withdraw support
-
బీజేపీ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకుంటాం!
ఇంఫాల్: వరుసగా పలు రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు తలెత్తడం.. ప్రధాన పార్టీల పొత్తులు మారిపోయి ప్రభుత్వాలే తలకిందులు కావడం చూస్తున్నాం. తాజాగా బీహార్‌లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పేసింది జనతాదల్ యునైటెడ్(జేడీ(యూ)) పార్టీ. దీంతో పూర్తి సంబంధాలు తెగిపోయినట్లేనని అంతా భావించారు. కానీ.. ఆశ్చర్యకర రీతిలో మణిపూర్‌లో మాత్రం బీజేపీ సర్కార్‌కు ఇంకా మద్దతు కొనసాగిస్తోంది ఆ పార్టీ. అయితే.. మణిపూర్‌లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి బయటకు రాబోతున్నట్లు ప్రకటించింది ఆ రాష్ట్రానికి చెందిన జేడీయూ యూనిట్. అంతేకాదు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు సైతం ఉపసంహరించుకోబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జేడీ(యూ) మణిపూర్ యూనిట్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌హెచ్ బీరెన్ సింగ్ ప్రకటన చేశారు. ‘‘మద్దతు ఉపసంహరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. కానీ, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి కావాల్సి ఉంది’’ అని బీరెన్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. అంతేకాదు సెప్టెంబర్ 3-4 తేదీల మధ్య పాట్నాలో జరగబోయే ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ మేరకు అగ్రనేతలతో సమావేశమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని, ఈ భేటీకి మణిపూర్ జేడీయూ ఎమ్మెల్యేలు సైతం హాజరవుతారని, సమావేశం అనంతరం అధికారికంగా ఒక ప్రకటన చేస్తామని తెలిపారు. క్లియరెన్స్ లేకనే.. ఇదిలా ఉంటే.. బీహార్ రాజకీయాల్లో భాగంగా జేడీ(యూ) ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత కేంద్రం నుంచి కూడా సంబంధాలు తెంచేసుకుంది. అయితే.. మణిపూర్‌లో ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వానికి మాత్రం మద్దతు కొనసాగుతూనే వస్తోంది. వాస్తవానికి ఆగస్టు 10వ తేదీనే మణిపూర్ జేడీయూ యూనిట్ తెగదెంపులపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ప్రకటన జాప్యం అవుతూ వస్తోంది. మణిపూర్ అసెంబ్లీలో 60 స్థానాలు ఉండగా.. బీజేపీ ప్రభుత్వం 55 మంది ఎమ్మెల్యేలతో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. అందులో బీజేపీ ఎమ్మెల్యేలు 32 మంది కాగా, ఏడుగురు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన వాళ్లు. ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు, మిగతా వాళ్లు ప్రాంతీయ పార్టీల వాళ్లు ఉన్నారు. జేడీయూ మద్దతు ఉపసంహరించుకున్నా ప్రభుత్వం కుప్పకూలే అవకాశం లేదు. అయితే ప్రాంతీయ పార్టీల్లో తాము బీజేపీ-బీ టీంలం కాదనే అసంతృప్తి బాగా పేరుకుపోయింది ఉంది. ఒకవేళ జేడీయూ గనుక వాళ్లను ప్రభావితం చేయగలిగితే మాత్రం ప్రభుత్వం సంక్షోభంలో పడే అవకాశాలు ఉన్నాయి.! మరోవైపు.. మణిపూర్ బీజేపీలో నేతల మధ్య అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. కీలక నేత నిమాయ్‌చంద్ లువాంగ్ తన మద్దతుదారులతో కలిసి సోమవారం ఇంఫాల్‌లో జేడీయూ పార్టీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఇదీ చదవండి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఆయన! -
ఆప్‌కు షౌకీన్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వానికి ఒకరి వెంట మరొక రు మద్దతు ఉపసంహరించుకుంటున్నారు. తాజాగా ఆ జాబితాలోకి స్వతంత్ర శాసనసభ్యుడు రామ్‌బీర్ షౌకీన్ చేరారు. స్థానిక ముండ్కా నియోజకవర్గానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న రామ్‌బీర్ షౌకీన్ సోమవారం మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను కలసి మద్దతు ఉపసంహరణ లేఖను అందజేశారు. దీంతో కేజ్రీవాల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న శాసనసభ్యుల సంఖ్య రెండుకు పెరి గింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కృతుడైన వినోద్‌కుమార్ బిన్నీ ప్రభుత్వానికి ఇప్పటికే మద్దతు ఉపసంహరించుకున్న సంగతి విదితమే.బిన్నీ, షౌకీన్ లతో పాటు తమ డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చిన మరో ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ మాత్రం ప్రభుత్వానికి మద్దతును కొనసాగిస్తున్నారు. -
'ఆప్'కు బిన్నీ మద్దతు ఉపసంహరణ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ బహిష్కృత నేత వినోద్ కుమార్ బిన్నీ ప్రకటించారు. బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజిబ్ జంగ్‌ను కలసి బిన్నీ ఆ విషయాన్ని వెల్లడించారు. అనంతరం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిన్నీ మాట్లాడుతూ... తాను డిమాండ్లు చేసి 48 గంటలు గడిచిన ఆప్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సరైన స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వానికి 'గంట' కొట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. హస్తిన వాసులకు విద్యుత్ ఛార్జీలపై 68 శాతం సర్ ఛార్జీ తగ్గించాలని, ఎటువంటి కండిషన్ లేకుండా ఒకొక్క కుటుంబానికి ప్రతిరోజు 7 గంటల నీరు అందించాలి అలాగే ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా 'ఆప్'లో అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బిన్నీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే బిన్నీ డిమాండ్ల పట్ల 'ఆప్' నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించింది. దీంతో ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. గతేడాది చివరలో న్యూఢిల్లీ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 70 సీట్లలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 28 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ 32 సీట్లలో విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ మాత్రం 7 సీట్లు మాత్రమే గెలిచింది. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బీజేపీని ఆహ్వానించారు. తాము ప్రతిపక్షానికి పరిమితం అవుతామని నజీబ్‌కు విన్నవించింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటు చేయాలని నజీబ్ జంగ్ 'ఆప్'ను కోరారు. దాంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
తొందరేం లేదు..!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి తమ మద్దతు ఉపసంహరించుకునే విషయంలో తొందరపడబోమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే ఆ పార్టీ పాలనాతీరుపై అసంతృప్తిగానే ఉన్నామని తెలిపింది. సోమ్‌నాథ్ భారతి వ్యవహారం, రాష్ట్రపతి తన గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఆ పార్టీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పైవిధంగా స్పందించింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ముకుల్ వాస్నిక్ మాట్లాడుతూ.. ‘ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఉపసంహరణ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మద్దతు పలికి రేపు ఉపసంహరించుకునే తొందర మాకు లేదు. అయితే ఆప్ ఆగడాలను చిన్న విషయాలుగా కొట్టిపారేయలేం. దేన్నీ తేలికగా తీసుకోం. అదే సమయంలో సహనంతో వ్యవహరిస్తామ’న్నారు. ఢిల్లీలో రాజకీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ క్షణక్షణం గమనిస్తూనే ఉందని, వాటిని సరిదిద్దుకునేందుకు ఆ పార్టీకి తాము ఎటువంటి డెడ్‌లైన్‌ను కూడా విధించడంలేదన్నారు. ఎన్నికల భారాన్ని ప్రజలపై మరోమారు మోపకుండా ఉండేందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి తాము మద్దతునిచ్చామని, ఆ పార్టీ ఏది చేసినా చూస్తూ ఊరుకుంటామనుకోవడం సరికాదన్నారు. ఇక బిన్నీ వివాదం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు వాస్నిక్ సమాధానమిస్తూ... ఆ వివాదం గురించి తాను మాట్లాడడం సరికాదన్నారు. అయితే బిన్నీ డిమాండ్లలో ఒకటైన సోమ్‌నాథ్‌ను తొలగించాలన్న వాదనకు తాము కూడా మద్దతు పలుకుతామన్నారు. రాష్ట్రపతి వ్యాఖ్యలను తప్పుబట్టేటంత సాహసం చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో సోమ్‌నాథ్ వైఖరిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. బిన్నీ లేవనెత్తిన అంశాలు తీవ్రమైనవే... ఇదిలా ఉండగా ఆప్ పాలనపై బీజేపీ నేతలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. వినోద్‌కుమార్ బిన్నీ ఆప్ పాలనపై, ఆ పార్టీ నేతలపై లేవనెత్తిన అంశాలు తీవ్రమైనవేనని, వాటిని కొట్టి పారేయడానికి వీలు లేదని, వాటిపై ఆప్ ఆత్మ విమర్శ చేసుకోవాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. బిన్నీ ప్రశ్నలకు ఆప్ నేతలు సమాధానం ఇవ్వాల్సిందేనని, ప్రజలు కూడా ఆప్ ఏం సమాధానమిస్తుందోనని ఎదురు చూస్తున్నారన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెంటనే స్పందించాలని తాము కోరుతున్నామన్నారు. బాధ్యతాయుతమైన పదవి లో ఉన్న ఆయన ప్రజలకు జవాబుదారిగా ఉండా ల్సిన అవసరముందన్నారు.