ఉక్కు మనిషి కాదు.. మైనపు బొమ్మ
సందర్భం
గమనించారా, ప్రధాని నరేం ద్రమోదిలో ఏదో మార్పు కని పిస్తోంది. కొన్ని ఉదాహర ణలు. ఇంతకుముందు ఆయ న విదేశీ గడ్డమీద నిలబడి ప్రతిపక్షాల మీద పదునైన వ్యంగ్యోక్తులు సంధించేవారు. ఇది మనకు కొత్త అనుభవం కనుక, సహజంగానే ఆక్షేప ణలు వెల్లువెత్తాయి. అయినా ఆయన పట్టించుకోలేదు. కానీ, తన తాజా విదేశీ పర్యటనల్లో ఆయన ఇలాంటి విమర్శలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. రెండో ఉదాహరణ... పార్లమెంటరీ వ్యవహారాల్లో ప్రతిష్టంభన దృష్ట్యా మోదీ చొరవ తీసుకుని ప్రతిపక్ష నేతలతో ఎందుకు మాట్లాడరన్న విమర్శ చాలా మాసాలుగా ఉన్నప్పటికీ, మోదీ అందుకు సిద్ధపడలేదు. కానీ ఇప్పు డాయన జీఎస్టీ (వస్తు సేవల పన్ను) బిల్లుపై మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో మాట్లాడారు!
మూడో ఉదాహరణ మరింత ఆసక్తికరం. గుజరాత్ సీఎంగా ఉన్న పన్నెండేళ్లలోనూ, ప్రధానిగా ఉన్న గత 18 మాసాల్లోనూ మోదీ మీడియాతో దూరం పాటిస్తూ వచ్చారు. ప్రధాని విదేశీ పర్యటనల్లో మీడియా కూడా భాగమయ్యే ఆనవాయితీని మోదీ పాటించక పోవ డమూ, మీడియాకు సమాచారం అందించకుండా ఆయా మంత్రిత్వ శాఖలపై అప్రకటిత నిషేధాన్ని విధిం చారన్న ఆరోపణా మొదట్లోనే చర్చకు వచ్చాయి. అలాం టింది.. ఆయన ఇటీవల మొదటిసారిగా జాతీయ మీడి యాతో సమావేశమై, ఫొటోలు దిగడం ఆశ్చర్యాన్నీ, ఆసక్తినీ కూడా కలిగించింది.
ఈ ఉదాహరణలు కొంతవరకూ మోదీని మారిన మనిషిగా చూపిస్త్తున్నాయి. విదేశాలలో ఒక పార్టీ ప్రతి నిధిగా కాక దేశ ప్రతినిధిగా ప్రధాని పాటించవలసిన మర్యాదలను గుర్తించడం; అహం విడిచి ప్రతిపక్ష నేత లతో, మీడియాతో సమావేశం కావడం నిస్సందేహంగా సంతోషించవలసినవే. అయితే, ఇంత వైవిధ్యవంతమైన దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి, కేవలం ఒక్క రాష్ర్టంలోని ఎన్నికల ఫలితాలే గీటురాయిగా తన నడకను మార్చు కున్నట్టు కనిపించడం ఎంతైనా నిరాశ కలిగిస్త్తుంది. తను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కానీ, ప్రధానిగా ఉన్న ఈ పదహారు మాసాల్లో కానీ తన ప్రభుత్వంపై వచ్చిన విమర్శలు ఆయనలో మార్పు తీసుకురాలేదు.
మతతత్వ పూరితమైన అసహనం పెద్ద ఎత్తున పడగవిప్పి భిన్న భావజాలం కలిగిన వ్యక్తులను కాటేసి చంపుతున్నా ఆయనలో మార్పు కనిపించలేదు. కవులు, రచయితలు, కళాకారులు, చరిత్రకారులు సహా ఎందరో ఈ అసహ నాన్ని ఎత్తి చూపుతూ అవార్డు వాపసీ వంటి తీవ్ర చర్యకు పూనుకున్నా ఆయనలో మార్పు రాలేదు. వారి నిరసనను కృత్రిమ నిర్మాణంగా తీసిపారేస్తూ పార్టీ శ్రేణులు ఈ దేశపు సామూహిక అంతశ్చేతనను మొరటు మాటలతో కుళ్లబొడుస్త్తున్నా ఆయన మాట్లాడలేదు. అలాంటిది, వక్రించిన ఒకే ఒక్క ఎన్నికల ఫలితం ఆయ నలో కలవరపాటు కలిగించి మార్పు తీసుకురావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?!
ఇన్నేళ్లుగా అభిమానులకు ఉక్కుమనిషిగా, ఇతరు లకు రాతిబొమ్మగా కనిపించిన నరేంద్రమోదీ గత 18 మాసాల ప్రధాని హోదాలో ఒక మైనపు బొమ్మలా కనిపి స్తున్నారు. మామూలుగా అయితే విమర్శల పిడుగులు పడినా ఆయన చలించరు. కానీ రాజకీయంగా పరిస్థితి తమకు ప్రతికూలంగా ఉందని అనిపించినప్పుడు కాస్త లొంగుబాటు ప్రదర్శిస్తుంటారు. ఉదాహరణకు, దాద్రీ హత్య మీద ప్రధాని నోరు విప్పరేమని ప్రతిపక్షాలూ, మీడియా రోజుల తరబడి నిలదీస్తున్నా ఆయన మౌనం పాటించారు. కానీ 15 రోజుల తర్వాత, బిహార్లో ఒక ఎన్నికల ర్యాలీలో పరోక్షంగా దానిని ప్రస్తావించి ఊరు కున్నారు. తన మౌనం ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేస్తుందన్న భయమే అందుకు కారణం.
ఇక్కడ కుంగదీసే విషాదం ఏమిటంటే; ఈ దేశ ప్రధానికి ఎన్నికల విజయాలు తప్ప మరే విలువలూ పట్టవని రోజురోజుకూ రుజువు కావడం. ఈ దేశ మౌలిక స్వభావమూ, తాత్వికతా ఎలాంటివో ప్రధాని అయ్యే దాకా ఆయనకు తెలియకపోవడం. గుజరాత్లో తన ఏకచ్ఛత్రాధిపత్యంలో వైవిధ్యవంతమైన ఈ దేశపు రాజ కీయ వ్యాకరణాన్ని నేర్చుకోవలసిన అవసరం ఆయనకు రాలేదు. ఇప్పుడిప్పుడే ఆ అవసరాన్ని గుర్తిస్తున్న అప్రెంటిస్ ప్రధానిగానే ఆయన రూపుగడుతున్నారు. ఇలా ఈ గుజరాత్ ఉక్కు బొమ్మ కాస్తా జాతీయ వేదిక మీదికి వచ్చేసరికి, తప్పనిసరి ఒత్తిడులకు తలవంచే మైనపు బొమ్మ కావడం ఏం చెబుతుంది? అయితే, మోదీ వ్యవహారశైలికి సంబంధించిన వేళ్లు ఆయనను తీర్చిదిద్దిన భావజాలంలో బలంగా నాటుకుని ఉన్నాయి కనుక, ఆయనలో ఇప్పుడు కనిపిస్తున్న మార్పు కేవలం పైపూత కావచ్చు.
విశేషమేమిటంటే, ఆయన ఆ పైపూతను ఆశ్రయిం చడంలోనే భారతదేశం మొత్తం గర్వించవలసిన లోతైన అంతస్సత్యం ఉంది. నాకు అరవై మాసాలు అధికారమి వ్వండి, దేశం రూపురేఖలే మార్చేస్తానని మోదీ ఎన్నికల ముందు చెప్పుకున్నారు. కానీ, దేశం తన స్వాభావిక మైన ఉనికిని ఉద్యమస్థాయిలో చాటుకుంటూ, మోదీని మార్చడానికి తనకు 18 మాసాలే చాలని నిరూపించు కుంది. ఆవిధంగా మోదీ పెనుగులాట రాజకీయ ప్రత్యర్థులతో కాదు; భారతదేశం అనే ఒక మౌలిక వాస్తవంతో! 2014 ఎన్నికల్లో మోదీ అద్భుత విజయం సాధించిన మాట నిజమే. కానీ ఇప్పుడు భారతదేశం ప్రతిరోజు, ప్రతి క్షణం మోదీ అనే ఉక్కు బొమ్మను మైనపు ముద్దగా మార్చుతూ తన అఖండ విజయాన్ని అప్రతిహతంగా స్థాపించుకుంటోంది!
- కల్లూరి భాస్కరం
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు. 9703445985