మనోహరం.. నేత్రపర్వం
గాయత్రీదేవిగా వర్గల్ విద్యాధరి సాక్షాత్కారం
అమ్మవారి సేవలో కేంద్రమంత్రి దత్తాత్రేయ
వర్గల్: సకల శక్తి స్వరూపిణి శ్రీవిద్యా సరస్వతి వెలసిన వర్గల్ క్షేత్రంలో శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు భక్తిరసం పంచుతున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజైన ఆదివారం అమ్మవారు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆయనకు ఆలయ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
కొండపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని, పూజలు జరిపించారు. అమ్మవారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు. ఉదయం ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి, వేదపండితులు అనంతగిరిశర్మ, బాల ఉమామహేశ్వర శర్మ, శశిధర శర్మ, ప్రవీణ్శర్మ నేతృత్వంలో తెల్లవారుజామున గణపతి పూజతో రెండోరోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
అనంతరం అమ్మవారి మూలవిరాట్టుకు స్తోత్ర నామార్చనలతో పంచామృత అభిషేకం జరిపారు. అమ్మవారికి అలంకారసేవ నిర్వహించారు. పూలమాలలు, పట్టు వస్త్రాలు, సర్వాభరణాలతో అమ్మవారిని గాయత్రీ దేవీగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు.
తొగుట పీఠాధిపతికి పూర్ణకుంభ స్వాగతం
విద్యాధరి క్షేత్రాన్ని తొగుట పీఠాధిపతి మాధవానందస్వామి ఆదివారం సందర్శించారు. ఆయనకు ఆలయ వర్గాలు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం సభా ప్రాంగణం చేరుకున్నారు. అదే వేదికపై ఆలయం తరఫున కేంద్రమంత్రి దత్తాత్రేయకు జ్ఞాపిక అందజేశారు.
యోగా గురువు మధునాల శ్రీనివాస్ రచించిన ‘అలసిన మనసుకు అమృతం యోగామృతం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణం, అభివృద్ధిలో కృషి చేసిన భక్తులను రజతోత్సవ పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మర్పడగ క్షేత్రం వ్యవస్థాపకులు డాక్టర్ చెప్పెల హరినాథ్శర్మ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతే గొప్పది: మంత్రి దత్తాత్రేయ
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమంలో మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ... భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే గొప్పదన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్నారు. వర్గల్ క్షేత్రం తెలంగాణలోనే ఒక ప్రముఖ స్థానం సాధించనుందన్నారు. అమ్మవారిని దర్శించుకున్న తాను దేశానికి, కార్మికులకు సేవ చేసేలా ఆశీస్సులు అందజేయాలని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు.
నేడు అన్నపూర్ణాదేవిగా ..
విద్యాధరి మాత ఉత్సవాల్లో మూడోరోజు సోమవారం వర్గల్ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.