Where Is The Venkatalakshmi
-
‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ మూవీ రివ్యూ
టైటిల్ : వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ జానర్ : కామెడీ హారర్ తారాగణం : రాయ్ లక్ష్మీ, రామ్ కార్తీక్, పూజితా పొన్నాడ, ప్రవీణ్, మధు నందన్ సంగీతం : హరీ గౌర దర్శకత్వం : కిశోర్ నిర్మాత : శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి టాలీవుడ్‌కు వరుస సక్సెస్‌లు అందించిన సూపర్ హిట్ జానర్ కామెడీ హారర్. ఒకప్పుడు ఈ జానర్లో తెరకెక్కిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలు సాధించాయి. అయితే ఇటీవల టాలీవుడ్లో ఈ తరహా సినిమాల హడావిడి కాస్త తగ్గింది. కొంత గ్యాప్ తరువాత ఇదే జానర్లో మరోసారి వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వెంకటలక్ష్మీ ప్రేక్షకులను ఏమేరకు నవ్వించింది..? ఎంత వరకు భయపెట్టింది..? కథ : చంటిగాడు (ప్రవీణ్), పండుగాడు (మధు నందన్) బెల్లంపల్లి అనే ఊళ్లో పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాళ్లు. ఊళ్లో జనాలను ఇబ్బంది పెడుతూ ఆనందపడే చంటి , పండు.. ఒక్క శేఖర్ (రామ్ కార్తీక్) మాట మాత్రం వింటారు. వాళ్లకు ఏ సమస్య వచ్చిన శేఖరే కాపాడుతుంటాడు. కానీ శేఖర్, గౌరీ(పూజితా పొన్నాడ)ల ప్రేమ విషయంలో చంటి, పండు చేసిన పని కారణంగా శేఖర్ కూడా వారిని అసహ్యించుకుంటాడు. అదే సమయంలో బెల్లంపల్లి ఊరికి స్కూల్ టీజర్‌గా వెంకటలక్ష్మి( రాయ్ లక్ష్మీ) వస్తుంది. బస్ దిగగానే సాయం చేయమని చంటి, పండులను అడుగుతుంది. ఆమె అందంపై ఆశపడ్డ చంటి, పండు వెంకటలక్ష్మికి వసతి ఏర్పాటు చేయటంతో పాటు అన్ని దగ్గరుండి చూసుకుంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు వెంకటలక్ష్మీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే సరికి వెంకటలక్ష్మి మనిషి కాదు దెయ్యం అని తెలుస్తుంది. అసలు దెయ్యంగా వచ్చిన వెంకటలక్ష్మీ ఎవరు..? వెంకటలక్ష్మి.. చంటి, పండులకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? ఈ కథతో నాగంపేట వీరారెడ్డి(పంకజ్ కేసరి)కి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ. నటీనటులు : ప్రధాన పాత్రలో నటించిన రాయ్ లక్ష్మి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. భయపెట్టే సన్నివేశాలతో పాటు గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. ప్రవీణ్, మధునందన్‌లు తమ పరిధి మేరకు బాగానే నటించారు. అయితే పూర్తిస్థాయిలో తమ కామెడీ టైమింగ్‌ను చూపించే అవకాశం మాత్రం దక్కలేదు. హీరో రామ్ కార్తీక్ మంచి నటన కనబరిచాడు. పూజితా పొన్నాడ గ్లామర్ షోలో రాయ్ లక్ష్మితో పోటీ పడింది. ఇతర పాత్రల్లో అన్నపూర్ణ, మహేష్, బ్రహ్మాజీ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఇంట్రస్టింగ్ పాయింట్ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు కిశోర్, తరువాత అదే స్థాయిలో కథను నడిపించలేకపోయాడు. కామెడీ హారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, హారర్ రెండూ వర్క్ అవుట్ కాలేదు. ఎక్కువగా అడల్ట్ కామెడీ మీద దృష్టి పెట్టి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన దర్శకుడు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు పూర్తిగా దూరమయ్యాడు. కథా కథనాలు కూడా ఆసక్తికరంగా సాగకపోవటం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. వెంకటలక్ష్మి దెయ్యం అని రివీల్ అయిన తరువాత కథ ఆసక్తికరంగా మారుతుందని భావించిన ప్రేక్షకుడిని మరింత నిరాశకు గురిచేశాడు దర్శకుడు. భయపెట్టే సన్నివేశాలకు స్కోప్ ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. ద్వితీయార్థం కూడా సాదాసీదా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. క్లైమాక్స్ మరీ నాటకీయంగా ముగియటం ఆడియన్స్‌కు రుచించటం కష్టమే. సినిమాలో కాస్త పాజిటివ్‌గా అనిపించే అంశం హరి గౌర సంగీతం. రెండు పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రాయ్ లక్ష్మి సంగీతం మైనస్ పాయింట్స్ : కథా కథనం దర్శకత్వం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అన్ని సమస్యలూ ఎదుర్కొన్నా
‘‘ఒక కొత్త నిర్మాత ఎదుర్కొన్న అన్ని సమస్యలను నేనూ ఎదుర్కొన్నాను. వీటన్నింటినీ ఒక లెర్నింగ్ ప్రాసెస్‌గా భావించాను. అందరికీ వినోదం కావాలి. కానీ చాలామందికి సినిమాలంటే చిన్నచూపు’’ అన్నారు నిర్మాత ఎం. శ్రీధర్ రెడ్డి. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో కిశోర్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మాది అనంతపురం. ఇంజినీరింగ్ పూర్తి చేశాను. కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేశాను. సినిమాలపై ఆసక్తితో నిర్మాణరంగంలోకి వచ్చాను. చిన్నతనం నుంచే నిర్మాణరంగంపై ఆసక్తి ఉంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు గారు నాకు ప్రేరణ. సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా చేశా. లాభ నష్టాలను చూశాను. ఈ అనుభవంతో ఒక సినిమాను నిర్మించాలనుకుని ఈ సినిమా చేశాను. ముందు మూడున్నర కోట్ల బడ్జెట్ అనుకున్నాం. కానీ దాదాపు ఆరుకోట్లు అయ్యింది. అయితే అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రాయ్ లక్ష్మీకి మంచి క్రేజ్ ఉంది. అందరికీ నచ్చేలా ఉంటుంది ఈ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా మంచి ఎమోషన్ కూడా ఉంది. టీమ్ అందరూ బాగా సహకరించారు. హీరో హీరోయిన్లు బాగా నటించారు. మధునందన్, ప్రవీణ్‌ల పాత్రలు నవ్విస్తాయి. మరో నాలుగు ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. -
హీరోగా చేసినా నవ్వించాలి
‘‘ఊర్లో జులాయిగా తిరిగే పాత్రలు మావి. ఆ ఊరికి టీచర్‌గా వచ్చిన లక్ష్మీ రాయ్‌ని వెంటపడి ఆనందిస్తాం. ఆ తర్వాత మమ్మల్ని ఊరికి ఉపయోగపడేలా ఆమె ఎలా మారుస్తుంది? అన్నది కథ. హారర్ టచ్ ఉండే ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. సినిమాలో మా ఇద్దరి సీన్స్ ఎంత నవ్విస్తాయో లక్ష్మీరాయ్‌తో ఉన్న సీన్స్ ఇంకా బాగా నవ్విస్తాయి’’ అని ప్రవీణ్, మధు నందన్ అన్నారు. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరో, హీరోయిన్లుగా లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. ప్రవీణ్, మధు నందన్ వినోదాత్మక పాత్రల్లో నటించారు. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం. శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె. రెడ్డి నిర్మించారు. ఈ నెల 15న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రవీణ్, మధునందన్ మాట్లాడుతూ – ‘‘మేం సినిమాను అంగీకరించినప్పుడు లక్ష్మీరాయ్ లేరు. కథే ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. లక్ష్మీ రాయ్ ఆ ఊరికి ఎందుకు వచ్చింది? ఏం చేసింది అన్నది కథాంశం. మేం ఈ సినిమాను అంగీకరించడానికి కారణం కథ. మా పాత్రల ముగింపు. బయట మేం చాలా క్లోజ్‌ఫ్రెండ్స్. ఆ కెమిస్ట్రీ సినిమాలో మేం చేసే కామెడీలో కనిపిస్తుంటుంది. ఎమోషన్స్ చుట్టూ అల్లుకున్న కామెడీ కాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. ఓ కమెడియన్ హీరోగా చేస్తే.. సినిమాలో 90 శాతం నవ్వులే ఉండాలి. అప్పుడే సోలో హీరోగా నటించాలి. ఫైట్లు, డ్యాన్స్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే.. వాటికి పెద్ద హీరోలు ఎలాగూ ఉన్నారు కదా?’’ అన్నారు. -
రత్తాలు... నీ నవ్వులే రత్నాలు!
తెలుగు సినిమాలకు కాస్త దూరమైనా ‘ఐటమ్ సాంగ్స్’తో పలకరిస్తూనే ఉంది లక్ష్మీరాయ్...రాయ్‌లక్ష్మీ! తాజాగా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ గా పలకరించబోతున్న రాయ్‌లక్ష్మీ అంతరంగ తరంగాలు ఇవి... అలా అయ్యింది ఆలస్యం జూలీ–2 సినిమాకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల సౌత్ఫిలిమ్స్ ఎక్కుగా చేయలేదు. ఇదొక కారణమైతే ‘మూస స్క్రిప్ట్’లు మరోకారణం. ‘ఏదో నటించాలి కాబట్టి నటించాలి’ అనుకునే మనస్తత్వం కాదు నాది. కొత్తగా చేయాలని ఎప్పటికప్పుడు తపిస్తుంటాను. హీరో కంటే... ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల హవా నడుస్తోంది. హీరోయిన్లందరూ ఇలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నారు. ఇది మంచిదేగానీ దానికి ముందస్తుగా సన్నద్ధం కావాలి. ఎక్కువగా కష్టపడాలి. సినిమాను తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించాలి. ‘జూలీ–2’కు ఇలాగే చేశాను. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమాలో నాది ‘హీరో’ రోల్ కంటే ఎక్కువ! షాక్! జూలి–2 కోసం చాలా హోంవర్క్ చేశాను. షూట్ కోసం ప్రతి రెండు నెలలకు బరువు తగ్గడమో, పెరగడమో చేశాను. ఒకసారి 11 కిలోల బరువు తగ్గాను. వెంటనే ఏకంగా 17 కిలోల బరువు పెరిగాను. ఆ తరువాత ఫొటోషూటు కోసం 8కిలోల బరువు తగ్గాను. నేను భోజనప్రియురాలిని. నా బాడీకి బరువు తగ్గడం, పెరగడం అనేది ఒక షాక్‌లాంటిది. షూటింగ్లో కాలికి గాయమైంది. ఈ సమయంలోనే కాస్త డిప్రెషన్‌కు గురయ్యాను. చిన్న చిన్న విషయాలకు కోపం వచ్చేది. పేరెంట్స్, ఫ్రెండ్స్ సహకారం వల్ల మళ్లీ మూమూలు స్థితికి రాగలిగాను. రిగ్రెట్స్ ఇతర కమిట్మెంట్స్ వల్ల కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ‘నా వల్ల మీ సినిమా ఆలస్యం కావడం నాకు ఇష్టం లేదు. వేరే హీరోయిన్ను చూసుకోండి’ అని చెప్పేదాన్ని. నేను వదులుకున్న సినిమాలు హిట్ అయినప్పుడు మాత్రం ‘ఈ సినిమా నేను చేసి ఉంటే బాగుండేది కదా’ అనిపించేది. నా పేరు క్రిష్! చిన్నప్పుడు ఇంట్లో నా ముద్దుల పేరు క్రిష్. మా నాన్న నన్ను అబ్బాయిలాగే పెంచాడు. జుట్టు పెరగనిచ్చేవాడు కాదు. ఆటలు బాగా ఆడేదాన్ని. పదిహేను సంవత్సరాల వయసులో నా హైట్ చూసి... ‘వయసు కంటే ఎక్కువ హైట్ ఉంది. భవిష్యత్‌లో ఈ హైట్‌కి తగ్గ అబ్బాయిని చూడటం కష్టం’ అని ఆలోచించారు మా పేరెంట్స్! -
పచ్చి మామిడి.. పిచ్చి కామెంట్!
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరో, హీరోయిన్లుగా నటించారు. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం. శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె. రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను మార్చి 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ – ‘‘కామెడీ, హారర్, గ్లామర్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ చిత్రమిది. లక్ష్మీరాయ్ నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్ లభిస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, కథ, కథనం, మాటలు: తటవర్తి కిరణ్. ఏదిపడితే అది ఊహించుకోవద్దు ఒకవైపు ‘వేర్ ఈజ్ ది...’ ప్రమోషనల్ కార్యక్రమాలతో లక్ష్మీరాయ్ బిజీగా ఉంటే మరోవైపు ఆమె గర్భవతి అనే ప్రచారం జరుగుతోంది. ఇలా హీరోయిన్ల విషయంలో గాసిప్‌లు సృష్టిస్తుంటారు. చాలాసార్లు వాటిని విననట్లు వదిలేసినా, కొన్నిసార్లు ఘాటుగా స్పందించి వాటిని కొట్టిపారేస్తుంటారు. లక్ష్మీరాయ్ కూడా ఈ వార్త నిజం కాదన్నారు. ‘‘నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్టు స్టోరీలు రాసుకుంటారా? అంత నమ్మకంగా ఎలా న్యూస్ అల్లేస్తారు? అదేదో నన్నే అడిగి ఉంటే ఇంకా మంచి స్టోరీ ఇచ్చుండేదాన్ని కదా? ఏది పడితే అది ఊహించుకోవద్దు’’ అని ట్వీటర్లో రియాక్ట్ అయ్యారామె. ఇంతకీ ఈ గాసిప్ పుట్టడానికి కారణం ఏంటంటే... లక్ష్మీరాయ్ పచ్చి మామిడికాయ తింటూ కనిపించారట. -
వ్యూస్ కోసం అలా రాస్తారా : హీరోయిన్
తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో బిజీ ఉన్న నటి రాయ్ లక్ష్మీ. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్ రోల్స్ తో కెరీర్ లాగించేస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ తెలుగులో వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ సినిమాతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజా రాయ్ లక్ష్మీ సంబంధించిన ఓ వార్త వైరల్ కావటంతో ఆమె తీవ్రంగా స్పందించింది. ఓ తమిళ వెబ్ సైట్ రాయ్ లక్ష్మీ తల్లి కాబోతుందా అంటూ ఓ వార్తను ప్రచురించింది. ఈ వార్తపై స్పదించిన ఆమె.. కేవలం వ్యూస్ కోసం ఇలా ఆధారాలు లేకుండా ఏ వార్త అయినా రాసేస్తారా..? తప్పును కూడా ఇంత ధైర్యంగా ఎలా చేస్తారు? ఈ వార్త రాసిన వ్యక్తికి నేను అస్సలు ఇష్టం లేదనుకుంటా. ఇంతకన్నా మంచి కథలు కావాలంటే నన్ను అడగండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది రాయ్ లక్ష్మీ. ఈ భామ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మార్చి 15న ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’
గురునాథ రెడ్డి సమర్పణలో ఎ.బి.టి క్రియేషన్స్ బ్యానర్‌పై రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. ఈ సినిమాను కిషోర్ కుమార్ దర్శకత్వంలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి నిర్మిస్తున్నారు. రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ మూవీ మార్చి 15న సినిమా భారీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా... చిత్ర సమర్పకుడు గురునాథ రెడ్డి నిర్మాతలు ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి మాట్లాడుతూ ‘రాయ్‌లక్ష్మీగారు ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న మా వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మీ చిత్రాన్ని మార్చి 15న విడుదల చేస్తున్నాం. రాయ్ లక్ష్మీగారు నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అలాగే ప్రవీణ్, మధునందన్ పాత్రలు చాలా ఎంటర్టైనింగ్గా సాగుతాయి. అలాగే రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ పాత్రలు సినిమాకు కీలకంగా ఉంటాయి. కామెడీ, హారర్, గ్లామర్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ మూవీ ఇది. హరి గౌరగారు అందించిన పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఏమాయ చేసిందో ఏమంత్రం వేసిందో, అత్తిలిపాప పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై మంచి అంచనాలున్నాయి’ అన్నారు. -
అంతా మాయ.. సినిమాలు వద్దన్నారు – శ్రీధర్‌రెడ్డి
‘‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ చిత్రం మా యూనిట్‌కి స్పెషల్. ఎందుకంటే ఈ సినిమా కోసం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ఉంది. సినిమాలంటే ప్యాషన్ ఉండే నిర్మాతలు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో శ్రీధర్ రెడ్డి ఒకరు’’ అని రాయ్‌లక్ష్మీ అన్నారు. రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి నిర్మించారు. హరి గౌడ స్వరపరచిన ఈ సినిమా పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘కిషోర్ కథ చెప్పినప్పుడు ఎంత ఎగై్జట్ అయ్యామో సినిమా మేకింగ్‌లోనూ అంతే ఎగై్జట్ అయ్యాం’’ అన్నారు గుర్నాధరెడ్డి. ‘‘మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేదు. మంచి సినిమా చేద్దాం, నేను ముందుండి చూసుకుంటానని శ్రీధర్ రెడ్డి చెప్పడంతో సరే అని ఈ సినిమా తీశాం’’ అన్నారు ఆనంద్ రెడ్డి. ‘‘సినిమా ఇండస్ట్రీ అంతా మాయ.. వద్దు’ అని మాకు తెలిసినవాళ్లు చెప్పారు. కానీ ఇక్కడ మాకెలాంటి చెడు కనపడలేదు. మంచి కథతో చక్కని టీమ్‌తో పనిచేస్తే తప్పకుండా మంచి అవుట్‌పుట్ వస్తుందనడంలో సందేహం లేదు’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. ‘‘నాకు మంచి నిర్మాతలు దొరికారు’’ అన్నారు కిషోర్ కుమార్ చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర, రచయిత కిరణ్ పాల్గొన్నారు. -
‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ ఆడియో విడుదల
-
వాళ్ల మైండ్‌సెట్ మారుతుందనుకుంటున్నా
‘‘ఇప్పటివరకూ ఫ్యామిలీ, హారర్, థ్రిల్లర్ జోనర్లో సినిమాలు చేశా. చాలా రోజులుగా కామెడీ నేపథ్యంలో ఓ సినిమా చేయాలనుండేది. అది ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ చిత్రంతో తీరింది. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రమిది’’ అని రాయ్ లక్ష్మీఅన్నారు. ఈ సినిమాతో కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సమర్పణలో ఏబీటీ క్రియేషన్స్ పతాకంపై ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాయ్ లక్ష్మీ పంచుకున్న విశేషాలు... ► గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’. ఇందులో వెంకటలక్ష్మి అనే చిన్నపిల్లల టీచర్ పాత్ర చేశాను. కామెడీ, హ్యూమర్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. ఈ మధ్య కామెడీ సినిమాలు వస్తున్నాయి కానీ పూర్తి స్థాయిలో రావడం లేదు. మా సినిమాలో వినోదంతో పాటు సస్పెన్స్ ఉంటుంది. అమలాపురం వద్ద షూటింగ్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ► రచయిత తటవర్తి కిరణ్ ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ కథ చెప్పగానే ఎగై్జట్ అయ్యా. కిషోర్ కుమార్‌కి ఇది తొలి చిత్రమైనా ఎక్కడా అలా అనిపించకుండా తెరకెక్కించారు. నిర్మాతలకు ఇది తొలి సినిమా అయినా ఖర్చు విషయంలో రాజీ పడలేదు. హరి గౌర పాటలు బాగున్నాయి. ఇందులోని ‘పాపా.. నీకు ఏదంటే ఇష్టం...’ నా ఫేవరేట్ సాంగ్. ఈ సినిమాలో ఎక్కువగా చీరలోనే కనిపిస్తా. చీరలోనూ ఎంతో గ్లామరస్‌గా కనిపించొచ్చని సుస్మితాసేన్గారు నిరూపించారు. ► నేను తెలుగు సినిమాలు తగ్గించలేదు. ప్రస్తుతం తమిళ్లో బిజీగా ఉన్నానంతే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నా. నాది లీడ్ రోలా? స్పెషల్ సాంగా? అని ఆలోచించను. ఏదైనా నాకు ఓకే. ప్రత్యేక పాటలతోనూ నేను హ్యాపీ. బాలీవుడ్లో ప్రత్యేక పాట అంటారు.. టాలీవుడ్లో ఐటమ్ సాంగ్ అంటారు. ‘బలుపు’ సినిమా నుంచి ప్రత్యేక పాటల్లో నర్తిస్తున్నా. ‘సర్దార్ గబ్బర్‌సింగ్, ఖైదీనంబర్ 150’ చిత్రాల్లో చేసిన ప్రత్యేక పాటలు గుర్తింపు తీసుకొచ్చాయి. ► తెలుగులో నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎక్కడికెళ్లినా ‘రత్తాలు’ అని పిలుస్తున్నారు. లక్ష్మీరాయ్ కంటే రత్తాలుగా బాగా ఫేమస్ అయిపోయా. ‘రత్తాలు’ పాట తీసే ముందు రోజు చిరంజీవిగారితో పాట అని రాత్రి ఫోన్ చేసి చెప్పారు. పొద్దున్నే హైదరాబాద్‌లో వాలిపోయా. ఈ పాటకు ప్రాక్టీస్ కూడా చేయలేదు. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ► బాలీవుడ్‌లోనూ అవకాశాలొస్తున్నాయి. అయితే ‘జూలీ 2’ సినిమా జోనర్ సినిమాలే కావడంతో చేయడం లేదు. ప్రస్తుతం 3 తమిళ సినిమాలు, ఓ కన్నడ చిత్రంలో నటిస్తున్నా. చాలా రోజుల కిందట ఓ తెలుగు సినిమాకి సంతకం చేశా. ఇందులో నేను, అంజలి కలిసి నటిస్తాం. నా డేట్స్ లేకపోవడంతో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ సినిమా రిలీజ్ తర్వాత నన్ను అందరూ ‘పాప’ అంటారు. ఈ చిత్రంలో నా పాత్ర చూశాక ప్రత్యేక పాటలివ్వాలనే వారి మైండ్‌సెట్ మారుతుందను కుంటున్నా (నవ్వుతూ). ► ‘మీటూ’ ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. కొంత మంది ప్రతీకారం తీర్చు కోవడం కోసం, ప్రచారం కోసం మీడియా ముందుకు వచ్చారు. దాంతో ఆ ఉద్యమం అసలు లక్ష్యం నెరవేరలేదు. కొంతమంది వాళ్ల గళం విప్పిన విధానం మాత్రం అభినందనీయం. -
నీకేదంటే ఇష్టం
రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’. కిశోర్ కుమార్ దర్శకత్వం వహించారు. గురునాథ్‌రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్‌రెడ్డి, హెచ్. ఆనంద్‌రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ‘పాపా నీకేదంటే ఇష్టం’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రవీణ్, మధునందన్ల కామెడీ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. హరిగౌర మంచి సంగీతం అందించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
షూటింగ్ పూర్తి చేసుకున్న 'వెంకటలక్ష్మి'
హీరోయిన్గా ఓ మోస్తరు సినిమాలు చేస్తూ.. ఖైదీ నెంబర్150 సినిమాలోని రత్తాలు సాంగ్‌తో ఫేమస్ అయిపోయింది లక్ష్మీరాయ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రాయ్‌లక్ష్మీ సిద్దమవుతోంది. హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ ప్రకటించారు. ఈ మధ్యే ఈ మూవీ నుంచి విడుదల చేసిన 'పాపా నీకేదంటే ఇష్టం' పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగ, త్వరలో టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
స్పీడు పెంచిన ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ టీం
ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెరకెక్కుతున్న చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా నటిస్తున్నాడు. పూజిత పొన్నాడ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా రాయ్ లక్ష్మీపై తెరకెక్కించిన ఓ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పాపా అత్తిలి పాప అంటూ సాగే ఈ పాటలో రాయ్ లక్ష్మీతో పాటు హస్య నటులు ప్రవీణ్, మదునందన్ కూడా ఆడి పాడారు. హరి గౌర సంగీతమందించిన ఈ పాటకు సురేష్ బానిశెట్టి సాహిత్యమందివ్వగా మంగ్లీ, హరిగౌర ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు కిశోర్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
బోర్ కొట్టేసింది
‘‘ఒకే పనిని అదే పనిగా చేస్తే? బోర్ కొడుతుంది... కచ్చితంగా బోర్ కొడుతుంది. అది ఏ ఫీల్డ్‌లో అయినా సరే. కొత్తదన ం లేనప్పుడు పని రొటీన్ అయిపోతుంది. చేసే పనిలో కిక్కుండదు. నాక్కూడా నేను చేసిన పని బోర్ కొట్టేసింది’’ అంటున్నారు రాయ్‌లక్ష్మీ. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఆ మధ్య అన్నీ ఒకేలాంటి పాత్రలు, సినిమాలు చేశాను. దాంతో బోర్ అనిపించింది. చేసే ఏ పనైనా కొత్తగా ఉంటే నూతనోత్సాహం వస్తుంది. అందుకే నేను చేసిన తప్పులను సరిద్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలు, పాత్రలు ఎంచుకుంటున్నాను. తమిళంలో ‘నీయా’ అనే సినిమా చేస్తున్నా. అది పాములకు సంబంధించిన చిత్రం. ‘సిండ్రిల్లా’ అనే హారర్ ఎంటర్టైనర్తో పాటు ‘మిరుగా’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటిస్తున్నా. ఇందులో విధవరాలిగా చేస్తున్నాను. ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’లోనూ మంచి పాత్ర చేస్తున్నాను. ఇలా డిఫరెంట్ జానర్ సినిమాలు చేస్తుంటే నా పని నాకే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ ఫస్ట్ లుక్
ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెరకెక్కుతున్న చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా నటిస్తున్నాడు. పూజిత పొన్నాడ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను యంగ్ హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. రాయ్ లక్ష్మీ, పూజితా పోన్నాడలను రివీల్ చేస్తూ రూపొందించిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ డిజైన్లోనే సినిమా థ్రిల్లర్‌గా తెరకెక్కుతోందన్న విషయాన్ని రివీల్ చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో వెల్లడించనున్నారు. Best wishes to director @creatorkrish, ABT Creations, #Praveen,#Madhunandan, @iamlakshmirai and the entire team of #WhereIsTheVenkatalakshmi. Here is the first look.goodluck👍👍 pic.twitter.com/djfxlrI71Y — nithiin (@actor_nithiin) 4 November 2018