weightlifters
-
థాయ్‌లాండ్ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యపై వేటు
బుడాపెస్ట్: నిర్ణీత సంఖ్యలో కంటే ఎక్కువగా వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోవడంతో... థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలపై అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) వేటు వేసింది. దాంతో ఈ రెండు దేశాల లిఫ్టర్లు వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు దూరం కానున్నారు. థాయ్‌లాండ్‌పై మూడేళ్ల నిషేధం విధించడంతోపాటు 2 లక్షల డాలర్ల జరిమానా వేశామని... మలేసియాపై ఏడాదికాలం నిషేధం విధించామని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. గత బుధవారం నిషేధానికి సంబంధించిన సమాచారం థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలకు ఇచ్చామని, నిషేధంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీల్ చేసుకునేందుకు 21 రోజుల గడువు ఉందని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. 2018 ప్రపంచ చాంపియన్ షిప్లో థాయ్‌లాండ్‌కు చెందిన తొమ్మిది మంది లిఫ్టర్లు డోపింగ్‌లో పట్టుబడ్డారు. -
గెలి‘చాను’...
భారత ఆశల పల్లకిని మోస్తూ కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టర్లు మరోసారి మెరిశారు. పోటీల రెండో రోజు ఒక స్వర్ణం, ఒక కాంస్యం అందించారు. పతకాల పట్టికలో భారత్‌ను ఐదో స్థానానికి చేర్చారు. ఇప్పటివరకు నాలుగు పతకాలు రాగా... అన్నీ వెయిట్ లిఫ్టింగ్లోనే కావడం విశేషం. గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు రెండో రోజూ స్వర్ణ సంబరం... వెయిట్ లిఫ్టింగ్‌లో, అందులోనూ మహిళల విభాగంలో మరో బంగారు పతకం... తొలి రోజు మీరాబాయి చాను అందించిన స్ఫూర్తితో, శుక్రవారం 53 కేజీల విభాగంలో సంజిత చాను స్వర్ణాన్ని ఒడిసి పట్టింది. ఈ క్రమంలో ఆమె స్నాచ్ రికార్డును బద్దలు కొట్టింది. మరోవైపు పురుషుల 69 కేజీల విభాగంలో 18 ఏళ్ల దీపక్ లాథర్ కాంస్యం నెగ్గి, కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన తొలి భారత లిఫ్టర్‌గా రికార్డులకెక్కాడు. సం‘జీత్’గయీ... గ్లాస్గోలో జరిగిన గత క్రీడల్లో 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన సంజిత చాను ఈసారి అంతకంటే బరువైన విభాగంలోనూ మెరిసింది. వెన్నునొప్పి ఇబ్బంది పెడుతున్నా ఈ మణిపూర్ లిఫ్టర్ అద్భుత ప్రదర్శన చేసింది. స్వర్ణం నెగ్గే క్రమంలో సంజిత మొత్తం (స్నాచ్‌లో 84+క్లీన్ అండ్ జెర్క్‌లో 108) 192 కేజీల బరువునెత్తింది. లొవా దికా టొవా (182 కేజీలు–పపువా న్యూ గినియా) రజతం... రచెల్ (181 కేజీలు–కెనడా) కాంస్యం గెలిచారు. మహిళల 58 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ సరస్వతి రౌత్ నిరాశ పరిచింది. ఆమె మూడు ప్రయత్నాల్లో విఫలమైంది. మరోవైపు సమీప ప్రత్యర్థి వైపవా అయోనే (సమోవా) క్లీన్ అండ్ జర్క్‌లో రెండుసార్లు ఫౌల్స్ చేయడంతో అదృష్టం కలిసివచ్చిన దీపక్ కాంస్యం అందుకోగలిగాడు. అతడు మొత్తం 295 కేజీల (స్నాచ్‌లో 136+క్లీన్ అండ్ జెర్క్‌లో 159) బరువెత్తాడు. ఉద్వేగంతో కంటతడి... సంజీత గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్ సందర్భంగా వెన్నునొప్పికి గురైంది. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఆమెను పోటీలకు పంపడంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీంతో విమర్శకులకు జవాబివ్వాలనే పట్టుదలతో బరిలో దిగింది. శుక్రవారం కూడా కొంత ఇబ్బంది పడినా... లక్ష్యం అందుకుంది. వీటన్నిటినీ తలచుకుని ఆమె పతకాల ప్రదానం సందర్భంగా ఉద్వేగానికి గురై కంటతడి పెట్టింది. దీపక్... అదృష్టం తోడై దీపక్ మొదట స్విమ్మర్‌గా సైనిక క్రీడా శిక్షణ సంస్థలో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అయితే... ‘హరియాణా వారి శరీరాలకు స్విమ్మింగ్ సరైన క్రీడ కాదు. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగే మీకు తగినవి’ అన్న కోచ్‌ల మాటతో తన క్రీడాంశాన్ని మార్చుకున్నాడు. ఇప్పటికే అతి చిన్న వయసు (15)లో వెయిట్ లిఫ్టింగ్ 62 కేజీల విభాగంలో జాతీయ రికార్డు నెలకొల్పిన దీపక్... తొలిసారి పాల్గొంటున్న కామన్వెల్త్ క్రీడల్లోనే పతకం అందుకుకున్నాడు. పోటీ సందర్భంగా ‘అయోనే విఫలం కావాలని నేను కోరుకున్నా. అదే జరిగింది’ అంటూ పేర్కొన్న అతడు... పతకం అందుకుంటుండగా నమ్మలేనంత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇతర క్రీడాంశాల్లో భారత ప్రదర్శన... బ్యాడ్మింటన్: మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. స్కాట్లాండ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో గెలిచి గ్రూప్ ‘టాపర్’గా నిలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో మారిషస్‌తో భారత్ తలపడుతుంది. బాక్సింగ్: పురుషుల 91 కేజీల విభాగంలో నమన్ తన్వర్ 5–0తో హరూనా మహాండో (టాంజానియా)పై; 48 కేజీల విభాగంలో అమిత్ 5–0తో సులేమాను (ఘనా)పై గెలిచారు. మహిళల హాకీ: మలేసియాతో జరిగిన పూల్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1తో నెగ్గింది. స్క్వాష్: మహిళల సింగిల్స్‌లో జోష్నా చినప్ప క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా... దీపిక పళ్లికల్ రెండో రౌండ్లో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హరీందర్, విక్రమ్ రెండో రౌండ్లో ఓటమి చెందారు. జిమ్నాస్టిక్స్: మహిళల ‘వాల్ట్’ ఈవెంట్లో ప్రణతి నాయక్... ఆల్ అరౌండ్ విభాగంలో ప్రణతి దాస్ ఫైనల్‌కు చేరారు. ఇటీవలే ప్రపంచకప్‌లో వాల్ట్ ఈవెంట్లో కాంస్య పతకం గెలిచిన తెలంగాణ జిమ్నాస్ట్ అరుణా రెడ్డి ఏ ఈవెంట్లోనూ ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. -
అవును.. ఆ 21 మంది డోపింగ్‌కు పాల్పడ్డారు
వర్తమాన క్రీడారంగంలో భారీ డోపింగ్ కుంభకోణమిది! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 21 మంది వెయిట్ లిఫ్టర్లు డోపింగ్ టెస్టులో దోషులుగా తేలారు. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ గతంలోనే వీరిని సస్పండ్ చేసింది. 'బి శాంపిల్ టెస్ట్'లోనూ ఇదే ఫలితం వెల్లడయితే గనుక 21 మంది వెయిట్ లిఫ్టర్లు ఏకంగా నాలుగేళ్లపాటు నిషేధానికి గురయ్యే అవకాశం ఉంటుంది. లిఫ్టర్లు డోపింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు లభించాయని, అయితే మరో పరీక్ష అనంతరం క్రీడాకారుల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ సహదేవ్ యాదవ్ శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 2006 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ గీతా రాణి, నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో మెడల్స్ సాధించిన సిమ్రన్ ప్రీత్ కౌర్, అమృతపాల్ సింగ్, అక్షర్‌దీప్ కౌర్, హర్జీత్ కౌర్, మగ్తే కోమ్, కోమల్ వాకలే తదితరులు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడినవారిలో ఉన్నారు. -
ఒకే రోజు భారత్‌కు 36 పతకాలు
న్యూఢిల్లీ: భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండించారు. మలేసియాలో జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత లిఫ్టర్లు ఏకంగా 36 పతకాలు గెల్చుకున్నారు. యూత్, జూనియర్, సీనియర్ విభాగాలలో ఈ పతకాలు వచ్చాయి. ఇందులో 19 స్వర్ణాలు, 11 రజతాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. సీనియర్ పురుషుల విభాగంలో సుఖెన్ డే (56 కేజీలు).... సీనియర్ మహిళల విభాగంలో మీరాబాయి చాను (48 కేజీలు) మూడేసి స్వర్ణాలు సొంతం చేసుకున్నారు. యూత్ బాలుర విభాగంలో టీబీసీ లాల్చన్హిమా (56 కేజీలు), లాలూ టాకూ (62 కేజీలు) మూడేసి పసిడి పతకాలు నెగ్గారు. యూత్ బాలికల విభాగలో చంద్రిక తరఫ్దార్ (44 కేజీలు), మోనాలిసా సోమోవాల్ (48 కేజీలు) కూడా మూడేసి బంగారు పతకాలు సాధించారు. భారత్ నుంచి సీనియర్, జూనియర్ విభాగాలలో 15 మంది చొప్పున, యూత్ విభాగంలో 11 మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.