ప్రాణం తీసిన సరదా
కుంటాల (నేరడిగొండ), న్యూస్‌లైన్ : విహారయాత్ర ఆ యువకుడి పాలిట అంతిమయాత్రగా మారింది. కుంటాల జలపా తం సందర్శనకు వచ్చి స్నానం చేస్తూ నీటిగుండంలో గల్లంతయ్యాడు. బంధువులు కేకలు వేసేలోపే నీటమునిగి చనిపోయాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన నరపరాజు ఆదిత్య అలి యాస్ రోహన్(27) తన కుటుంబ సభ్యులు, బంధువులతో ప్రత్యేక వాహనంలో శనివారం కుంటాల జలపాతానికి వచ్చాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జలపాతం అందాలు వీక్షించారు. అనంతరం సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలోని ఓ కాలువ వద్దకు రోహన్ వెళ్లాడు. స్నానం చేస్తుండగా కాలుజారి పక్కనే ఉన్న నీటిగుండంలో పడిపోయూడు. కేకలు వేస్తూనే నీటిలో మునిగిపోయూడు. గమనించిన కుటుంబ సభ్యులు రక్షించాలని కేకలు వేశారు.
జలపాతం వద్ద ఉన్న జాలర్లు వెంటనే నీటి గుండంలో గాలించినా అతడి జాడ కనిపించలేదు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రోహన్ మృతదేహం నీటి గుండంలో తేలడంతో జాలర్లు బయటకుతీశారు. మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. వీరి రోదన సందర్శకులను కంటతడి పెట్టించింది. రోహన్ హైదరాబాద్‌లో ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఏఎస్సై ఈశ్వర్ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
సందర్శకుల్లో భయం..భయం..
స్నానం చేస్తూ ఓ యువకుడు కళ్లముందే నీటిలో మునిగి చనిపోవడంతో కుంటాల జలపాతం చూసేందుకు వచ్చిన వారంతా భయూందోళన కు గురయ్యూరు. అకస్మాత్తుగా సామగ్రి సర్దుకు ని తిరుగుపయనమయ్యూరు. రాష్ట్రంలోనే ఎత్తై జలపాతంగా పేరొందినా సరిపడా సిబ్బంది లేకపోవడం.. రక్షణ చర్యలు కొరవడడంతోనే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.