ముఖ్యమంత్రిపై రెట్ట వేసిన కాకి
బెంగళూరు: కర్నాటక సీఎం సిద్దరామయ్యను కాకి గోల విడిచిపెట్టడం లేదు. రాష్ట్రకవి మంజీశ్వర్ గోవింద్ పాయ్ ను స్మరిస్తూ కేరళలోని మంజీశ్వరంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్, కర్నాటక సీఎం సిద్దరామయ్య, లోక్ సభ సభ్యుడు వీరప్పమొయిలీలలతో పాటూ పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వక్తలు ప్రసంగిస్తుండగానే వేధిక పక్కనే ఉన్న ఓ చెట్టు పై నుంచి ఓ కాకి వచ్చి సిద్దరామయ్యపై రెట్టవేసి తిరిగి చెట్టుపైకి వెళ్లిపోయింది. దీంతో కంగుతిన్న సిద్ధరామయ్య దగ్గరకు మంగళూరు నగర నార్త్ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బవ వెంటనే వెళ్లి టిష్యుతో రెట్టని తుడిచారు. కాకి రెట్ట వేయడంతో తెల్లటి దోతి పాడవడంతో మాజీ మూడా(ఎంయూడీఏ) ఛైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నేత తేజోమయ కూడా వెంటనే సీఎం దగ్గరికి వెళ్లి ఆయన డ్రెస్ క్లీన్ చేశారు. పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే చెట్టు దగ్గరకు వెళ్లి కాకులను అక్కడి నుంచి తరిమివేశారు.
కాకులతో సిద్ధరామయ్యకు ఇదేమీ మొదటి సమస్యకాదు..అంతకు ముందు ఆయన వాడిన వాహనంపై కాకి వాలిందట. ఆ కాకి వాహనం బొనెట్ పైనే తిష్టవేసిందట. దాన్ని సిబ్బంది తరిమినా వెళ్లకుండా పది నిమిషాల పాటు కారు బోనెట్ పైనే ఉండిపోయిందట. కాగా ఈ సీన్‌ను ఎవరో రికార్డ్ చేశారు. అది అప్పుడు సిద్ధ రామయ్యకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పాత కారుపై కాకి వాలడం వల్లే సిద్ధ రామయ్య కారు మార్చారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ముఖ్యమంత్రికి జాతకాలపై నమ్మకమని... అందుకనే 35 లక్షలు ఖర్చు పెట్టి కొత్త కారు కొన్నారంటు ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎంగా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా జాతకాల పిచ్చితో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు రావడంతో సిద్ధరామయ్య వివరణ కూడా ఇచ్చారు. కారు మార్చేయాలని సిబ్బందికి తానే చెప్పానని అన్నారు. అయితే, ఆ కారు అప్పటికే 2 లక్షల కిలోమీటర్లు తిరిగేసిందని, అందువల్ల పాతది అయిపోయింది కాబట్టే దాన్ని మార్చాల్సిందిగా సూచించానని పేర్కొన్నారు. అంతేతప్ప తాను మూఢవిశ్వాసాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మనని ఆయన చెప్పాల్సి వచ్చింది.
(ఫైల్ ఫోటో)