ పార్టీ నిలవలేదని చెప్పారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేం చేశాడో ప్రజలందరికీ తెలుసని, అందుకే ఆయనకు రెండుసార్లు ముఖ్యమంత్రి పట్టంకట్టారని చెప్పారు. వైఎస్ఆర్ పేదల, మైనార్టీలకోసం పనిచేసిన మహామనిషి అని ఆయన తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా చాలా చెత్తగా పరిపాలన చేశారని చెప్పారు. అందుకే వైఎస్ఆర్ మాదిరిగానే ఆయన కుమారుడు, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 16, 17,18,19 తేదీల్లో వరంగల్ ఎంపీ స్థానంలో ఉన్న ప్రతి సెగ్మెంట్లలో జరిగే ప్రచారంలో పాల్గొని ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రచారంతో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ సీపీ తరుపున నల్లా సూర్యప్రకాశ్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. -
'రేసు'గుర్రం ఎవరు?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ప్రతిష్టాత్మక వరంగల్ ఉపపోరుపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. వరంగల్ ఎంపీ స్థానానికి ప్రధాన పొలిటికల్ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రిగా బాధ్యలు చేపట్టడంతో వరంగల్ లోక్ సభ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో 'సూటబుల్ కేండిడేట్' కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ జల్లెడ పడుతున్నాయి. ఎస్సీకి రిజర్వు అయిన ఈ స్థానంలో ఉప పోరుకు ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ తరపున పెద్దపల్లి మాజీ ఎంపీ జి. వివేకానంద పేరు ప్రముఖంగా వినబడుతోంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరిన వివేక్ తర్వాత మనసు మార్చుకుని మళ్లీ సొంతగూటికి వచ్చారు. వరంగల్ ఉప ఎన్నిక ద్వారా ఆయన సొంత జిల్లాకు వచ్చే అవకాశముందని అంటున్నారు. గత ఎన్నికల్లో కడియం శ్రీహరి చేతిలో ఓటమి పాలయిన కాంగ్రెస్ సిరిసిల్ల రాజయ్య కూడా మరోసారి పోటీకి సై అంటున్నారు. 'అధిష్టానమ్మ' భక్తుడు సర్వే సత్యనారాయణ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. వరంగల్ టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలను సొమ్ము చేసుకోవాలని టీడీపీ-బీజేపీ కూటమి భావిస్తోంది. బలమైన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఓరుగల్లులో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిని నిలబెట్టారు. ఈసారి కూడా కమలం పార్టీ కేండిడేట్ బరిలో దిగే అవకాశముంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన నేపథ్యంలో ఉపపోరును 'రెఫరెండం'గా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఓయూ భూముల వివాదం, ప్రజాసంఘాల ఐక్యతతో కలవరపడుతున్న అధికార పార్టీ ఉపపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా తమ సీటును నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ పట్టుదలతో పావులు కదుపుతోంది. దీటైన అభ్యర్థిని నిలిపి 'పోరుగడ్డ'పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. కేసీఆర్ అవకాశమిస్తే వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో రేసుగుర్రాన్ని తానే అవుతానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి రేసులోకి దూసుకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన రవి మనసులోని మాట బయటపెట్టడంతో రేసు రసవత్తరంగా మారనుంది. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రేసులో ఇంకెవరి పేర్లు తెరపైకి వస్తాయో చూడాలి. కాగా, ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత వారం రోజుల్లో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కడియం శ్రీహరి ప్రకటించారు.